Blog Archive

Followers

Tuesday, December 20, 2011

ఆత్మహత్య చేయాలి


చూసింది ఏదీ నిలవట్లేదు
నేత్రాలు హంతకులు

వినిందీ ఏదీ ఉండట్లేదు
చెవులు గాడిదలు

చదువుతున్నది ఏదీ ఎక్కట్లేదు
నాలుక ఓ పందికొక్కు

చేతులతో అలల్ని తాకాను
వాటి చేతులు నల్లగా పిలిచాయి

ఇష్టంలేని చోటునుంచి బయలుదేరాలి
జ్ఞాపకాల్ని ఆత్మహత్య చేసి

నా వంతు


మెత్తటి గాలి పెంకులపై నడవాలి
నీరై రాలిపోయే చీకటికాంతిలోకి

ఘనీభవించే ధ్వనులతో

స్వప్నపుష్ప శిఖరాలు తరలిపోతున్నాయి

నిరీక్షనాకృతి ఏదీ కట్టెదుట లేదు

నిశ్వాస రెపరెపల్లో సొంతమైనదేదీ కనిపించదు

నా సహచరులతో ఇక్కడి కడలి విషపు ఆకాశంలో తేలుతున్న

కాకుల పాదముద్రల్నివెంబడిస్తూ పిచుకల మైధున రహస్యంకై అన్వేషిస్తున్నాం

ఆమె చేతుల్లోకి చేరాలని మేమందరం బట్టలు విప్పేసుకుని

ఎవరి తర్వాత ఎవరూ అని ఉవ్విల్లూరుతున్నాం

ఎవరికీ వినిపించలేదు ఎవరు పిలుస్తున్నారో

ఒకరి తర్వాత ఒకరు మాటలు అంతమయ్యే ఆకృతిలోకి

ఇక నా వంతు

Saturday, December 17, 2011

చనిపోయే క్షణాల్లోకి

ప్రతి దీవెన ఓ శాపం
ప్రతి దుఃఖం ఓ దీవెన

ఏది ఎపుడు కరుణిస్తుందో


నిర్ణయించే క్షమాపణలు

దయతో మిగిలే గాయాలు

అంగీకరించని అంగీకారాలే సెలవు చెప్పే నీడలు

ఆహ్వానించుకుంటాను నన్ను నేను పరిణితి లేని ఛాయల్లోకి

కఠినమైన కృతజ్ఞతలు


ప్రాణంలేని వీడుకోలు


మరోసారి చనిపోయే క్షణాల్లోకి

ఒంటరిగా నడుద్దాం

Thursday, December 15, 2011

ఆకులపై ఆకాశం


నీరు నిండిన అలలో
మునిగి తేలుతున్న ఆకులు

ఆకుల్లోని నీరు ఎటు వెళ్లిందో
ఎక్కడికి చేరిందో

ఆకులపై ఆకాశం కనిపిస్తోంది
కొన్ని మబ్బులు దారితప్పాయి

కీటకాలకీ దక్కని ఆకులు

ఓ సుఖవాంఛ

సహజమైనదేదీ మానవ కల్పితం కాదు
పునరావృతమయ్యే మరణమే జీవించటం
విషాదం ఓ సుఖవాంఛ
భీతే ఓ సాహసరుగ్మత
సౌందర్యం ఓ అసౌందర్యాన్ని ప్రేమించటం
పరిచయమయ్యే ప్రతిదీ ఓ శిధిలజ్ఞాపకమే
నిర్వచిస్తున్నాను ఇవీ అబద్ధాలని
స్వేచ్ఛ ఓ అసహజమైన విషం
నమ్మిక ఓ పురాతన హత్య
పరాయి మౌనంలోకి ఎన్నటికీ ప్రవేశించలేను

Wednesday, December 14, 2011

అతృప్తి


. యీ మాట్లాడే చేతివ్రాత మాటలు ఇప్పటికీ అంతుచిక్కటం లేదు
. అవే ఎప్పటికీ దేనికీ ఎదురుచూడవు
. అవి తాకినా చలించిపోయే చర్మమే నాకైతే లేదు
. వాటి ఆలోచనల్లోకి ఆలోచనలు ఎలా వొస్తాయో
. ఇదంతా భాషే అని ఎంత గింజుకున్నా నమ్మలేకున్నా
. ఐతే వాటినే అనుసరిస్తున్నా అనుకరిస్తున్నా అంగీకరించలేకపోతున్నా
. పొతే చనిపోతే యీ మాటల్లోకి మాటలై అంతరించే మాటల్తోనే అంతరించాలి
. అమాటల సెలవు అతృప్తి సెలవు

Tuesday, December 13, 2011

చెత్త కుండీ నాలుక


ఒక గదిలో నాలుక అటూ ఇటూ తిరుగుతోంది. తనకేదో జబ్బుజేసిందని అద్దంలోకి తొంగిచూసుకుంది. రోజంతా చూసుకుంటూనే ఉంది. అద్దానికి చూసిందే చూసి కోపమొచ్చింది. ఒసేయ్ నాలుకా, నీ అందం పాడుగాను, నీకే రోగం లేదు. నన్ను, నా నిద్రను తెగ చెడగొడుతున్నావు. నీకేమైనా పిచ్చా. నా ముందుకొచ్చి గోల గోల చేస్తున్నావు. నీ కంపు భరించలేకపోతున్నా. నీ అవతారం, నీ నవ్వులు పరమ వికృతంగా తగలడ్డాయి. ఎటన్నా పోయి తగలడు. నా ముందుకు మళ్లీ రాకు. వచ్చావో నా అసలు సిసలు రూపం చూపెడతా. చెత్త కుండీ నాలుక. దరిద్రగొట్టు నాలుక. ఆ గదిలోంచి నాలుక బైటికి రావాలి. ఎవరు తీసుకొస్తారు.

Monday, December 12, 2011

జీవితం దేన్నీ ప్రేమించదు


ఆ చివరి కలకోరిక తీరనేలేదు. ఆ కోరికకల చివర తీరినఖాళీ. తీరాల్సినఅనుభవాలే ఎపుడూ లేవు. లేనిఅనుభవాల్లోంచే దేన్నో ప్రేమిస్తాం. లేని ఆలోచనల్లోంచే దేన్నో ప్రేమిస్తాం పొందామని. సోదిచెప్పే మాటల్లో మాటల సొద మిగిలిపోతోంది. పిట్టలుఏడ్చినా వినలేని జన్మ. నకలు కలలే ఇప్పటికీ. నకిలీ కలలే మాటిమాటికీ. మాటమాటకీ నకిలీ మాటలే. ధ్వని ఒకవిధ్వంసం. ఒక ఆత్మహత్య. స్పర్శ ఒక హత్య. ఎవరి నిశ్శబ్దంలోనో మనం పలకరించుకుంటాం. పలికే నిశ్శబ్దమే ఓ అద్దం. అడ్డమయ్యే అబద్ధాలే న్యాయ యంత్రాలు. తార్కిక దుఃఖం మరో స్నేహద్రోహం. క్రీనీడ శబ్దాల్లో నేత్రహృదయం. దొరకదు నిష్క్రమించే దుఃఖద్వారం. ఏ ఒక్క ఒంటరి జ్ఞాపకమూ లేదిపుడు. జీవితం ఓ అభిప్రాయమే. కొన్ని పదాలతో.

Saturday, December 10, 2011

చీకటి హరివిల్లు

ఆలస్యమైంది
ఏదో ఒకటి వెంటే ఉంటుంది వెంటాడుతూ

సూర్యుడో చంద్రుడో నీ లోపలే వెతుక్కోవాలి
భూమి మూసిన పూలు నీ లోపలే తెరుచుకోవాలి

ఉప్పటి చేతులతో పిట్ట ఎగిరే ఆకాశాన్నే అడగాలి
నీకో చిన్న ఆకాశాన్ని తెంచి ఇవ్వమని

ఖనిజాలకి ఊపిరిచ్చిన గాలినే కోరాలి
నీకో చీకటి హరివిల్లుని తెరిచివ్వమని

ఆలస్యమైంది ప్రతిదీ
నీ వద్దే కుక్కపిల్లై

Thursday, December 08, 2011

నా లోపల నీకై

ఇది ఏది చెప్పాలనుకుందో అదే చెప్పదు
ఎపుడూ ఏదో చెప్పే అర్థాలే చెప్పకుండాలనే ఇది

ఏ ఎటువంటి భావమూ తట్టదు
వాక్యాల్లోపలే ఉండే మాటలతో

అదేదో ఉందనుకునేలోపే
మోస్తున్న మాసిన మౌనమే రోతై

ఎక్కడో మొదలయ్యే అంతిమ విరామ
విశాల వికార వికృత వైరుధ్యం

ఎప్పటి దృశ్యమో ఎదురుపడుతుంది
చదవాలని అనుకునే అనుకోవటం

ఇంతకూ
ఎవరో చదివిన చూపుల్లోంచి ఏదైనా కనిపిస్తుందా

ఒకోసారి ఒకానొక నొప్పే తలకిందులైతే
విసర్గ సుఖమేదో రహస్యమౌతుంది

తెరవని గాలి ఆకుల్లోకి
తెరిచిన జ్ఞాపకాల వ్యత్యాసాలు

ఇదీ
విన్నావా

ఇదే
నా లోపల నీకై గొణుక్కుంటూ

Wednesday, December 07, 2011

భవిష్యత్తులేని వ్యాకరణం

ఏదో నీడ
వెన్నంటే, ఎవరు పంపారో

నీడలోకి లాక్కెళ్ళే నన్ను
నీడలోంచి బయటికి వస్తే అది ఏమౌతుంది

నీడలు ఏ భాషలో
ఏమి చెపుతాయో తెలిసేదెప్పుడు

భవిష్యత్తులేని వ్యాకరణం
ఈ జీవితం

జీవించి ఉంటేనే ఏ నీడైనా

Saturday, December 03, 2011

సొంత చీకటి

ఏదో సొంత వింత చీకటి

చెట్లు పెరుగుతుండే సముద్రపు చీకటిలో
నీ వంక నువ్వు చూసుకుంటావు

ఎన్నో వస్తువుల మధ్య మరో వస్తువు
నీలోకి చూసుకుంటావు

మాటలన్నీ మాగిపోయాక
ఆగిపోయాక నీతో మాట్లాడాలని అనుకుంటావు

ఏదో చీకటి వింత
నిన్ను నువ్వు వినాలనుకుంటావు

ఏదో
చీకటై చితికి

ఎక్కడో ఏ యాత్రికుడో
నీలానే రాత్రి సముద్రం వైపు నడుస్తూ ఉండొచ్చు

Thursday, December 01, 2011

చూడకు

ఆకుల్ని తననుంచి వొదులు కొంటుంటే
వృధా అని అనుకోలేదు చెట్టు

సంతోషపడే నిర్ణయాలు సంతోషపెట్టే అనిర్ణయాలు
రవ్వంత తేడాతో సృతిమించుతాయి

దాగున్న కన్నీటికి కన్నెప్పటికీ దూరమే
దాచిన పదాల్లో మౌనాన్ని వెతకాలి

అదృశ్యమయ్యే లోతుల్లోంచి ఏది విన్నా
మరికొన్ని సూర్యోదయాలు మిగిలే ఉంటాయి

చూడకు
ఓ అపరచితుడి శవం దేహమై నీ పక్కనే ఉండొచ్చు