Tuesday, June 13, 2023
|| రేపటి నీడ ||
ఎలా చూస్తుంది నిశ్శబ్దం
ఎటూ తిరగలేని శబ్దనిశిలో
జీవితం
ఎలాగోలా దిగలేని గమ్యం
అనుకోకుండా అనిపించే చావు
ఎవరిక చూసారులే
గుమ్మంలేని నీడలో వున్నా
/ అందుకో /
యిది ఏ సమయమైనా
ఓ వినని మనవి
యే అలిపి తనతో/అతడితో సంభాషించిందో
ఓడిన అక్షరాల సంకెళ్ళ తృప్తి
యెవరికి చేరిందో
యోగ ప్రేమ
యెవరి దాహాన్ని ఆపిందో
వొద్దు
వడలిన నీడ
దూరం చేరే వో పదం దూరమే
సౌఖ్యం
దుఃఖం కన్నీళ్ళకే రాదు
అదెవరికో, యెక్కడకో, చేరాలనే.
\ ఆగిన నిశ్శబ్దం \
చెప్పటమే జరుగుతుంది తాకలేని
ఆకారాల స్పర్శ గురించే
అద్దంలోంచి మాటలే, ఎగరవు. చూసే నాలుక, నీ లోపలి రెక్కల్ని తింటోంది. పక్కటెముకు బాధ ఎదురుచూపు, అంతా క్షేమం, అనటానికే, తన నవ్వని నవ్వుతో ఏడుస్తుంది. బెదరలేదు. మరో ఖాళీ మోక్షం పిలుపు. వినపడే అంగంగాలు, విరిగి. ముఖాలు ఎవరికైనా బరువే. వాక్యంలోంచి ఒక్కో పదాన్ని చెరిపేస్తూంటాను ఉంకో పదాన్ని చేర్చటానికి. పలకరింపు పదాల స్నేహం, ఎంత కౄరం.
దేహాలు, పుష్పాలు వెలుగుతాయి ప్రతి చీకటిలో ఎన్ని క్షమాపణలు ఎవరికి దక్కాలో
ఇక్కడేం జరగలేదు
ఎవరికీ
ఏ గదికో
ఓ గాలి చివర శబ్దం వస్తుంది
°° తప్పు నాదే ఎందుకైందో °°
మిగిలిన అక్కడి అలలని వొదిలి
కలలోకి ఎగిరే కడలిని నాలో మోసుకుంటూ.
నేత్ర దేవాలయాల్లో మోహం
కనిపించినా తీరదు, దొరకదు.
మౌనశిల్ప హృదయం
ఎగరాలనే.
బట్టలిప్పేసే పదాలు ఎక్కడో ఉంటాయి శిలలై.
రోగులు ఎవరూ మరణించరు.
కీర్తి
గడ్డకట్టిన అంధత్వం కాకపోతే చాలు.
ఓ కొత్త తోక
నా నాలుకపై.
సాలిగూడులో ఉన్నా
ఎవరో తెంపాలని ఎదురుచూస్తున్న.
కనికరించకే.
[ అంతరంగం, ఎక్కడో ]
పాడుబడిన పదాలు చెల్లవిక
అదృశ్య దేహం సంచరించే
మౌనంలో చీకటి లేదు
కొమ్మపైనుంచి ఎగరని పిట్ట
మొలవని వాక్యంలో పంజరం
దేనికోసమో ఎదురుచూపు
నీరేలేని అలొకటి ఎప్పటికైనా
ఎదురురావొచ్చు
మునగలేం
మునగమని చెప్పే వెలుతురు ఎక్కడుందో
కళ్ళని చెరిపేసే నవ్వులే
ఎక్కడికో నడిచిపోతాయి
వెకిలి కల
ఎటు వైపో
-- పొరపాటు --
ఎన్ని ముడతలు కావాలి ఈ నిద్రకి
ఎన్ని మడతల అక్షరాలు మిగిలాయో నోటిలో
బుర్రలేని జ్ఞాపకం
జ్ఞానం యిస్తే ఎవరిని అడగాలో
చనిపోయే నిశ్శబ్దం ఎలా నవ్వుతోందని
నొప్పి రాదెందుకో
ప్రతి అవహేళనా
నా లోపలి వినికిడిని చంపుతుంటే
దూరం జరగలేను
దేహమే వో అనాధ శత్రువు
కాకపోతే చాలు
°° అదో రంగంతే °°
ఇవే అది.
రాని మాటల మధ్య తిరగని బాల్యం
shadows of smell కోసమేనేమో
ఎటో మార్చిన పదాలలో
అటో ఇటో పరుగెత్తని అక్షరాలు
smile of death కోసమేనేమో
నత్తి సుఖం
అస్థిపంజరంలో
ప్రవేశించే నిరూహ
ప్రతి ఉదయంలో ఎప్పటినుంచో
కడపటి కదలిక
నృత్య వంచన
నా నాలుక తలుపు
తెరవని రంగు పులుముకుంది
[ ఇంతలోనే ]
ఎవరో చూసిన అదృశ్య పదం
ఎవరో నీలోకీ వేస్తే
లెక్కలేనన్ని రెక్కలున్న పిట్ట
నీ నాలుకలో తిరిగిందని
ఎవరికైనా చెప్పగలవా
| భయం |
కొలతలు తెలియవు కానీ ఓ
పూడ్చిన పదాలలో అపార నిశ్శబ్దం
నొప్పి పెట్టే గాలిలో అహంకార స్వేచ్ఛ
తేలుతూ ఉండే
పాచిపోయిన నీడలు
రాత్రంతా
ఓ కొత్త నాలుకను అల్లుకుంటాను
చేరలేని
ఉబ్బిన చీకటిలో ఉన్నా
ఒంటరితనం ఎవరికి రాలి కనిపించిందో
ఆత్మనేత్రాలు
ఇంకా ఎవరికి గోకుతూవుంటాయో
[ వేచి చూసే శబ్దం]
కాయితంపై దీపం పెట్టాలి
వెలగనిదో వెలిగేదో
చీకటిని చూపే దీపం
బలిదీసుకోలేని ఆయుధం
ప్రకటించే ప్రదర్శన
శరీర అస్త్రం
ఓ గంభీర శిక్షలో
ఇకనైనా విహరించు
దేనినైనా వొదిలి రావటం
దేనినుంచైనా వొదిలి పోవటం
దేనికైనా వొదిలి వెళ్ళటం
దేనిలోనూ లేకపోవటం
దేనికో ఉండకూడదనుకోవటం
దేనినో ఉంచాలనుకోవటం
ఎంత హింస
అక్షరాలే మిగులుతాయా
ఓ మూగ నడకకై
దేనినీ చూడకుండా వినటమేనా
ప్రకృతి పరమావధి
ఏదో రద్దీ నీడలో ఉన్నప్పుడే
ఎవరూ తాకని నేలపై చిందర వందర కల
నాలోనే ఓ చూపు
రహస్యపేటికలు తయారు చేసుకుంటుంది
నాలోని చెవికి
లింగమార్పిడి జరుగుతుంది
అందుకోని
మునిగిపోలేని
మోహ మౌనం
చూడని అక్షరమై
నవ్వులోంచి నవ్వని పదమై
తడిచిన మౌన పదమై
కుంచించుకుపోయే ఆకారాలే ప్రతి ఒక్కరిలో
కుంచించుకుపోయే నిశ్శబ్దాన్ని ఎవరూ చూడరు
ఏ చీకటో
దీపంకైనా ఉండనీ
[ దేహంలోకి రాలేని దేశవాళి దురద ]
వెతికే చూపులేవో అందులో ఉండునేమో
దొరికే మాటలేవో అందులో ఉండవేమో
ఆలోచనలు కనిపించే ఆకాశంపై ఎగరగలవేమో
విరిగిపోయే వొరిగిపోయే వీడిపోయే
పారిపోయే ఆనందం ఎగరనీ
కనిపించనీయకు ఎప్పటికీ
నోరు తెరిచే అద్దాన్ని ఎవరికీ
ఆకలేస్తే ఎవరిని దేబరించాలో
ఈ చిందరవందర ఆత్మైనా దారి చూపుతుందా
విడదీసేది ఏదైనా
ఎక్కడుంటుందో చూసావా
చప్పుడు చేసే మాటలతో
ఓ వాక్యాన్ని
చప్పుడులేని నిశ్శబ్దంలో ఎలా బంధించాలి
ఓ అబందీ
బట్టలిప్పేసే పువ్వులు నిను చూస్తాయి
నీకెప్పటికీ తెలియదు నీ నగ్న హాసం
గోడలులేని గోడలు కావాలేమో
ఓ చనిపోయే సువాసనలో
ఎప్పటికో అక్కడెక్కడో
నీ కన్నీటి బొట్టు విగ్రహం ఉండనీ
Subscribe to:
Posts (Atom)
