Followers

Monday, March 19, 2018

తూర్పు గౌటా

అసలు ఎవరికీ వంచన చేతకాదు. సాంస్కృతిక కాలుష్యాలు లేవు. సజీవులే సజీవులు. 

అసలు ఎవరికీ చికాకు రాదు. నీ లోపల ఖాళీ అద్దం. తిరగదు. గెంతదు. అసలు ఎవరికీ ఊపిరే అఖ్ఖర్లేదు. పువ్వులు చూడవు.  గాలీ చూడదు. సమాధీ చూడదు. 

తొడుగు. తొడుగు. సరికొత్త జననేంద్రియాల్ని. తొడుగు. తొడుగు. అపూర్వ అంగాల్ని. వాటితో సలాం పెట్టు. వాటికీ సలాం పెట్టు. మలాం పెట్టు పదాలకి. మలాం పెట్టు రాజ్యాలకి. పూజ్య రాజ్యాశ్రువులకీ మలాం అద్దు. హత్తుకో. ఒత్తుకో. ఎత్తుకో. అద్దుపద్దులేని సౌందర్య రాజ్యాధికారాలకీ  సలాం పెట్టు. మొక్కు. ఇంకా ఇంకా మోకరిల్లాలని మొక్కు. రక్తశిలాఫలకాలతో కీర్తించు.  

చరిత్ర భయపడుతోంది. ఇల్లు భయపడతాయి. పుస్తకాలు భయపడతాయి. ఆటస్థలాలు భయపడతాయి. ఆసుపత్రులు  భయపడతాయి. ప్రేమలు భయపడతాయి. యుద్ధ క్షిపణులు  భయపడతాయి. అరచేతులు  భయపడతాయి. శ్మశానాలు  భయపడతాయి. తుపాకులు  భయపడతాయి. చిరునవ్వులు  భయపడతాయి. కనీళ్ళు  భయపడతాయి. మతాలు  భయపడతాయి.  ఆటబొమ్మలు  భయపడతాయి.

ఎప్పటికి శాంతిస్తావు సిరియా? ఎప్పటికి శాంతిస్తాయి నీ ఆయుధాలు?

Wednesday, March 07, 2018

^^ పిల్లి నల్లగా లేదు ^^

గాలీ ఖాళీ. గదులూ ఖాళీ. వాటిలోని అక్షరాలు అంతకన్నా. వాటికి చీకటి లేదు. చీలే గోడలమధ్య వెలుతురూ చీకటే. ఎన్నడూ ఆలోచించకు. క్రీనీడలే సమాచారం అందించకపోయినా ఆలోచించకు. అనాలోచనల గదుల్లో ఏదీ దొరకదు ఎప్పటికీ. కుప్పకూలి కుళ్ళిన అక్షరాల శకలాల్ని ఎన్నటికీ కలపలేవు. అస్తిపంజరమేలేని మౌనంతో నీకేం పోయేకాలం. కంట్లోని కాగడాలు గడప దాటలేవా. ఊదు. ఊదు. ఈ మాటలు ఆరేవరకు. నేరమేదో ఏ కలకి ఎపుడు చెపుతావ్. ఏ అడుగుజాడల్లో ఏ కన్నీళ్ళో. వాక్యాల్లోకి వెళ్లలేని వాక్యాల్ని తిరస్కరించు. వెఱ్ఱి ఊహా ప్రార్థనల్ని ఇంకెంత కాలం వింటావ్. పెరట్లోని గడ్డి పరక నీ వంక చూడటం మానేయదే. నా ముఖంపైనే తోకలున్నాయి. వాటికీ మచ్చలున్నాయి. కడిగిపో ఏ చరిత్రతోనో. పిల్లి నల్లగా అసలే లేదు. బుసబుస మాటల్లో రక్తహీనత. చీమల్లో రక్తహీనత. కప్పల్లో రక్తహీనత. ఇపుడు పాములే రక్తదానం చేయబోతున్నాయి. ఇక రక్తాన్ని రక్తకమలంలో దాచుకోండి. అరవని పెదాలపై ఆముష్మిక హెచ్చరికలు. ఖాళీ ధవళిమ.

| | ఆఖరి స్థలం | |

చాలా దూరమే ఇక్కడకి చేరాలంటే
సమయమే మరీ పొట్టిగా
ఎపుడో చూశాను వానలో తడిసిన గాలిని
ఎపుడో విన్నాను నీటిపై పాడే పిట్టని
ఉత్త పదాల్తో ఖాళీ వాక్యాల్ని పేర్చాను
అనుకరించే ప్రేమ ప్రయాణాల్ని సమీపించలేనిక
సంక్షిప్త నిశ్శబ్దం ఎదురుపడుతోంది
ఇపుడైనా పరవశించాలి