Blog Archive

Followers

Monday, December 27, 2010

నీడలనీడ

తాళంలేని తాళపత్రాల్లో అనేక తొనల ఫెళఫెళల గొంతుల భాషని ఎవరు విన్నారో. విరుగుతోన్న నాలుకపై చెదల నాలుకలు. అక్షరాలతో భక్షించిన సత్యమంతా తలతలల కల్పితమేనా. చింపిరి మాటల దాగుడుమూతల్లో రంగురంగుల రక్తం. విస్తరించని నేత్ర మౌనం. దోచుకోలేని అనాది పరిమళాల సృష్టి. నిలవనీడలేని గతం. తాకిన ప్రతీదీ ఒక చల్లటి స్వగతం. అడ్డుగోడలు తునాతునకలయ్యే తలక్రిందులయ్యే శరీరంతో ఉన్నానేమో. తారట్లాడే నిగనిగల తారల తడి పాదాలు బురద ఆకాశంలో మెత్తటి ముత్యాలు. మారుతాళాలులేని సూర్యుడు ఏ వాక్యంలోనో చంద్రవంకై. నువ్వు ముట్టుకునే రొమ్ముల్లా. ఇబ్బడిముబ్బడి నగ్ననటనలు పాదాల మధ్య కునుకు కుంకుం చెరుపుకుంటూ అనాక్రందనతో. కలవని కళ్ళతో భీతిల్లిన నిరీక్షణతో వీర్య శాంతి. విధేయ దేహం విరోధే. ఎవరి దయో కనికరించే ప్రతి శ్వాస తలారికి. జరుగు జరుగు జరుగుబాటు లేనోడ్ని. తాళం లేని ఆకలి మబ్బుల్లో అనేక నీడల నీడలు.

Saturday, December 18, 2010

సగం అద్దం

నా అద్దంలో
కొన్ని భూకంపాలు ఉన్నాయి.
ఏదీ విరిగిపడదు.
పగలదు.
ఒరగదు.

నా అద్దంలోంచి నీ అద్దంలోకి
చూస్తాను.
పగిలిపోతాను.

ఈ అద్దాల దూరం ఎంత.
దూరమైన అద్దాలతో ఎవరు చూస్తారు.

నీటి సాలీడొకటి అద్దం లోపల
లోపల కూర్చుని నా వంక చూడక
నీ అద్దం లోపలున్న పదాల కలలకై నిద్రిస్తోంది నిలబడి.


నేనొక అద్దమైతే
నాలుకతో ఎవర్ని వెక్కిరించాలి
కన్నీటి సూర్యుడినా?

Sunday, December 05, 2010

నీడలు

ఎవరి నీడో నాలుకపై
ఆనందంతో లేదు
నోరుమూసుకోలేకున్నాను

ఎండిన ఆకుపై నీడ
ఏ చెట్టుదో
ఎప్పటికి తెలిసేది

కొన్ని నీడలు తియ్యగా చేదుగా
నల్లటి మాటల్లోని నీడలే
ఎప్పటికీ రుచీ పచీ లేకుండా

ఎగురుతున్న నీడల్లోకి
స్మశాన బూడిద తోడైంది
ధన్యులు

నీడలని
కుట్టుయంత్రంలోకి ఎన్నిటిని పంపినా
అవి చిరిగే వస్తున్నాయి

ఏడుస్తున్నప్పుడు
ఏ కంటితో చూస్తాము
ఎక్కడ చూస్తాము

ఉత్తరాలు ఉత్తరంనుంచి రావు
ఉత్త ఉపయోగమేదీ లేని ఉత్తిత్తి గాలి
కొన్ని ప్రతిబింబాల్ని ఎక్కడికీ చేరవేయదు

నీడలతో నీడల్ని తయారు చేయొచ్చు
నిశ్శబ్దంతో నిశ్శబ్దం ఎవరు తయారు చేస్తారు
తయారయ్యే నిశ్శబ్దాల వెంట ఎవరైనా వెళ్ళరా

Saturday, December 04, 2010

చూడని అద్దంకై

ఆకాశం
మేఘాల్ని మార్చుకుంటోంది.
పువ్వులు ఆకాశాన్ని మార్చుతున్నాయి.

...

నిద్ర పైన నిద్ర
నిన్నటి నిద్రలోకి నిద్ర
నిదురించు నిద్ర లేదు

..

గాడి తప్పని మాటలు
గడ్డితో కప్పిన మాటలు
తెగులు నాలుకకి వైద్యుడు రాడు

..

రాని చంద్రుడి కోసమే
రాత్రంతా నక్షత్రాల రొద
పిట్టల కలలు చెదిరాయి

..

రైలు పట్టాలని
అడివి చూస్తోంది
ఏ ఊరూ చేరువలో లేదు

..

నిన్నే కలుసుకోవాలని
అడవి దాటాను
నిన్ను కలవకుండా ఉండాల్సింది

..

చర్మాన్ని దానం చేయాలి
ముసలి అద్దమే
అడ్డమొస్తోంది

..

చీకటి రాదు
అద్దంలో చూస్తుంటే
చూస్తున్న అద్దం, చీకటీ ఒకటేనా

Tuesday, November 30, 2010

వాన మొక్క

అనుకోవాలి.

రేగుపండు గాలి వాసనకి
వేపపూత మబ్బుల వాసనకీ మధ్య.

ఒక పాత కంటిలో కొన్నే కనులు.
పాటలు పాడిన కళ్ళతో
జ్ఞాపకాలకై ఎదురు చూడాలి.

అనుకున్నా. కళ్ళు ఎంతో పాతవని.
పూలూ పాతవే.
మాటల్లోని మాట్లాడని మాటలూ పాతవే.

అనుకోకుండా.
శరీర అస్పష్టతతో
ఇక్కడ ఏదీ జరిగినట్టు ఉండకూడదు.

చల్లటి కాంతి కావాలి
ఎవర్నో చూసేందుకు.

అపవిత్రతతో నవ్వుకోవాలి
పవిత్రతతో ఏడవాలి.

అనిపిస్తేనే.

సెలవులు లేని కొండల నుంచి
విశ్రాంతి లేని మేఘాల నుంచి
జీవించే మృత్యువు నుంచి దాక్కోవాలి.

గాలీ
ఉన్మాదే.

మారుతున్న నిన్నటి నీళ్ళపై
గూడు వొదిలి రాగలిగే నీరు ఏది.

కంటిలో పెరుగుతున్న నాచు పూలు.
హృదయం ఎండిపోయే వాన మొక్క.

ఓ సీతాకోకా!
నీ మనసు నీకన్నాఎంత బరువు?

Friday, November 26, 2010

హాఫ్ లాంగ్ కి.............. దూరంగా

ఎందుకు వొచ్చాను
పదునైన సూర్య నిశ్శబ్దంలోకి
..

ఉసుళ్ళు నిద్రపోయే చీకటికి
నేనెంత దూరంలో ఉన్నాను
..

కళ్ళల్లోకి తిరిగెళ్ళే ముళ్ల మాటలు
ఏమి చెప్పాయో మనసూ చెప్పదు
..

నమ్మకం లేదు
నీటితో
నీటిలో బతికే జీవుల మీద
..

కన్నీటిపై
కన్నీరు
ఎవరు చూస్తారులే
..

కీటకాల కాలం ఏమిటో
వాటి అరుపులు, నావి
ఎపుడు ఒక్కటవుతాయో
..

చరిత్రలేని చరిత్రకి
చరిత్రలేని మనుషలకే
చరిత్ర సుదీర్ఘంగా
..

ఏ కాయితపు బెజ్జంలోంచో
అక్షరాలు మాటలై పడిపోతాయి
వాటికై ఆకాశంలో యెక్కడని వెతకను
..

చలి చంద్రుడు
వెచ్చటి సూర్యుడికై
రాత్రంతా కలియతిరుగుతూ
..

కొండల పైన
కొండల కింద మనుషులే కానీ
మనిషిలో ఏ కొండ లేదు
..

సీతాకోక చిలుకా!
నీ నగ్నత్వాన్ని ఎవరికి చూపించావో చెప్పు
వారికి ప్రణమిల్లుతాను

Saturday, November 20, 2010

ఎక్కడైనా

ఊపిరి లేని పదాలకై
పదాల లోపల పదాల వెతుకు

లోపలి శ్వాస
సువాసన లేని నిశ్వాస

ఎవరి ఆఖరికీ
ఉండని గాలి, గాలి

వాక్యం
వాలుతున్న పర్వతపుమొన

మేఘ
అవిశ్వాసం

కట్టకట్టుకుని అక్షరాలు యేవో
వేరే యేవో చెపుతాయి

మోకుల్లాంటి మాటలు

మాసిన పదాలతోనే
పురుడుకై వెళ్ళాలి

వాక్యం
అంతర్గత ఆత్మ హత్య

జనించే మృత్యువు
మరనేచ్చకై జీవిస్తుంది

వ్యాకరణ వాక్యాలతోనే
విషం నింపాలి

గొంతుకోసినా
ఊపిరి నీడ దక్కాలి

ఎప్పటి నిద్రలోకో
సూర్యకాంతి సాయంత్రానికి వస్తుంది

ఇంకొంత
ఈ పూట ఎక్కడైనా

ఊపిరిని వొదిలి రావాలి
ఎవరికీ తెలియనట్టు

Friday, November 12, 2010

హాఫ్లాంగ్ కవితలు

మేఘాల రవిక
ఈ నీలి కొండలపై.
ఆకాశం తొంగిచూస్తోంది

--
చంద్రుడి అడవిలో
దారులన్నీ జలపాతాలే.
ఒంటరి చీకటికి దారి ఏది.

--
ముఖాలు లేని మేఘాలు
ఎక్కడున్నా దీవిస్తాయి
అర్హత ఎవరికి కావాలి?

--
కొండల్ని, స్త్రీలని
ఎల్లప్పుడూ ప్రేమిస్తేనే
సూర్య విశ్రాంతి

--
నిశ్శబ్దం
సముద్రాలకి, కొండలకి తెలిసినట్టు
స్త్రీకే ఎందుకు తెలియదు

--
పగటి మేఘాల్ని చూసి
రాత్రి మేఘాలు ఎన్నడు
చలించాలిలే

--
జ్ఞాపకాలు
కన్నీళ్ళపై మిగిలిన
నేత్రాలు

Wednesday, November 10, 2010

ఆమె గొంతులో

ఇపుడు వొచ్చిన
రాత్రిని ఎలా పోమ్మనాలో
ఆకాశంతో ఏ కలా చెప్పదు

మనం చెప్పుకుంటున్నవన్నీ
అద్దం లోపలి మాటలే

ఏ కడలి చాయో
గాలి చలికి వణుకుతుంది

నా కన్నీళ్ల ఇంట్లో లేదు నిద్ర
నిద్ర పెదవుల్లో సూర్యాస్తమయాలు లేవు

కలలకి కళ్ళు దూరమే ...

ఆమె గొంతులో
ఓ చిన్న రాత్రి ఉదయిస్తోంది

మళ్లీ బతుకుతాను
ఈ రాత్రిలో

Monday, November 08, 2010

నీ రాత్రి నీకు

ఎన్నో సాయంత్రాలు సూర్యుడికి

ఏ ఒక్క సాయంత్రమో నీ దగ్గర

పలకలేని మాటల నిశ్శబ్దంలో ఆకాశం

మేఘాలే కొండలపై , కొండల కాళ్ళపై పడి అలిగి వెళుతున్నాయి

ఎప్పటికైనా ఒక నదిని దాటి వెళ్ళే చంద్రుడ్ని చూడాలి

చిక్కిపోయో చిక్కుకుపోయో ఉండే ముఖం చూడాలి

ఆగాలేమో

లేచివుల్ల ముత్యపు చినుకుల పర్వతాల్ని చూడాలంటే

నీటి విరూపాల్ని దాటే ద్వారాల్ని తాకాలంటే

రహస్య పదాల మౌనంలో సంభాషించాలంటే

ఎక్కడా ఇటువంటి సాయంత్రాలని కోరుకోకు

ఎక్కడైనా నీ సాయంత్రాలు నీకై ఉంటే

నీ ప్రేమల్ని కాస్తంత గురుతు చేసుకో

నీ జ్ఞాపకాల్ని కాస్తంత ప్రేమగా గురుతు చేసుకో

నీ గడిచిన దినాల్ని మరీ ఇబ్బంది పెట్టకు

అవి ఎవరికీ చెంది వుండవు

ఏ సాయంత్రమో

నీ దగ్గర

ఒక అనామక రాత్రి నీకు తోడువుంటే

నీ

రాత్రి నీకు ఉన్నట్టు

కాదూ

ప్రేమకి

రాత్రులతో పని ఏమిటి

కొన్ని సూర్యోదయాలు

మరికొన్ని సాయంత్రాలు కావాలి

Wednesday, October 27, 2010

సమాప్తం ఒక స్థలం ,,,అనుకుని అనుకోని అవతలి తల తలరాతలో తడి ఏదీ దగ్గరకు రాక,,, ఒక స్థలం సమీపించింది


ఆఖరి నేత్రాన్ని రక్తపుగనులు తవ్వినట్టు వెలికితీసి తాకని వాటి గురించి ఆలోచించాలి, ఏమీ ఎరగనట్టు, ఏదీ చేజారనట్టు, మాటల మౌనం నలిగినట్టు, ఏదో పలికినట్టు, ఆ నీటిని పట్టుకునే ఫట్మని మిగలాలి, పట్టుమరి, పట్టుమని ఎవరికీ యావజ్జీవ బతుకు లేదు మరి.

ఎదకి ఎడమైనా, ఎడారి ఆకాశ స్నానంలో, ఏ స్నానమూ తిరిగిరాని మబ్బులతో తిరిగి, చూస్తున్నవన్నీ ఆగినట్టు, ఆపినట్టు ఉంటుంటే, ఊపిరి కొస తెగిన చప్పుడు తెలి
యనట్టు నిద్రిస్తుంటే, ఎప్పటికీ ఏ ఆనందమూ రాని శోక స్థూపాలపై పాకే పూల తీగల్ని చూసి, మైమరుపో, మరుపో ఉంటునట్టు ఉండే మౌన ధిఖ్ఖారాల ఓదార్పు దుఖమై, ఎవరి శూన్య స్థలంలోనో సంచరిస్తుంటే, లేనివేవో లభిస్తుంటే, వృత్త విమోచనాలు వాపసు తీసుకుంటే, ప్రతి నమ్మకం ఒక స్థిర అబద్ధమే.


వణుకుతున్న గడియారపు ముళ్ళపై నడవలేకే, ఎటూ పోలేకే, దిగమింగుకునే శ్వాసల్ని దింపుకుంటునట్టు దోబూచులాడాలి. సెలవులు పెట్టకుండా.

Friday, October 22, 2010

ఏదో,,,

ఏదో
ఓ రాత్రిని దూరం చేసి
నీకూ లేని రాత్రితో
కొండల మధ్య
దైహిక సూర్యాస్తమయాల
మేఘాల స్వప్నంలో ఎవరూ లేరు

వర్షం కింద మేఘాలు
వేగం లేని బుర్ర బురద
ప్రవహించే ఇంద్రియ ముద్రలు

స్త్రీ లేని (ప్రదేశంలో ఉన్నప్పుడు )
రహస్యం ఎక్కడో ఉంటుంది

బాష రాని శూన్యం
శూన్య శోకం

మత్తులో లేని
మాటలే మిగులుతాయి

నిద్రపోయే కొండల ఊపిరిలో
మేల్కోవాలి

ఆఖరి నిద్ర కింద
ఎవరూ లేరు

Sunday, October 17, 2010

హాఫ్లాంగ్ కవితలు

ఒంటరి సీతాకోకచిలుక
రాత్రి -
రెండు నిద్రలు కలలో
_____

ఆమె గొంతులో
ఆమే లేని ఆమె
_____

అద్దం కింద అద్దంలో
స్వప్న ముఖాలు
ప్రేమించే కాలం
_____

మేఘాలు, వక్షోజాలు
అధరాలలో
చాయా శిల్పాలు
_____

కొండల దారి
ఆకలి వాన
తడవని నేల
_____

ఒంటరి గది
నేను లేను
రాత్రే వేరు
_____

పువ్వులు
మబ్బుల్ని పిలిచాయి
ప్రేమతో

Monday, September 27, 2010

అద్దం ,అద్దంలో చూసి

ఏమీ లేని ,అక్షరాలు లేని ,వాక్యాల లోపల ,పదాల జ్ఞాపకమో ,మాటల దుఃఖమో ,నలుపుకుంటూ నల్లటి లేత నలుపు అద్దం ,అద్దంలో చూసి ,తేలికైన తడబాటు తారట్లాట తృప్తికి ,తనువుకీ తట్టని తలరాత తారతమ్యాల తలపోతల తరుణంలో ,ఋణ మరణం ,తలవంపుల వంపుల విఫల శ్వాసల ఛాయలో ,ఆపై ,ఆపే ,ఆగే ,ఆకృతి అంతంలో ,అంతిమ ఉయ్యాల ,ఆమనికీ ,భూమికీ ,ఆఖరి నిశ్శబ్దం ,తనకే ,తనదే ,అని ,అందరికీ ,చెప్పుతూ ,చాటుతూ ,దాటుతూ ,దాటవేసే దారులు ,ఎవరెవరివో ,ఏమీ ఉంచుకోని అలల తలలా ,తపనల కడలికి ,కదలికలకి ,కలవని కన్నీటి కళ్ళతో ,కనికరం లేని కావలి కళ్లకి ,కలైనా రాని కలలో ,ఏదీ ,ఏదీ ,కనిపించని ,ఏమీ లేని బరువు అక్షరాలు ,బలహీనమైనవి.

Thursday, September 16, 2010

ప్రేమతో

దూరం దొరకదు
దొరికే దగ్గరతనమూ దొరకదు
పద దూరమవుదాం
పదాలు దూరమైతే
నశ్వర సుఖాలు
అవసరం
అనవసరం
ఆందోళనలే వాక్యాలు
వాక్యాలే ఆందోళనలు

"writing is the opposite of working" - georges bataille

పసి రోదనే దూరం
దూరమవ్వాలి ఏదీ దగ్గరగా లేనపుడు
ప్రేమతో

మరొకరిలోకి

బయలుదేరాలి
ఒకరి నుంచి మరొకరికి
మరొకరి ఒకరిలోకి

చేరని విరామ దుఃఖమే
కొత్త లోకపు పునాది

మాటలు మాటలలోకి
ఇంకే మాటల సాన్నిహిత్యం

తెరవని వాక్యం కింద లేరెవరూ )( పరితపించే పదాల మధ్య మిగలరెవరూ)( రక్తపు నీటిలో ఈదుతుండే అక్షరాలని ఆపేదెవరు)

(వెనక్కి నడిచే చీమలు)( విత్తనాల్నితగులపెట్టే కళ్ళు )

( అండ త్రిభుజాలు)( సామూహిక వాంతులు)

( నిద్రించే దేవాలయాలు)
( దేవులాడే దాహార్తి)

విస్తరించు నర్తించు నటించు(

)మూసిన వాక్యంలోకే ప్రవేశించాలి)( ఆరబెట్టిన పదాల్ని వెంటేసుకుని

మరొకరిలోకి
ఒకరెవరో నిష్క్రమించాలి

Tuesday, September 14, 2010

వెతుక్కోవాలి

మురికి కంటితో

చేతులు కలిపాను

కలిసాను దురద పెట్టే అన్నింటితో


గొంతులోకి తొంగిచూసి

ఊపిరిని ఎగదోసి

పెదాలపై నడిచి

నన్నొదలటం లేదు

నకిలీ మాటలతో

నకిలీ నాలుకతో

నిన్నటిలోకి నెట్టింది


రేపటికి చూపుని వెతుక్కోవాలి


Monday, September 13, 2010

రాయాలి

నాలుకకి ఓదార్పు కావాలి

కాలాన్ని నాలుకతో వృధా చేయాలి

నలుగురు చేరని నాలుకతో జీవించాలి

కన్నీళ్లు రాని ఒక కన్నైనా ఉండాలి

కళ్ళు లేని మనసు పుట్టాలి

మెదడులో ఎండిన విషరక్తచారికల వాసన

నిద్ర చర్మాన్ని వొలుచుకుని తింటున్నారు

రంధ్రాల పడ్డ అక్షరాల్ని నేయాలి

మాటల బొమ్మలులేని వాక్యాల్ని రాయాలి

చెరిపేయాలి నిజాల్ని వల్లించే పదాల్ని

మరునాడు లేని రోజులో ఉండాలి

సెలవు చెప్పని కలల్ని వెంటబెట్టుకోవాలి

అనునిత్యం మరిచిపోయే జ్ఞాపకాల వెంటపడాలి

గోతులు గోడలు గోడు చెప్పే మాటలు
నదులు సముద్రాలు నీతులు చెప్పే మాటలు
చేపలు పిట్టలు చెప్పే మాటలు

రాసుకోవాలి
రాయాలి

Sunday, September 12, 2010

ఖాళీ లేని శూన్యం

నా బయట కొన్ని అచిత్రాక్షరాలు

నీ
లోపల మరికొన్ని అక్షర చిత్రాలు

ఎవరి
సంకేతాలు ఎవరికి చేరతాయి

చేరని
సంఘటనలు ఎవరివి

ఎవరెవరి
కోసం

సంజ్ఞల నిశ్శబ్ద స్పర్శ

స్పర్శల
సంకేత నిశ్శబ్దం

ఎవరిని వెతుకుతుంది

యధాతథ
యథార్థాల్లో యాత్రించే

యముని
యశస్సు యెంత

ప్రతిదీ
ఒకానొక చిత్ర వ్యక్తీకరణ

అవ్యక్త
చిత్ర పదాల్లో నిజమెంత

పదాల
అనుభవంలో నిజం ఉందా

లిపిలేని ఆలోచనలనే అనుభవిస్తున్నామా

ముడిపడని
ముడివిడవని మాటల అనుభవం ఏమిటి

ఖాళీ లేని శూన్యం

ప్రవేశించే
పదాల ఖాళీలో అనుభూతి యెంత

తిరిగి
పలకని కల

Thursday, September 09, 2010

మసక మాటలు

అందరి పాదాల ముందు మసక మాటలు రాలి వాలిన నెలవంక వంక చూసే చూడనట్టు నటించిన సూర్యుడి ముడతల కంటిలో ఇరుక్కోవాలనుకున్న ఉడత మడత తోక తొడతో కోసుకుపోయిన చంద్రుడి ఊడల నవ్వులకేసి ఊగుతూ ఉంటే వాసనేస్తున్న వాన పదాల దారాల్ని తుంచుతూ వొంచుతూ లాగుతూ తాబేటి మెడ కింద దాగిన సముద్రపు నక్షత్రాలు నగ్నశాంతిని తాగుతూ ఉంటుండగా పూసిన ఈకలతో కాయితాలపై ఎగురుతున్న చెవుల వంతెనల కింద కొట్టుకొస్త్తున్న కుట్టుకొస్తున్న కన్నీటి చిరుగుల బొమికల రెక్కల్ని జాగ్రత్త చేస్తూ వాచిన వాచీ సమయం తేలుతూ పైకి లేస్తుంటే కారుతున్న జ్ఞాపకాల వడపోతలోంచి వొడలిరిగిన వోటమి జీవితాన్ని వొదలక ముగింపు లేక అక్కడక్కడ కవిత్వపు నక్కల నకలు వాక్యాలతో నిద్రిస్తుంటే జారుతున్న చీకటి దేహ ఖైదీనై మరణించు మరణించు మరణించు అని ఆదేశించే ఆత్మని తన్నకుండా విడిచిపెట్టేలోపే ఎక్కడ్నుంచో మనల్ని చంపే గాలిలో జెరాక్స్ చావులు యెగిరి వొస్తుంటే ఆసుపత్రి ఆకలిగా ఆవులిస్తోంది మర్చిపోయిన అక్షరాల్ని మగత గతంలో నెమరేసుకుంటూ దవడల వొదులు వొదులు పదాల్ని నల్లగా చప్పరిస్తూ చెట్లపై ఊగుతున్న చంద్రుడ్ని చూస్తున్న కలువలన్నీ ఏదీ వినటం లేదు ఆఖరి రంగు ఏదో చూడటం మానుకున్నాయి అప్పటికే అప్పటి పాదాల కింద ముసలి రూపం అద్దంలో నడిచిందో ఎవరూ చెప్పలేదు చెప్పరెవరూ మరణమూ ఒక జీవితమే అని అనుకోకుండా ఉండాలేమో తల్లీ నదిలో అందరి పాదాలు మసక మసకగా మునకలేస్తూ అడుగుజాడలు లేకుండా వర్షంలో వర్షం తెగుతూ ఎగురుతూ మిగలని చీకటిలో వణుకుతూ...

Sunday, September 05, 2010

కంటిలో కన్ను

అస్థిర నేత్రం \\ ఆవిరయ్యే నిశ్శబ్దం \\ నకలు లేని చావు \\ ఆటు పోటుల దుఃఖం \\ చల్లటి మౌనం \\ చావుకి చందాలు \\ పేగులో ఆకాశం \\ గాలి గట్టిపడింది \\ నిద్ర చనిపోయింది \\ అపవిత్ర జ్ఞాపకం \\ వాసనేస్తోంది \\ వినాలి \\ అస్తమించే కాలాన్ని \\ చినుకులు \\ ఏ రాత్రీ లేని రాత్రి \\ ఒక ఒంటరి లోచూపు, శూన్య స్తనం \\ పసి సూర్యుడు \\ కంటిలో కన్ను \\ మిగిలింది \\ ఎంగిలి చావు \\ తప్పదు \\ మోసిన కన్ను \\ మూసిన ముక్కు \\ మరువని మవునం \\ తండ్రీ \\ నీ సమక్షం లేని లోటు \\ నువ్వే ఏర్పరిచిన వెలితి \\ ఎలా \\ ఎలా \\ ఎలా భరించాలో చెప్పీ చెప్పక \\ అర్థమయ్యీ అర్థమవ్వక \\ ఇబ్బంది పడుతున్నా

Saturday, August 28, 2010

కాలం || కాయం

ముడుచుకుపోతున్న పదాల శరీరం || వివరించని ఆంతరంగిక జిహ్వ || అనాధ వాక్యాల్లో విరక్తి విషం ||కాటికాపరి ఎదురుచూపు || ఆశల నిషా || శాప శాంతి || నిరాకార దహనారంభం || నవ్వే చీకటి || కన్నీటిపై ఎగిరే సీతాకోకచిలుక || సముద్రపు నీడ || మూత్రపిండాల గాలి || వల || స్పర్శ సర్ప సూర్యుడు || వెన్నెముక విత్తనాలు || ఉత్తుత్తి ఊపిరి ఉయ్యాల || బంధించే బాధలు || కలల రాకపోకలు || తెగవు || ఆఖరి ఆలస్యం || ఊహించని అహింస || నీడల్ని వింటున్న నీడలు || అక్షరాలు వైపు అడుగులేసాయో || వాక్య శ్వాస చెప్పదు || ప్రేమించే అంధకార స్పర్శ || స్మశాన గర్భం || రహస్య స్వర్గం || అపూర్ణ వలయం || అసంపూర్ణ మరణం || మనసు మూత్రం || కల నాలుక || వడలిపోయిన కుబుసం || కరుగుతున్న అద్దం || రక్తంలేని శ్వాస || మాట్లాడని మనుషుల మాటలు || నాచు పట్టిన గాలి || ఒక్కసారే || ఎముకల కలలో భగవంతుడు || చోటులేదు || వర్షంపై వర్షం || రాత్రి వొదిలిన చీకటి || అర్థరాత్రని తెలియని చావు || మూట || నవ్వని కనుపాప || ఓదార్పు || హస్త ప్రయోగం || యోగ యోని || యోచన || నిశ్శబ్ద నిరాలోచన || ఎండుతున్న కన్ను || గాయం || కాలం || కాయం || మాయం || అపవిత్ర మిత్ర చిత్ర మౌన పదం || మృత్యువు || కాలంలోనే ఉంటూ కాలం చేయాలి || కలకాలం || తల్లిదండ్రుల భాష పోతోంది || ఈ-చర్మం కుట్టుకోవాలి || కట్టూబొట్టూ తిరగేసి కట్టాలి || వైరాగ్య అవిశ్రాంతి || సమాధి || మెదడులో ఉమ్మనీరు || తర్ఫీదు పొందని నిద్ర || జవాబులు || నగ్నాస్థికలు || కూరుకుపోతున్ననల్లటి జ్ఞాపకాలు || తేలని తెలుపు తప్పులు || బతికిలేని వాక్యాల్లో శరీరం || గోడలు లేని శవం || మళ్లీ ఎదురుపడలేము నాన్నా...

Friday, August 13, 2010

ఆఖరి అడుగులు

పిట్టల మాటలతో
చినుకుల చిందులతో
ఇంద్రధనువు ఎగురుతోంది

కంటిలోని నిద్రతో
కలలోని కన్నీళ్ళతో
చేపొకటి తప్పిపోతోంది

కలల కప్ప గెంతుతూ
బాతు మెడని తొలుస్తూ
రాత్రేదో సూర్యుని ముందు

కెరటాలు లేని సమయం
పడవలు మునిగిన ఆకాశం
చల్లటి నిశ్శబ్దం

పాదముద్రలు లేని
శ్వాస అధరాలు
ఆఖరి అడుగులు వేస్తున్నాయి

Tuesday, August 10, 2010

గాలి అద్దం

ఒకానొక అతడి సాయంత్రంలో
అతడ్ని సూర్యుడు వెంబడించాడు

ఒకానొక అతడ్ని వెంబడించే
సూర్యుడు సాయంత్రమయ్యాడు

ఎవరికో చెందిన అతడు
సాయంత్రాన్ని సూర్యుడ్ని
కలిపి కుట్టలేక ఒకానొక అద్దంలో నిష్క్రమించాడు

ఎవరికీ చెందని అతడు

సూర్యుడి సాయంత్రాన్నివెంబడిస్తుంటే
ఎప్పటికీ లేని రాత్రేదో భూమిలో తిరుగుతోంది

అతడు తిరిగిన భూమి ఎవరిదో
ఎవరి రాత్రిలో అతడు ఉన్నాడో
ఒకానొక అద్దమైనా చెప్పదు

ఎవరికీ ఏదీ చెప్పని ఒకానొక రాత్రి

అతడ్ని వెంబడించేలోగా
గాలి అద్దం వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుంటోంది

ఎవరికీ చెందని ఒకానొక గాలే

అతడ్నీ వెంబడిస్తోంది
చిట్టచివరి నీడ కోసం

Thursday, August 05, 2010

శితి

సంచరించు. గబగబా మాటల దూరాన్ని అందుకో. దారి లోపల దారి. నిశ్శబ్ద సూర్య సమయమిది. స్వాగతించే నిర్మల నిశీధి. త్వరత్వరగా చేరే పదాల్లో అలుక్కుపోయే నిస్సహాయ గతం. సైగలు చేసే వాక్యాలు. పలకరెవరూ. పదిలపర్చుకునే అస్థికలు లేవు. హుటాహుటిగా అశ్రువుల్ని తరలించే శరీరం. తొందర తొందరగా తారీఖుల్ని మూటకట్టాలి. చీకటి కిరణాలు. పదే పదే వెంబడించే ఒంటరి గాలి. లేరెవరూ వారి వారి సమాధి దగ్గర. స్పర్శరహిత ప్రదేశంలో పరిభ్రమించు. నిర్గమ్య మార్గాలుండవు. పగిలిన సూర్య దర్పణం. ఆశ లేని అశాంతి. స్నానం చేసే చంద్రుడు. కదలకు. ఆకుల్లోంచి సముద్రాలు రాలొచ్చు. నక్షత్రాలు మట్టిలో పెరగొచ్చు. నవ్వుతున్న అంతిమ యాత్ర. గుండ్రటి చెట్లకీ తెలుసు మరణించే వాయువు తమతో ఉందని. అలల పాదాలపై నడవాలి. అచ్చుతప్పులున్న మృత్యువు. సరిదిద్దే బతుకు బలపం విరిగింది. మెత్తటి నీడలో సీతాకోకచిలుక. ఉప్పటి వియోగం. రాయని అక్షరాలపై పాకే మూగ వెలుతురుని తుడవాలి . పచ్చటి ఏకాంతంలోకి ఎగిరిపో, ఎవరిలోనో జ్ఞాపకపు ద్వారాలు మూతపడేలోపు. పొడవాటి కళ్ళల్లో గడ్డి పెరుగుతోంది. గాలి నిద్రపోతోంది.

Wednesday, August 04, 2010

ఒక తూరి...

తెల్లటి నవ్వు కింద చెద పురుగులు చేరి, పాము పెదాల్ని తింటుంటే, అవి, మావని, చలి చీమలు పోట్లాడుతున్నాయ్. ఇంతకీ, ఆ నవ్వెవరిదో.

పాము చనిపోక ముందు, కొన్ని జంతువులు ఎల్లవేళలా ఘర్షణలతో కాలసంధ్యల్ని మరిచి యుద్ధరంగంలో వంతుల వారీగా పోరాడుతుండేవి. ఈ జంతు సంగ్రామాన్ని నిలువరించాలని దేవతలందరూ కల్సి మహిమాన్వితుడ్ని ప్రార్ధించగా, కలియుగారణ్యంలో తపోదీక్షలోనున్న వృద్ధ మూషిక ముని వద్దకు వెళ్ళమనగా, వారంతా ఆవేదనా నైవేద్యాలతో వేడుకోగా, సరేనంది.


కొన్నాళ్లు జంతువుల హింసాహింస రణరంగం ఎందులకో మూషిక ఋషి అధ్యయనం చేసిన పిమ్మట, యోధుల్ని, వారి బానిసల్ని తన చావిడికి విందుకు పిలిచింది.


సాంస్కృతిక కార్యక్రమాలనంతరం, ఒక మంత్ర ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దైహిక రూపురేఖల మార్పుకు సిద్ధమవ్వాలని విన్నవించింది.


అమితానందడోలికల్లోంచి తేరుకోకముందే, రాతిరి ముదరక మునుపే, మూషికా ఋషితుల్యుడు మృగ సమాజ సభను ఆరంభించేడు.


'మహా జంతువులారా! మీరంతా వీర పరాక్రమశీలురు, వినయశీలురు, మిత్ర సఖ్యతోపాసకులు, నీతి దురంధరులు. ఇప్పటి అత్యవసర సమావేశానికి హాజరైన మీకు ఆ అపార కరుణా కృప కల్పకేతువుని ఆశీస్సులు మనపై ఉండుగాక.


నేటితో మీరు కొనసాగిస్తున్న, సాగదీస్తున్న, పోషిస్తున్న విగత కక్షలు కార్పణ్యాల్ని వదిలి, మీకో నూతన రూపాన్ని ఇయ్యమని పై వారి ఆజ్ఞ. ఈ రూపంలో మరలా మీ విషాల్ని జిమ్ముకోవచ్చు. మీరంతా ఆరాధ్య దైవాలవుతారు. అంచేత, మీరంతా నోళ్లు మూసుకుని, తెరుస్తూ, పాకుతూ, రెండు నాల్కలతో సదా ఉండేటట్టు దివ్యవాక్కు మీకు చెప్పమంది. ఇకపై, కొమ్ములు, కాళ్లు, చేతులు, తోకలు లేనివారై ఉద్భవిస్తారు. మాహాజన్మ ఎత్తబోతున్న మీకివే నా శుభాకాంక్షలు', అన్జెప్పి మంత్ర జలాన్ని జల్లగా జంతువులన్నీ వేర్వేరు సర్పావతారాలెత్తాయి. (కొన్నిటిపై ఆ మంత్ర జలం పడకపోగా, అవి అట్లే అవతరించాయి)


ఆ కాలం నుంచి ఇప్పటి వరకు పరాక్రమవంతులైన జంతువులన్నీ మార్పు చెందటం చూస్తున్నప్పుడు అనుకోకుండా అనకొండ తోకలాంటి నవ్వు తెల్లగా వచ్చింది కురువృద్ధ మూషికం మీదికి.


అది ఎవ్వరిదో, ఎక్కడిదో, బొద్దింకలకీ అర్థం కాలా.


అలా ఒక తూరి జరిగిందో, పునరావృతమవుతుందో చెప్పట్లేదెవరూ.


పాత రూపాల పగల్ని వీడి, కొత్త రూపంలో జనించిన అన్ని చెత్తాచెదారాల హింసాత్మక ప్రణాళికల్తో అభివృద్ధి చెందుతూ, సమస్త దేశకాలాల్లో సర్పాలు విజ్రుంభిస్తూనే ఉన్నాయి, తెల్లటి నవ్వు కింద.


---9-03-2009, వివిధ, ఆంధ్రజ్యోతి---

Saturday, July 31, 2010

రెండు కెరటాలు

తడిచిన కెరటం,
"సుదూరం నుంచి వొచ్చాను. నిలువనీడైనా లేదు. కాసేపు ఎక్కడా నిలదొక్కుకోలేని నిరాశ్రాయుడ్ని."

అదే పనిగా, ఈదులాడుతున్న ఒక పొడి కెరటం,

"మాతో ఉండాలంటే, ఒక షరతు. తడి తడిగా దప్పికతో ఉండే వాటితో మేముండలేము. మరణ ద్వారాల్ని తెరిచి రాగలిగే శ్వాస లేనోళ్ళం."

వెనక్కి మరలే కెరటాలే ఉండుంటే...

Friday, July 30, 2010

గాలి దాక్కుంది

కొన్ని తెల్లటి మాటలు
అక్షరాల్ని తెలుపుతూ నలుపుతూ
పదాల పల్చటి పాదరసం గాలిలో

కనుమూయని నీటి పాదముద్రలు

కనుగొనని అంతిమ స్వప్నానికై
కడసారి కరచాలనం చేశాయి

రెక్కలూడిన గాలి
విరామచిహ్నాల శ్వాస
వీడ్కోలు వీధిలో

దీపం లోపల దీపం
మడతలులేని నీడలు
ముడతల మౌనం

హాజరు
గైర్హాజరు
మృత్యువు

స్మశాన దర్పణం
దుఃఖితుల రూపురేఖల్లో
ఖాళీ జ్ఞాపకాలు

కొన్ని నల్లటి మాటల కట్టెలు
వాక్యాల్ని విరుస్తూ పేరుస్తూ
మునుగుతూ తేలుతూ
పదాల నీటిలో

గాలి దాక్కుంది
నా నుంచి

Wednesday, July 28, 2010

వెళ్లిపో

కంటిలో వొదిలిన పక్షులు
యెగిరి వొచ్చే వేళైంది
వెళ్లిపో

కళ్ళల్లో కలలు

కనుమూసే సమయమైంది
వెళ్లిపో

నగరం నడిబొడ్డున

స్మశానం నిద్రలేస్తోంది
వెళ్లిపో

పసిపిల్లల బొమ్మలు

ప్రాణం పోసుకుంటున్నాయి
వెళ్లిపో

రక్తపు కొండలపై

వర్షం గడ్డకడుతోంది
వెళ్లిపో

వానపాముల నిద్రలో

పైరుపంటలు పురుడుపోసుకుంటున్నాయి
వెళ్లిపో

ఋతువులు వృద్ధాప్యంలోనూ

నక్షత్రాలని వెంబడిస్తూ ఉన్నాయి
వెళ్లిపో

అక్షరాలపై వేలిముద్రలు

కనుమరుగవుతున్నాయి
వెళ్లిపో

Tuesday, July 27, 2010

బుడగ

గాలే
నా శత్రువు

పగలనంతసేపే
ఈ విర్రవీగుడు

ఆకర్షించే అవలక్షణాలే
నా ఉనికి

నాకు నేనే మురిసిపోయి
మిడిసిపాటుతో ఎగురుతుంటాను

అనేక కిరీటాల్ని
తొడుక్కుని ఊరేగుతుంటాను

అర్థంపర్థంలేని కొయ్య బుద్ధే
అడ్డొస్తోంది నా సుఖాలకి

ఇకనైనా
తగలెట్టాలి నా బుద్బుద బుద్ధినీ

Friday, July 23, 2010

పుస్తకం చనిపోయింది

ఒక ముల్లులో ఉంటాను // గుచ్చుకునే పూల మధ్య బతుకీడుస్తూ // గొంతులో పచ్చటి కన్నీళ్ల ఆకాశం // సీతాకోకచిలుక సూర్యుడు // నది చీకటిని తెరిచింది // నక్షత్ర సముద్రంలో శ్వాస శిఖరాలు // తేనెమట్టిలో చేపలు // కాయితపు కెరటాలు // తుఫాను కాంతిలో కల జల // జారుకుంటున్న విరజాజి చంద్రుడు // అద్దంలో అర్థరాత్రి // కడలికుండలో కారడవి // కాకి నవ్వు // అక్షరాల్ని తడుముకుంటున్న కాల లిపి // భాష లేని ఆత్మ ఛాయ // డొల్ల గాలి // ఖాళీ ఫుల్ స్టాప్ // చిట్టచివరి తొలి చినుకు // తొడలో దీపం // దారి తప్పని అబద్ధాలు // తియ్యటి బానిసత్వం // మెత్తటిఅధికారం // రాత్రి నవ్వదు// ఓటమి కావాలి // జారవిడిచిన ప్రేమ నీడలు // మనసుని చీలుస్తున్న కళ్ళు // పెదవిపై చావు నిద్రపోతోంది // రక్కుతున్న నిశ్శబ్దం // ముల్లులో తూనీగ // పదాల్లో లేని జ్ఞాపకాలు // నా ముల్లుని లోపలకే లాక్కుంటున్నాను...

Thursday, July 15, 2010

మా రాక్షసుడా!

నువ్వెప్పుడూ రాక్షసుడవే

పునరావృతమయ్యే ప్రతి సంఘటనలో

నీ అసలు రూపం ఎందుకు మారదో
అర్థం చేసుకుంటూనే చస్తున్నాం

మేము చచ్చినా నీ నిజస్వరూపానికి

సిగ్గనేదే ఎందుకు రాదో
అర్థం చేసుకుంటూనే చస్తూ బతుకుతున్నాం

నువ్వెప్పుడూ గ్రహాంతర రాక్షసివే


ఏ పాలూ తాగకుండా పెరిగినందుకేనా

ఇపుడు మా రక్తాల్ని తాగుతున్నావ్

నీలా బరితెగిస్తే

మా ఊపిరి ఉన్నంతవరకు
నువ్వెక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా
నిన్ను తరిమి తరిమి పైకి పంపమూ

నువ్వెప్పుడూ నపుంసక రాక్షసుడవే


నీ అంకిత భావాలకి

నీ కర్తవ్య సాధనకి
నీ ప్రేమపాత్రుల ఊడిగానికి
నీ అసలు రంగు బైటపడేలోగా
ప్రజా రక్షక రాక్షసుడిగా వేషం మార్చేయ్

ఇక నువ్వెప్పుడూ

అతి విశ్వాస శునక రాక్షసుడివే

మేమే కదూ

నీ శీలాన్ని చెరచంది

మేమే కదూ

నీ ప్రతిషట్టల్ని ఎగతాలి చేయంది

మేమే కదూ

నీకు అన్నంపెట్టి తిరిగి కాటు వేయించుకుంటున్నది

నువ్వెప్పుడూ త్రికాల సంరక్షక రాక్షసుడవే


మా మందబుద్ధి ప్రాణాలతో

నీ చెలగాటం ఇంకెన్నాళ్ళు

Sunday, July 11, 2010

కల

మెత్తటి చూపుకీ దొరకని నిశ్శబ్దంలోకి నిష్క్రమించాలి
పీత పాదాలు పరుగెత్తితే వచ్చే చప్పుడ్నీ దాటెల్లాలి
ఎన్నో వింత రంగుల మౌనంలోకి ప్రవేశించాలి

ఎప్పటి దూరమో అది
ఈ సమయానికే దేహాతీత దర్పనమైంది

ఇప్పటి శరీర సన్నిధిలో
వీక్షించే చిత్రానుభవాల చిత్రలోకమే
సరికొత్త పాతది

స్పర్శించే నిస్పృహలో
నిరీక్షించే విచిత్రంలో
గమ్మత్తు జగత్తులో

ఊహలన్నీ
గిర్రు గిర్రున
సర్రు సర్రున ప్రవహిస్తుంటే

ఒకప్పటి చెట్టుపైనుంచి
దూకుతూ ఎగురుతూ ఉంటావు

ఒకప్పటి మనుషుల ముఖంలోకి
మునుగుతూ ఏడుస్తూ తేలుతూ ఉంటావు

ఒకప్పటి వేగవంతమైన విశ్రాంతిలో
తిరుగుతూ పాకుతూ చతికిలపడతావు

అంధకార కాంతిలో సంచరించే ప్రతి రూపమూ
అపరిచిత జ్ఞాపకమై తరలిపోతుంది

చల్లటి వాసనుండదు
చేదు వేడీ ఉండదు

జారుకుంటున్న అక్షరాల్లోకి
మరికొంత చీకటి కావాలి

Tuesday, July 06, 2010

కక్కుర్తి కోరికలు

కొంత అసంతృప్తి కావాలి - కొన్ని ఆత్మహత్యలు చెయ్యాలి - తగినంత నమ్మకం నశించాలి - కోరుకున్నంత మృగత్వం పెరగాలి - అనంతమైన వంచన పెంపొందాలి - ఇంకొంత విరక్తి చెందాలి - మరికొంత విషాదాన్ని పోషించాలి - కోరిన వెంటనే కనుమూయాలి - కాసిన్ని కక్కుర్తి కలలు కనాలి - విలువల్ని నగ్నంగా సాగనంపాలి.
ఓపికున్నంత వరకు భయపడాలి - మాటల్ని మస్తిష్కంలో బూడిద చెయ్యాలి - అమాంతం ప్రశ్నల కౌగిలిలో జన్మించాలి - సొంత అంత్యక్రియలికి డబ్బులు లేకుండా ఉండాలి - నాలుకని ఎవరికైనా అద్దెకివ్వాలి - మనసుతో పాటు కన్నీళ్ళని ఉడికించి శరీరానికి తాపాలి - ప్రేమలేని గాలిపై నడవాలి - వీలైతే నుంచొని చనిపోవాలి - నవ్వుల్ని స్మశానంలో పూడ్చాలి - ప్రసూతి గదిలో నిద్రపోవాలి - వంతెన కింద ఈదుతున్న చేప కంటిలోకి దూకాలి - ఇదంతా కనుపాపతో చెరిపేయాలి - - -

Saturday, June 26, 2010

తిరిగే చేతుల్లో

కొన్ని చీమల చేతుల కింద తిరుగుతున్నా
వాటి నిద్రని తాకాలని

నా తలకాయలో
వాటి ప్రియురాళ్ళ ముఖాల్ని తుడిచేశాను

నిద్రలో పాకి
నా ప్రియురాళ్ళ ముఖాల్ని అవి తినేశాయి

కొన్ని కలలు
చీమల చేతుల్లో ఉంటాయి

మరికొన్ని తలలు
కలల చేతుల్లో చితుకుతాయి

తిరిగే చేతుల్లో
వంకర్లో కొంకర్లో పోయే కలలే మిగులుతాయి
***
మొదట http://poddu.net/లో వచ్చింది

Friday, June 25, 2010

ఉన్నట్టా, లేనట్టా?

నీతో మాట్లాడాలని

మనసులో పడిన చినుకుల్తో
వర్షంలో వస్తాను

నీ ఇంట్లో
నువ్వు ఉన్నట్టా, లేనట్టా?

ఎవరితో ఊసులాడాలో
తెలియటంలేదు

తడిచిన నేల
కళ్ళల్లో వరదగూడు

ఎండాకాలంలో
కప్పై తిరుగుతున్నాను

ప్రతి అలికిడిలో
నిన్ను వెతుక్కుంటున్నా

నది గది

వాక్యానికి గదులు లేవు
మనుషుల మృత్యువూ లేదు

నది గాలి
నది పేగు గాలి లేదు

ఖాళీ సమయమిది
ఆత్మహత్య ముందున్న పదమై

నది నాలుక ప్రవహించిన అద్దంలో
వస్తువులు, దేహాలు, సంఘటనలు ఈదుతున్నాయి
నిర్జర సంకేతాలవుతున్నాయి

నువ్వెక్కడో ఉండవ్
శూన్యాస్పద అశ్రువుల్లేని అక్షరాల్లో తేలుతుంటావ్

ఒక ముగింపులోకి లోనయ్యే ప్రారంభం
ఎదురవుతుంది మళ్ళీ

నిశ్వాస శరీరాన్ని ఖండించే దుఃఖం వెనక
తీరిక లేని ప్రయాణం

ఒడ్డుకి చేరని నక్షత్రమొకటి
రాత్రిలో ఎక్కడో చనిపోతుంది

వాక్యాన్నే నిషేదించాను
అనిశ్చిత అక్షరాల్లో

Tuesday, June 22, 2010

చీకటి వాసన

ఈ పదం మరో పదానికి ఆహ్వానం పలకదు.

పారిపోయే పాదాలు పాకుడు వాసన పట్టి,
రెప్పపాటులో ఒక రంగుల నీడ అవ్వొచ్చు.

లేదంటే, దగ్గరికొచ్చే సుతిమెత్తని అలై
గుండెల్లో పెలుసుబారిన ఆకై విరిగిపోవొచ్చు.

లేకుంటే, ఆకాశం లోపించిన పిట్టై,
నిద్రటాకులో ఎగరావొచ్చు.

అదేదీ కాకుంటే, ఈ కంటికి కొన్ని చినుకులు అడ్డంపడి,
నీడల గడ్డలు పెరగావొచ్చు.

ఏదీ కాకుంటే, ఈ వాక్యం చివర
మరో పదం ఉండదని తెలియక పోవొచ్చు.

లేదంటే, ఇవేవో పదాల మధ్య మసిలే
చీకటి వాసన అవ్వొచ్చు.

Thursday, June 17, 2010

బంధిస్తున్న అక్షరం

ప్రతి చూపు నిశ్శబ్దంలో అంతమౌతుంది
అదొక స్పర్శ

ఇపుడెగిరొచ్చే సమయం
ఇంకెక్కడో ఉండదా

నిరీక్షణ దారితప్పినపుడు
కళ్ళల్లోని అలలన్నీ ఎవరి వద్ద ఆగుతాయి

వాక్యాన్ని బంధిస్తున్న అక్షరం
ఎక్కడ్నుంచి ఆవిర్భవించింది

జ్ఞాపకాల్లోని పదాలన్నీ ఎన్నటికీ దొరకవు
ఒక్క ప్రశాంత దుఃఖం ఏ నిద్రలో ఉంది

మనమెవరమూ ఉండని భాషలోంచి
నీతో నేనెట్లా మాట్లాడాలి

ఈ అక్షరాల మధ్య
మనం పలకరించుకోగలమా

మళ్ళీ అర్థమవ్వవు
తిరిగెళ్ళే కలకి నీ కళ్ళు

నీ చేతుల్లో పెరిగిన
నా దుఃఖాన్ని నాకివ్వవూ

మరుపే మన మధ్య
చూడటానికొస్తుంది పదమై

మళ్ళీ ఎగరాలనే
నిశ్శబ్దం ఓ వేయి రాత్రుల్నుంచి రెక్కల్ని కుట్టుకుంటోంది

Wednesday, June 16, 2010

కల తలుపులు

నిద్ర కళ్ళల్లోకి తొంగిచూడు. అదొక అడవి తీరం. గుచ్చి గుచ్చి చూసినా, అందేదీ అగుపడదే. కొన్ని యుగాలనాటి ప్రదీశామీమూ, వెళ్ళినా, తిరిగొచ్చే వీలు లేక, భయమింకా పోలేదు. అందులో కొంత కోతకి గురైన కలొకటి ఉండేది. ఇంకెప్పటికీ, ఇంకెవరకీ దొరకని దొంగ కల ఇప్పటికీ. కంటిపాపలో సగం సగం విరిగిన చిత్రాలేవో. అచిత్రాలేవో. ఊహా చిత్రాలేవో. విచిత్రటూహలేవో. కదలాడే కనుపిట్టల నేల ఏదో కనుగొనలేక ఆ ఊపిరిపిట్ట, తన రెక్కలు ఎక్కడ దాచిందో. ఆ రెక్కల మాటలు ఎవరి చేతుల్లో తేలుతూ మునుగుతాయో. ఎగిరిపోతాయో. ఆ ఊపిరిరెక్కల మాటలపిట్టకనులు ఎందరి కళ్లపై పడి, గీరేస్తే, పీకేస్తే, చూసే ఈ మాటల కలల పిట్టని తినే కొన్నినిద్రలు దొరుకుతాయా. దొరకని వెలితి. ఎక్కడుందో తెలియదు. ఎప్పటిదో. బాధిస్తోంది. బంధీనై, నా నీడల చిరునామాకై, నా దేహంపై తిరుగుతున్న అలల్ని చెట్టులో దాస్తున్నా, చనిపోయే చంద్రుడై, అలలన్నీ విరిగిరిగి పైకి లేస్తున్నాయి విత్తనాలులేని చంద్రుడి చెట్టుమీద. చీకటి కొమ్మల మసి మాసిపోక, మూసిన మూతి మాటల మాటల్లోంచి మరికొన్ని చీకటి కొమ్మలు పెరుగుతున్నా, ఖైదీనై, ఖరారు కానీ ఖడ్గమేదో నాపై తిరుగుతున్నా, లేత రంగుల గీతాల్లోని గీతలేవో ఆకుల ఎముకల్లోని నిశ్శబ్దంతో సంభాషించక, గాలికి ఎగిరెగిరి ఎక్కడికి చేరేది ఎవరికి చెపుతాయి. కొన్ని వృద్ధ స్వప్న హస్తాల్లోంచి, ఎండిన నిద్ర విత్తనాల కళ్ళల్లోంచి, నీ నీలి నేల నెత్తురు జలపాతపు గాలిదుప్పటిలోంచి...కదిలే గొంతులు, కుమిలే నాలుకలు, కమిలే కన్నీళ్లు, కులికే కలలు, కెలికే చావులు, కసిరే కసి, కోసే కోపాలు, కడుపు ధ్యానం, కుడుపు శోకం, కొయ్య ఇల్లు, కొయ్యలేని కౌగిలింతలు, క్షణిక నీతులు, కుండలో కుండలినీ అస్తికలు, కాయితపు కడలి, కూలిన కాలపు గెల, కుళ్లిన కలలు, అప్పటి దేహపు సందర్భాల మాలిన్య మాసికలతోనే ఈ రోజుకీ ఓ రోగపు పులకరింత. నా కళ్ళల్లోకి నేనే తొంగిచూడాలి, తొంగోవాలి. తోలుతీసిన కొండల్ని వెంటపెట్టుకుని నడవాలి. తీరపు పూల చేపల్ని పట్టుకుని లేచిపోవాలి. ఇసుకిసుక సూర్యచంద్రుల రాత్రుల్ని విసుక్కోకుండా వెంబడించాలి. గాలి గుర్తులులేని గాలిపటం ఎక్కి నిద్రపోవాలి. నిదురలో జ్ఞాపకాల రాక్షసి తల నరికి, నా తలలో దాచేయాలి. తల నీడల తలనీలాలు అర్పించి, అప్పటికప్పుడు మూసుకుపోయే నీడల ఎడారి గుహల్లో తలదాచుకోవాలి. తడారిపోయే తలంబ్రాల తక్కెడలో ఇప్పటి కలల బరువు లెక్క తేలదు. తెగులు పట్టిన మానసిక ప్రపంచంలో తేలిపోవాలి. రాలిపోవాలి. బరువు కలలే నేల మీద మిగులుతాయి. లెక్కాడొక్కా వొద్దులే, వోడిపోయిన వడ్లగింజల గింజుడులో గంజిలేని గుంజీల గుణాలు ఉంటే చాలదూ. వంచించే వచనముంటే చాలదూ. వంగిపోయే వాక్యముంటే చాలదూ. వంకరటింకర కలలుంటే చాలు, రేపు ఇదే వీధుల్లో మరల మరల తచ్చాడుతుంటాను. కొన్ని అనామక నిద్రలతో. మరికొన్ని అకాల ఆకారాల పదాలతో. గాలి తెరలు తలాడించేవరకు. నా కల తలుపులు మూసేవరకు.

Sunday, June 13, 2010

నేత్ర సమాధి

“వెనుతిరిగిపోయే
ఆకాశపు నీడలే,
ఈ చిల్లులుపడ్డ అక్షరాలు.

దారి తప్పిన
మాటల నీళ్ళే,
ఈ ఆవిరవ్వని శబ్ద వివర్ణాలు.

ఎట్నుంచైనా
ప్రయాణించే మౌనప్పొరల్లోని
గాలిని కాస్తంతైనా వొదులు చేస్తే,

ఈ ఆకృతిలోకి రాని
వాక్యాన్ని చూడ్డానికి వెళ్దాం”

అని రాసుంది వస్తూ పోతూ ఉండే
నిద్ర కనుపాపపైన

ఆ కన్ను నీదేనా?

Saturday, June 12, 2010

నాలుకల వాసన

ఆకుల్లోకి ఆకులు
గదుల్లోకి గదులు

ఆకుల గదుల్లోకి రోడ్లు
రోదించే రోదసి రేయింబవళ్ళు

ఎక్కడికని వేర్లులేని గాలి బయల్దేరింది
ఏదేదో విందామని సముద్రపుటొడ్డున
కూర్చున్న అడవంతా నీరైంది

ఎవరూ మాట్లాడుకోరు
ఆకాశగర్భంలో నాలుకల వాసన

మిగిలిన సూర్యాస్తమయాల
పదాల్లో ఓ చీకటి ఆకు

అటెటో వింటున్న కళ్ళు
ఏదీ కనబడనివ్వని అక్షరం

పగిలిన రాళ్ళు, ఆకులు
పగిలిన నవ్వులు, కన్నీళ్లు

రాత్రెక్కడో...
ఒంటిపైనో, మనసుపైనో
ఆకుమీదో

దొరికితే పంపండే

Friday, June 11, 2010

పసి ఆహ్వానం

ఒక పుష్కరం మన మధ్య
ప్రవహిస్తుంటుంది కొండకోనల్లోంచి తప్పిపోయొచ్చిన జంతువై
సముద్రాన్ని మింగే దాహంతో

పసిపిల్లాడినై నక్షత్రాల్ని హత్తుకున్నాను
ఈ క్షణాన రాలిపోయే కన్నీళ్ళల్లో

అక్షరాల మౌనం
అంతర్ధానమయ్యే అద్దంలో అడ్డుగోడవుతోంది

వొంటరై, తప్పించుకోని నిశ్శబ్దాలు కలవరపర్చవు
దట్టమైన దిగులు దిగి, మనసు దూదిని కాల్చుతోంది
అక్కడ్నుంచి వొదిలిరాలేని నీడల ఆచూకీ చెప్పరెవరూ

దుమ్ముపట్టిన సోమరి పదాల యాత్రలో
తప్పిపోవాలి

సన్నిహితంగా చేరాల్సిన ప్రదేశమేదీలేదిక్కడ
అస్పష్ట సంతోషం గాలిపటమై ఎగరదు

చనిపోయే రంగుల్లో కొత్త కాంతుల్నినింపే
ఒక విశ్రాంతి మెరుపు లేదెక్కడా

ఇంకెంతసేపైనా మాట్లాడే కొయ్య బొమ్మల్ని
కాల్చినా కాలవు
కప్పెట్టినా దాగవు

జ్ఞాపకాలు వొదిలిన పాదముద్రల్ని
వెంబడించే అక్షరాలు లేవెక్కడా

వొస్తావా, ఈ నేత్రాలు జీవించే స్థలానికి

అశ్రు యోని

కన్నీళ్లే స్నేహితులౌతారు
నది నిశ్శబ్దంలో

ప్రేమించిన వెలుతురులో
పెదవుల్లేని చీకటి

ఒడ్డే లేదు
మౌనంలో

దగ్గరలో లేమో, ఉంటామో
చిగురించే సీతాకోకచిలుకలో
కలల ఎముకలు

తిరిగిరాలేని పదంలో
ఒక ఒక అక్షరం
ఏ నీడలోనూ ఉండదు

ఏ ముఖమో ఇపుడు
వాక్యం కిందున్న వాక్యం

Thursday, June 10, 2010

తొలవకు

ఎవరి హృదయాలు
వానపాములు

ఎవరిక్కడ కన్నీళ్ళల్లో సూర్యుడ్ని
మౌనంగా చప్పరిస్తోంది

తలాకొంత మరణించే ముందు
ఈ భూమిని వెతుక్కునే చేతులెక్కడ

తలదించుకోవాలో
తల తెగాలో

ఈ పేగుపైన ఆలాయాల్ని
రేపటి చీకటితో నిర్మించుకోవాలా

ఇప్పటికే సగం గాలి బూడిదైంది
సగమే ఆక్రమించుకున్న వాక్యం రక్తమోడుతోంది

ప్రతి పదానికీ పుట్టుమచ్చలే
చెరిపేసుకొని వొచ్చేసావా!

Wednesday, June 09, 2010

నహి...నహి

ఇక్కడెవరో నిద్రించి, వారి కలల్ని మోసుకెళ్ళారు
సాక్ష్యం చెప్పమని చెట్టుని అడక్కండి

ఇక్కడెవరో ప్రయాణించి, వారి ఆనందాల్ని మరిచారు
సాక్ష్యం చెప్పమని నేలని ప్రాధేయపడకండి

ఇక్కడెవరో మతి చలించి, వారి కన్నీళ్ళని మిగిల్చారు
సాక్ష్యం చెప్పమని దుఃఖాన్ని నిలదీయకండి

ఇక్కడెవరో స్థలకాలాల్ని నిర్భందించారు
విముక్తికోసం కొత్త ప్రశ్నల్ని నాటకండి

ఇక్కడెక్కడో
చిట్లిన వాక్యం చివర్న
అక్షరం ఎక్కడైనా ఎపుడైనా ప్రారంభమౌతుందా?

అదృష్టం

పూలలోని సోమరి పువ్వొకటి
సముద్రస్నానానికి సిద్ధమైంది

అలలన్నీ
రమ్ కమ్ అంటున్నా
కాలిరేకును కూడ కదపలేదు పువ్వు

తీరానికి కోపమొచ్చి
పూలనేలను నీళ్ల లోపలికి తోసింది
సముద్రం సిగ్గుపడ్తోంది అలల్తో

సోమరి అలొకటి
పువ్వుతో లేచిపోయింది

ఉప్పాడ చీకటి

ఆమెకంటుకున్న
కంటున్న
ప్రతి చప్పటి కలవరింత కంట్లోంచి
జారొచ్చాను
జొరబడ్డాను

పెదవి కాళ్ళతో తను తంతూ తాకిన
శ్వాసలన్నీ బొడ్డులోనే పిట్టలై
ఎగిరెగిరి పడ్డాను
అలమటించాను

చీరల చీకటి
కన్నీళ్ల కుచ్చిళ్లు
మందడిలేని ఏకాకి

జరపకు స్వప్ననక్షత్రాల్ని
రేపో మాపో
ఓ గాజు చంద్రుడ్ని ఆమెకివ్వాలి

నా అతను!

అతన్లా కూర్చోటానికి, కదల్టానికి
కావాల్సిన కాళ్లే, కలవాల్సిన వాళ్లే
లేకుండా ఉండాలి

మృత్యువు దుఃఖించేపుడు
తన అరికాళ్ళల్లోని
నక్షత్రాలు నీ వరకు వస్తాయి

నిద్రమీద తేలాడే చేప రెక్కల్లోని
రంగులన్నీ నిన్నంటుకుంటాయి

అతన్లా చూడ్డానికి
మరపునిచ్చే జ్ఞాపకాలు దగ్గరగా ఉండాలి

అద్దం

నీ దేహంలోని ముల్లంటే
ఎంతో ఇష్టం
ఎంతో దుఃఖం

ఆగిపోతాను నీ అక్షరాల మధ్య
గాలిలో తేలిపోతాను గుడ్డిగాలినై

ఎప్పట్నుంచో నీ శరీరం మీద
నా శరీరాన్ని తాకాలాని చూసాను
దక్కట్లేదు

మనిద్దరి మధ్య మాటలే లేవు
ఈ అంధకారాన్ని వొదిలిపెట్టే
పదాలు ఎక్కడున్నాయి?

ఓ క్షణంలో
ఒక నిశ్శబ్దనేత్రంతో చూస్తాను
నన్ను అందుకోవూ!

కొరుకు

దేనికైనా నేత్ర విధ్వంసమే
పరిపూర్ణ వ్యసనం

మొండి కళ్లతో చూడటమే
అర్థమవుతుండే పతనం

మీరెప్పుడైనా మతితప్పిన
అంధుల్ని చూసారా!

శవాలయ్యే నేత్రాల్ని
ఎవరు మోయగలరు!

ప్రార్థనే ఆలస్యం
ఈ నేలమీద

శుభ్రమైన పిరికివాళ్ల స్పష్టతంతా
శ్వేతన్యాయానికి వ్యాయామం చేయించటమే

నీ నోటితో నీ కళ్ళని కొరుక్కోవూ!

Monday, June 07, 2010

వాన

ఎన్నో రాత్రుల్ని సేకరించాను
ఏ ఒక్కటీ నా వద్ద నిలవలేదు

ఎన్నో నక్షత్రాలు, గ్రహాలూ నిద్రపోయాయి
నా చిన్ని కంటిచూపుకి నిద్రలేదు

ఎన్నో పూలు, చినుకులు స్నేహితులయ్యాయి
నా ఒంటరితనమే నన్ను శత్రువుగా చూస్తోంది

ఎన్నో తియ్యటి ఋతువులు
పిసినారి వానే ఊరించి వెళ్తోంది

భూమి పురివిప్పి ఆడుతుంటే
ఆకాశం మెరుపుల జాజుల్తో కొప్పు చుట్టుకుంటోంది

నిశ్శబ్దంగా ఒక్కొక్క వర్షపుబొట్టు మాట్లాడుకుంటున్నాయి
నా చెవిలో మేఘాలు ఉంటే వాటి రహస్యాల్ని తెల్సుకునేవాడ్ని

నల్లటి పట్టుమబ్బుల్లో
నల్లటి ముత్యం, చంద్రుడు

నా పెదవులకి నిద్రపట్టదు
నన్ను నిద్రపోనియ్యవు
అవి వర్షంతో కల్సి పాడుతున్నాయి

అరటిపూలు, కొబ్బరిపూలు, చెరుకుపూలు,
జామపూలు, వక్కచెట్టుపూలు, సంపెంగలు
నా కలల్లో విచ్చుకుంటున్నాయి

నేనే, నేరస్థుడిలా
నా కళ్ళకి దూరంగా ఎందుకున్నానో

ఇంద్రధనుస్సు నిద్రపోయింది
అల్లరి చేయకండి

Friday, June 04, 2010

ఏమంటావు, అతనూ...

అతనే, తన తనువులేకుండా తీరిగ్గా చదివే పుస్తకాల వాక్యాలకై, నేత్రజ్ఞాన జన్మకై ఎదురుచూసేలోపు, చేతిలో వుండుండిన ఓ చెత్త పుస్తకంలోని పదాలు ఇలా అన్నాయని రాసుంటాయి: అసంకల్పిత ప్రయాణంలో అంబరం యోచనై, దృశ్య దహన దాహజ్ఞాపకమై, మాట్లాడని వృక్షమై, మాట్లాడే ఎడారై, ఎటూ మసల్లేని మరుపు చూపై, అనుకోని హృదయ సంబరమై, వికటించిన విరక్తి వాకిటముందు అన్ని తలపులూ చులకనై, దేహానికి ఏ మరపూ ఏమారపు కానిదై, కాలిపోయి ఖాళీచేసిన బొగ్గుమనసు నుసి నుసి మసై, ఒకప్పట్టి కన్నీళ్ల కళ్ళు వ్యర్థమై, జీవితం పూడుకుపోయే కాలమై, పేరుకుపోయిన ప్రస్తుతాన్ని ఏ ఒక్కసారైనా విసిరేయాలి.

పెచ్చులు పెచ్చులు
హెచ్చుల్లో

నా కాయంపై, నా శూన్యంపై, నా బతుకుపై, నా సమాధిలోని అశ్రువులపై ఏ వాక్యమూ లేదు.

అతనే, తనే అయి, అక్షరాకాశాన్ని కిందికి పిలుస్తున్నాడు. వొంగే లొంగే వయసు లేదుకాని, వయస్సొంగిన మృత్యుహృదయం అతని సామీప్యాన్ని ఆశిస్తోంది, ఏమంటావు, అతనూ...

Wednesday, May 26, 2010

నిశ్శబ్దాయువులోకి

మనసొక శోక వాయువు. ఏ స్వరమూ లేదు ఈ కాయితపు కాలంలో. పిలుస్తాయి పుల్లటి చిత్రాలు. సందర్శించే అపూర్వ స్వప్నాలై. దారపు నిప్పులపై ఉడుకుతున్న చీకటి ఎవరి వెంటారాదు. ఉమ్మనీటి నేత్రమేదో ప్రవహిస్తోంది పరోక్ష దుఃఖమై. లేత మెరుపుల దహనాక్షరాల్లోంచి దాటాలి పల్చటి ఆకారాల్లోకి. అలముకుంటున్న పదాల హరివిల్లు నీటినేలపై మసిలే ముత్యపు మృత్యువు. చీరుకుపోయిన నక్షత్రాల రెక్కల్ని కుడుతున్నాను ఆకాశపు ముళ్లుమీద వాలితే. చేదు సూర్యుడే చల్లటి చనువై ఒంటరి నేస్తమై మటుమాయమయ్యే వాక్యమయ్యాడు. మౌనవరదేదో మెరుపు పెదవుల చీకటిలోకి. చీకటి చిగురు కంటిపాపల నీడల్లోకి. లుంగలుచుట్టుకుపోయే చితి పుష్పాల నింగి మనసొక శోక వాయువు. ఏ స్వరమూ లేదు ఈ కాయితపు కాలంలో. పిలుస్తాయి పుల్లటి చిత్రాలు. సందర్శించే అపూర్వ స్వప్నాలై. దారపు నిప్పులపై ఉడుకుతున్న చీకటి ఎవరి వెంటారాదు. ఉమ్మనీటి నేత్రమేదో ప్రవహిస్తోంది పరోక్ష దుఃఖమై. లేత మెరుపుల దహనాక్షరాల్లోంచి దాటాలి పల్చటి ఆకారాల్లోకి. అలముకుంటున్న పదాల హరివిల్లు నీటినేలపై మసిలే ముత్యపు మృత్యువు. చీరుకుపోయిన నక్షత్రాల రెక్కల్ని కుడుతున్నాను ఆకాశపు ముళ్లుమీద వాలితే. చేదు సూర్యుడే చల్లటి చనువై ఒంటరి నేస్తమై మటుమాయమయ్యే వాక్యమయ్యాడు. మౌనవరదేదో మెరుపు పెదవుల చీకటిలోకి. చీకటి చిగురు కంటిపాపల నీడల్లోకి. లుంగలుచుట్టుకుపోయే చితి పుష్పాల నింగి నిశ్శబ్దాయువులోకి పరిగెడుతోంది. ఇపుడైనా గెంతెయ్యాలి మనసుమట్టిమీద నుంచి.

Monday, May 10, 2010

చీమ పాదాలు నిద్రించే సూర్యాస్తమయాల్లో

దేహఖనిజాల్ని భద్రపరుచుకునే
క్రీడ
తెలియకపోవటం అందరికీ అభ్యంతరం కాదు

అంతరాయమంతా
చూసిన కలంతా
ఎగర్లేని కంట్లోంచి అమ్మ చేతులు తాకవు

దుఃఖానికీ లేని అతిధులు
ఈ సమయంలోని స్నేహితులు

ఆకుల్లోంచి కనిపించే చెట్టు
మరొక వల

వెంట్రుకల్తో బట్టలిప్పుకున్న నిశ్శబ్దం
నోరుతెరిచి ఉంచిన కన్నీళ్ళే

ఊపిరిలేని నాలుకతో
ఏ సూర్యాస్తమయాన్నీ చూడను

Friday, May 07, 2010

అహరహం

ఇప్పటి చెలిమి
ఎల్లప్పుడూ ఉండునా

ఎర్రటి దూరం మసగ్గా

గళంలోని వర్ణాలు
హృదయంలోనివా

తెల్లటి అరుపు ఎండమావై

రహస్య మనసు
ఉండేదెక్కడ

నల్లటి గర్వం కన్నీళ్ళపై

ఒదిలిపెట్టిన రాత్రులన్నీ
చేరిన స్థలమేది

జామరంగు ప్రేమ అద్దంలో

నువ్వూ నేనూ
విడిపోయేదెప్పుడు

ఈతకాయరంగు కాలం మనలో

Saturday, May 01, 2010

కాలం, వెలగని దీపం

నిద్రే
అక్షరాలూ లేని పదం

తాకాలో, తడవాలో, తుడుచుకు పోవాలో
ఎంతకీ చెప్పదు తుషార విషాద స్వప్నం

పదాల శూన్యం ఎల్లప్పుడూ తోడుండదు
శూన్యలిపై జ్ఞాపకం తోడు రాదు

మౌన వజ్రాలు నీ పెదాలు
నిరీక్షణలో నీ మాటలే నాకొక మరోజన్మ

గాలిపటానికి గాలి దూరం ఎంత
ప్రేమపటానికి మనసు దూరం ఎంత

అనేక రేయింబవళ్ళ కనుపాపలపై
ఆశతో ప్రయాణించే వర్షానయ్యాను

ఏ తీరాంతంలోనో
దీపంలోని తలుపుల్ని మూయాలి

అప్పటివరకైనా, తలుపెయ్యకు
తల వంపుల తలంపుల తలుపెయ్యకు

అవే, నేల రెక్కలై, దేహభాగాలై
రూపంలేని ఒంటరి మాటలై అడ్డుపడ్తాయి

తలుపెయ్యకు. తారట్లాడే కలలు
కాలాన్ని వొదిలి మరీ వస్తాయి

ఆకలి తీర్చే ధాన్యాన్నీ, ధ్యానాన్నీ
ఊక ఎగిరినట్టు తలుపెయ్యకు
కన్నీళ్ళని ఆపిన కనురెప్పల్ని మూసినట్టు తలుపెయ్యకు
జ్ఞాపకాల్ని శరీరంతో తోసినట్టు తలుపెయ్యకు

తలుపుల నిశ్శబ్దాన్ని కలపకు

గాలి నురుగులో
పదాల అద్దాల్లో
మెరుపుల మన్నులో
నింగి శ్వాసలో
నీ కోసమే తలుపులు తెరుచుకోవాలని
ద్వారాలే లేని దుఃఖకాంతినై అంకురించాలని

Wednesday, April 28, 2010

ఓ లేత వలయం

మరొక వాక్యరహిత ప్రేమలేఖో, లోకమో
విస్తరించే వైరాగ్య శాంతి శోక ఛాయే, అపరచితం
మేలు లేదు ఎన్ని పదాలతో, మైత్రించినా
శంకించే స్నేహం మరో రూపంలో, రహస్యమే
విధి అనురాగ ధన్యతే, వేదన
దృశ్య భావన ఫలాల నృత్యం, ఓ లేత వలయం
ఒకానొక అవస్థ, వినోదం
సంభాషించే నేత్ర పరిచయం, అదృశ్యం
మంత్రించే మిత్రుత్వం, మౌనమే
ఇదో వింత విలాప మైకం, నువ్వే లేకపోతే
స్వర్గం పృథ్విపై ఉన్నా సుఖం, లేదు
దేహాతీతంగా కొన్ని ఋతువులు, మృగ్యం
ఇప్పటి బంధనాలు నాకు
బహు, దూరం

Tuesday, April 27, 2010

నిస్పృహ

కలలెలా ఉండాలో నిద్రకి తెల్సు. నడవని పడవ నీళ్ళల్లోంచి గాలి అలల్ని నెట్టుకుంటూ, పాలు తాగుతున్న చేపల్ని తప్పించుకుంటూ, చప్పుడు లేకుండా తిరుగుతున్నఅక్షరాల వలని విడుస్తూ, తప్పిపోయే సూర్యస్తనం వెంట బెండు చంద్రుడ్ని ముక్కల ముగ్గులు చేసి విడ్చి పెడ్తే, వాక్యాలు పైకెగురుతుంటే, ముడుచుకొని మడతబడ్తున్న కళ్ళని కాళ్ళతో కడచేర్చే కొయ్యనీళ్లన్నీ తునాతునకలవుతుంటే, వాడిపోయి మీదపడ్తున్న జాజిపూల ఇసుక చెంపల్ని చేరాలని తిరిగొస్తుంటే, కాగితాల గోడలు పుట్టలవుతుంటే, అందులోంచి లుంగీ విప్పుతున్న చీకటి మొలతాడు మూల్గుతుంటే, ఎపుడో, ఇక్కడెక్కడ్నో, ఉన్నాననో, మారిపోయాననో, దుప్పటి ఎముకలు దొ(కొ?)రుకుతుంటే, అప్పటికీ మొదలవ్వని కన్నీళ్ళని పట్టుకుంటుంటే, నేల జిలేబి గుండీల్నిప్పుతూ, హుక్సుల్లేని చేతుల్తో మోహమోసాన్నో, చిగురు చివర చుట్టుకున్న వాసనో, తొడల బతుకో, నెనోదిలొచ్చిన ఇళ్లో, తడబడే చినుకుల్లో పనస మొగ్గల బలం లేనపుడు, ఎంతో దగ్గరి కాంతిలో చూసేది చూస్తుంటే, పిలుపొకటి, ముఖమై మాట్లాడుతుంది మరమరాలు నములుతున్నట్టు, వెనక్కి తూలిన నవ్వుల్తో, బధిర వయసు శరీర వికృతిలో, ఏ కరుణ జిహ్వ అంటులోంచో వటపత్ర స్వప్నాలు, ఇవి నీ చేతుల్తోనే విప్పదీసే వాక్యాలు, వ్యావృత అశ్రువులు, రెప్పపాటులో తరిగిపోయే చీకటి చిందులు, మరునిమిషంలో మాయమయ్యే అపవిత్ర తిరస్కృతి, అడుగుతీసి అడుగేస్తున్న ప్రతి ఆలోచనా బందీయే, ఎందుకో హత్తుకున్న నిద్రలన్నీ ఎవరివి, హరించిన స్వప్న జగత్తు ఎక్కడిది, హడావిడి సోన హాళాహలి ఎంతసేపు, ఎవరికీ తారీఖులు లేనపుడు, గుర్తులేనపుడు, ఛాతీపై సర్పాలు తిరుగుతుంటే, ఎదలోని కప్పలు బైటికొస్తుంటే, విగ్రహాల్లోంచి విపత్తులు రాళ్ళవుతుంటే, అందవిహీన శిల్పాలు వర్ణాలవుతుంటే, మంటల్ని కడుగుతున్నారు మొండెంలేని అక్షరాల రక్త దాహంతో, దిసమొలతో వాక్యాల్ని తడుపుతున్న లజ్జతో, ఖండిత మనో అంగాల కలవరింతల్తో, ఇంద్రజాలమో, ఇంద్రియజాలమో, ఇంగిత ద్రోహమో, బొజ్జోపెట్టు, భోజానాలు పెట్టు, భక్తి పెట్టు, పాటలు పెట్టు, వెన్నెముకల కులకలల్ని చీల్చిపెట్టు, ప్రజాప్రసాదాల్తో నర్తించు, అడ్డు వస్తున్నచెవుల్లో జోలపాడు, నాటకీకరించు, నాలుకల కలలకి పిండ ఆందోళనలు కల్పించు, సౌఖ్యమైన జ్ఞాపకాల్ని ఇవ్వు, ఇవ్వొచ్చు మోజు తీరని రక్తాన్ని, రక్తాన్ని తాగొచ్చు, కలల్ని తినొచ్చు, రా, లేకపోతే తప్పిపోదాం, కల తల కపోల అపోహలో...

Monday, April 26, 2010

ఇంకెంతసేపో

అంతరంగంలో నన్నెప్పుడూ ఉండనివ్వను

పట్టేంత ఖాళీ ఉంటే
నన్ను నన్నుగా ఇరికించే వాణ్ణి

పరాయినై...

నేరేడు గుత్తుల్లాంటి కొత్త ఊహలకి
సీతాఫలాల్లాంటి గతించిన బాధలకి
చలించని వృద్ధ వృక్షానయ్యాను

చరించని పుష్పాలేవో వాహనాలై
తరించని త్రికాల బిందువుకై తిరుగుతున్నాయి

రేపటి రోజులో
నలుదిక్కులూ పర్యటించిన ముఖంలో
ఏ చిరుగుల రాత్రీ లేదు

నిన్న శేషించిన
'పగలు'
ఇంకెంతసేపో

మానసిక వ్యాకరణంతో
వాక్యంతాన్నైనా బంధించాలి


Sunday, April 25, 2010

ఖాళీ వాసన

ఆకుపచ్చటి ఆకాశాన్ని మోసుకెళ్ళే మధ్యాన్నపు నత్తి
అలలు. తలుపు గాలిలో . మాట్లాడే నిశ్శబ్దం.

దేహానికీ, అక్షరానికీ సంబంధంలేని శ్వాసని వింటున్నాను
నోటితో. అక్కడ వొదిలి వచ్చిన కాలం ఎవరికి దొరికిందో.

పదాల దుంపల స్పర్శలో ఖాళీ వాసన. చీకటి
తింటున్న వర్షం. వానపాము ముద్దు నవ్వు.

పువ్వులు తిరుగుతున్నాయి. గాడిదల్ని ఎక్కి . రోత
సుఖం కన్నీళ్ళల్లో. పుల్లటి కలలు. గడ్డిలో.

ఇంట్లోకి సముద్రాన్ని వెంట తెచ్చుకున్నాను. చంద్రుడి
గుర్రాలు నక్షత్రాల్ని మింగి నీళ్ళు తాగటానికి సూర్యుడి దగ్గరకెళ్ళాయి.

Thursday, April 22, 2010

విషాద స్వేచ్ఛ

ఎలా నిద్రపోను
అక్షరాల రొదలో

ఆ మూల నుంచి ఈ మూలకి
మనసు మసగ్గా దేహాతీతంగా
అంతరాంతర నిరీక్షణలో

ఈ తీరం నుంచి ఆ తీరానికి
వెంబడించే నక్షత్రాల నిశ్శబ్దం
అర్థాంతర వాక్య యాతనలో

ఎలా నిద్రపోను
నిద్ర అద్దంలోని దారినెవరో తుడిచేస్తుంటే

అక్కడక్కడ విరావ సదుపాయాలు
అప్పుడప్పుడు కన్నీళ్ల దప్పిక

చేతులెత్తేస్తాం
చేతులిచ్చేస్తాం
చేతనాచేతన అచలిత విషాద స్వేచ్ఛలో

పైకి చూడు
చొచ్చుకొస్తున్న ఊదా గాలి

Monday, April 19, 2010

ఎవరికైనా

ఒక ప్రదేశం నుంచి
ఒక దేహం నుంచి
ఒక పదం నుంచి
ప్రయాణించటం యెంత ఆసక్తికరం

ఒక నిశ్శబ్ద ఆహ్వానం నుంచి
వైదొలగటమూ సమీపించటమూ
నిర్దేహ దృష్టితో అంతమొందటమూ
ఆనంద విఫలమే

చిన్న రాత్రి చాలు
వేల జ్ఞాపకాలు ఒక్క వాక్యమౌటానికి

ఆకాశం ఆగిపొతే
రాత్రి పాదాలు ఇక ఎక్కడ

కలుసుకోలేని కలలు
ఇక ఎవరి భూమిలోనో

తోడూ ఉండని నాలుకకి
ఎవరు స్నేహితులు
ఎవరు హంతకులు
ఎవరు మాంత్రికులు

స్తబ్ద శబ్ద స్మశాన
స్థల స్థన శోధనే ఎవరికైనా

రంగుల సాలీడు

బాధాంగాలన్నీ దొరకట్లేదు
కోసి తీద్దామంటే

ఏది బాధించని
అంగాంగమో తెలియట్లేదు

పాడుబడ్డ పదాల పేద గూటిలో
పెంచుకున్న వాక్య పక్షి ఎగరదు
దిగంతాల దుఃఖమేదీ అందదు

నా రంగుల సాలీడు
వలకి నేనే బందీ

ఇక్కడ చంద్రుడి నీడ పడదు
సంచరించే మాటల పేగులపై సూర్యోదయము కాదు

సర్పస్నేహమే ఎక్కడైనా
అంతరిస్తున్న అంతర్లోక అక్షరాలు

కొవ్వెక్కి బాధపడే బాద్ బోధ నాకొద్దు
మనకొద్దు బాధపెట్టే బోద కన్నీళ్లు

ఎపుడు వినగలను నరుకుతున్న
కలల కంచె చప్పుళ్ళని
ఎన్నో తుమ్మ చెట్లు కళ్ళల్లో

చీకటి గాలిఎదురు పడుతోంది
మీ లోకపు నిద్రలో ఇక తిరగను

Thursday, April 15, 2010

లొంగిపోగలమా...

లొంగిపోతాం కొన్ని మాటలకే
మనకే తెలియని మనవే అయినా

అవి
చైత్రమాసపు కారు మబ్బుల్లోంచి వాలొచ్చు
నిరాశాజనకమైన కిటికీలోంచి రావొచ్చు
దాహార్తి నశించని ఆసుపత్రి గదుల్లోంచి వినవచ్చు
నిర్లజ్జ దుఃఖ శరీరాల్లోంచి బైటపడొచ్చు
పిల్లల కలవరింతల్లోంచి ఎగరొచ్చు
అప్రియమైన శాంతి వాక్యాల్లోంచి పాకొచ్చు
ఆఖరి నిద్రో సమీపించే ఆసందర్భంలో దూరొచ్చు
అన్ని అక్షర బంధనాల్నీ తిరస్కరించి చేరొచ్చు
నిరాశ్రయుడి పలవరింతల్లోంచి తప్పి గెంతొచ్చు
ఏదో ఒక నేత్ర రత్యానంతర జుగుప్సతో జారి పోవొచ్చు

కొన్ని మాటలు మనకీ కనిపించవు
ఇంకొన్ని మనల్ని ఉరితీస్తుంటాయి ఎల్లప్పుడూ

డాలీనందుకోలేక…

అనంత బాహ్యార్థ స్థిమిత సంజ్ఞల్లో
కలిసిపోయిన వేగుచుక్కలు

మెరిసే కొంగ రెక్కల్లో వ్యామోహార్తికి
నీలి గుర్రాల చప్పుల్లో
జారిన చినుకుల్లో వాన

అనేకానేక మూర్త భంగిమల్లో పేర్చుకున్న
గాలి కలలు తెగిపడుతున్నాయి
ఆధోజగత్తులో

కామోప్రేత స్ఖలనాలింగానాల చిట్ పట్ లు
చల్లగా కోస్తున్నాయి

రాల్తున్న శిరోజాల్లో అంటిన బంక ఇసుకని
తోసుకుంటూ అక్షరాలు

చనిపోయిన అస్తిత్వ ఎముకల్లో గూడుకట్టుకున్న
ఆలోచనలు ఇంకా వదలడం లేదు కళేబరాన్ని

బయటకొచ్చిన చూపు విసిగిపోయింది
దేహంతో

ఉండగా మారిపోతున్న ముఖంలో అద్దం
కపాలంగా కన్పడి కన్తడిలో ఎండి
పేడులా కూరుకుపోయింది భూమిలో

ఏక నేత్ర దృశ్యాల్లో అంతరంగ శబ్ద ప్రపంచం
రాగంలా విన్పడుతోంది గిటార్ నీడలో

క్షణాలు కరిగి అభౌతిక సెగలో కాలి
వ్రణ వ్రణాలుగా గడ్డకట్టి
వరసగా నీళ్ళల్లో ఈదిన ఆల్చిప్పలు
భయం భయంగా భూగర్భంలో నృత్యం చేసి
మసక మసక లేత చేప రెక్కలు
నిశ్శబ్ద భూమ్యాకాశ మధ్యలో సాగుతూ వేలాడి
పీచు పీచుగా నాచులో జాగ్రత్తగా
నడుస్తో హృదయావేశం

విసిరేసిన వక్షోజాలు జారుడుబల్లలో
ఆగిపోయి కలలు కంటున్నాయి

వ్యవహార నియంత్రణా జాగరణలో
మూర్తీభవించిన చీకటిలా శోక
శకలాలు పడ్తున్నాయి స్వప్నంలో

నోర్విరిచిన ఖాళీలో వానపాము ఆటలో
దిగబడిన బాటలో కూర్చున్న మాటలు
రంధ్రంధ్రానికీ మధ్య వెడల్పుగా నీడలు