Followers

Saturday, July 08, 2023

/ అదుఃఖ స్థలంలో /



నీ నాలుక కొలతలు ఎంత

నీ అబద్ధాల విస్తీర్ణం ఎంత


పగిలే గాలి

పగలే గాలి 


భుజాన మోసే అక్షరాలు 

ఇంకెంత దూరం అని అడగవా 


ఎవరికీ నీడల సంపద 

ఎవరిదీ ప్రేమల వంచన 


క్షమాపణ చెప్పలేని హత్యలే చూస్తాం

చివరి చూపు కొలతలెంతో 


ఏ భాషలో ఎలా లెక్కిస్తారో 



Thursday, July 06, 2023

నీ నుంచి...

వెలుతురు, 

అనేక నీడల్ని వెంటపెట్టుకుని ప్రయాణించే దుఃఖం, ఆనందం.


చీకటి, 

ఏకైక పాదముద్రల్ని విడదీసే, కలిపే, కల్సుకోలేని ఒంటరి అడుగులు.


నిశ్శబ్దం, 

ఒక అవయవం, ఒక పూర్తి శరీరం, ఒక కన్నీటి తడి గుండెలోపల.


ప్రేమ, 

గొంతులేని ఓ అందమైన కేక, ఓ తోడేడ్పు, ఓ ఒంటరొంటరితనం.


నవ్వు,

గొప్ప నిదర్శనం నీ ప్రేమకి ఈ బతికే కాలంలో.


దుఃఖం,

నువ్విచ్చే నిద్రలేని, శాంతిలేని, కలలేని, అలజడైన ఆత్మ.


మరణం,

మళ్ళీ మేల్కోలేని వెయ్యేల నిద్ర.


15-11-98

Tuesday, July 04, 2023

కన్నీటి నాలుక

 ఈ అద్దం ఎటూ చూడదు


ఈ శవం ఎవరిదో

ఓ అగతం


ఏ విత్తనమో

ఈ భగవంతుడు


ఎవరికీ వుండని నిశ్శబ్దం

ఏ గొంతులో దాగుంది


ఎవరెటు చూశారో

నాలుకలోని కన్నీటిని


ఏ ముఖమో

ఓ నీడ వాసనేసింది


ఈ వంకరటింకర శరీరం

ఏ గాలికీ కుళ్ళిపోదు


ఏ నొప్పీ రాదు, కనిపించదు

నా ముఖాన్నే చూస్తే


లోపాలు ఏ లోపలున్నా

నీ హృదయం వినే మౌనం ఏ దూరంలో ఉన్నా


నీవో

శాపగ్రస్తునివే


దహనం కాని పదాలే

నీ కలకి కావాలేమో