Followers

Saturday, March 30, 2013

ఆమెకి

ఎంత దయో
ఆమెకి

నన్నే క్షమించింది
నేలపై రాలిన పూలతో

ఆమె
చివరి మౌనం నాలోకి

ఇంకెంత దూరంలే
ఇంకిన మతి ఊపిరిలో 

Friday, March 22, 2013

అంతకుడు

అవే అలసిన రాత్రులు

అవే అలవని మాటలు 


అవి ఎవరికీ చెందలేదు


ఇంద్రియాల ఇంద్రజాలంలో



చెరో వైపు

ఎవరికీ మారుమాటలు లేవు



అవే కదలని అలలు


అవే ఎగరని మిణుగురులు

నేత్రనక్షత్రాల్లో చల్లటి చీకటి 

Thursday, March 21, 2013

వెలుక


నిరాళుడా! 


చిటుకుపొటుకు మాటల్తో
బద్దలైన బాధల్తో
కలల్ని కలగనే కలలతో
నీ కంపిత కళ్ళల్లోకి నువ్వే తొంగి తొంగి
చూస్తుంటావు మతిమరుపు నవ్వుతో
ఖాళీ జాలితో


సంతాపవృక్షంపై కాంతి కరిగిపోతుంటే
మరొకరి చేతులతో అన్నీ స్పర్శిస్తూ
ప్రత్యక్ష విమోచానాశ్రువుల్ని
దిగ్మండలిలోకి ఎగరేస్తావు


విప్పేసిన జ్ఞాపకాలనే
తిరిగి తిరిగి తిరగేసి తొడుక్కుని
మరణప్రవాహపు నీటిలో ఈదుతావు
నిశ్శబ్దాన్ని నిశ్శబ్దంతో వింటూ
వింటూ తేలిపోతుంటావు


వెన్నెముక వెన్నెలతో
నీ చీకటిని తయారుచేసుకుని
మరొకరిలోకి తర్జుమా చేసేలోగా 
అద్దంలో నీ పోలికలతో
నీ ప్రియురాలు ఆమె ప్రియుడు కనిపిస్తారు


అర్థరాత్రి దేవుడు నీకో వరమిస్తాడు
నీ చెవిలో ఎల్లప్పుడూ ఓ గుడ్డి చేప
శాశ్వతంగా జలక్రీడ తపస్సు కొనసాగిస్తుందని