Blog Archive

Followers

Tuesday, November 20, 2018

::: బలహీన ఐహిక అహంకై :::

నంగనాచి అనేత్రమేదో
ఆకర్షణాక్రందనల తనువులో
ఆక్రమించే ఎర్రటి నీడ 
నల్లటి మౌనంకై
అల్ప ఏకాంతమైనా ఉండట్లేదే
కృత్రిమ భ్రమల భంగిమలెన్నో
మోక్షిణీ
ప్రశ్నపరిమళాల అతృప్తి
విఫల నిశ్శబ్దం ఆహ్వానిస్తోంది

అనిద్ర దురాకర్షణ

పేద్ద చిక్కు. చిక్కుకో. చెక్కుకో. ఎప్పటి తుఫాను యాతనో. 
ఆత్మే ఆటంకం. దేహమో వెర్రి అద్దం. 
సందిగ్ధ దుఃఖ దరహాసం. శృంగార రాగం. 

ప్రశ్న వంకరే, సర్పం కాదు. వొలికిన కలే, నిద్ర కాదు. 
ఆలోచన, మరో అనాలోచన. 

అసంగత సంగతే, మది కాదు. 
దీపం ఓ సంబరం, నీడ కాదు. 
వొదులైన గది, గది కాదు. 

నిశ్శబ్దంకై, అన్నీ అరుపులే. నాలుకొక శిలువ, ఎవరికి దొరికిందో.  
ఏది వెలుగులో మెరిసిందో, ఏది తాకిందో చీకటిలో. 

సొంత అగాధాలు, అవతలి వలలు 
నాణ్యమైన రిక్తాశ్రువులు

నిరాశ శ్వాస నవ్వింది, అపహరించే స్వప్నమై. 
వంచన వనంలో క్రిమినై, అసహన నివాసంలో. 

వెళ్తున్నా ఖాళీ పాదాల్తో 
ఏ మలుపూలేని మార్గంలోకి  

Saturday, August 04, 2018

))(( విప్పు ))((

వణుకు కునుకు చినుకై
శిధిల నేత్రాల్లో
రోగం రాదు
రోగం చనిపోదు రాగమై
మరణం చనిపోదు
ఆత్మనీ అతిక్రమించే భాషనే వెతుక్కోవాలి
ఏ పొలిమేరలు లేకుండా రాకుండా
ఆ అదృశ్యఛాయకీ
ఏ రంగూ రాదు
రూపమసలే మసలదు
పోని పోలిక
పోని పొలికేక
పోని పూర్వ అపూర్వం
అకాలిక అరుచి ఆకర్షణ
ఎవరికో ఎవరిదో ఎప్పటికో
సొంత చూపు చిరిగింది
విప్పని వింజ

{{ మరల తల }}

ముఖమొహ్హటే
చలామణి గారడి
చలనం చలచలన
మరో మర
మరల తల
తాటకత్తై
మోహ మొహాల దడబడ
నయన ఖార్ఖానాలో మకమక
దాటని కన్నీటి పొలిమేర
ఆలోచనల పశువు
చిద్విలాస సంఘర్షణలో
దిగంబరై

Saturday, June 30, 2018

``` ముడిపడక ```

ఎవరూ లేని సాయంత్రం
మరో హృదయమే
అపుడే నిద్ర లేచే అలై
ఎవరూ లేని రాత్రి
మరో మధ్యాహ్నం
తడవని చినుకై వాలి
ఎవరూ లేని నడిజాము
మరో స్నేహ ఉదయం
ఇపుడే రెక్కలిప్పే కన్నీరై
ఎవరూ లేని సమయం
మరో జన్మే
ఎక్కడో మసక నీడ తోడై
ఎవరూ లేని వర్ణకాలం
మరో వైఫల్య నిశ్శబ్దం
తెలియని నయనంలోకి

Monday, June 11, 2018

|| స్వప్న శబ్దం ||

వొమ్పు 
ఒంపు తిరగని మాటల ముళ్ళనే 
నీరులేని కంటిలో ప్రేమలేని ప్రేమలో 
బంధించిన శబ్దాల్లో 

దరిచేరిన దాగుడుమూతల్లో 
దాపరికంలేని దూరాల్లో దగ్గర్లో 
నిశ్శబ్దంలేని నిశ్శబ్దాల్లో 
వొమ్పు ఒరగని ఎరగని ఒంటరితనాన్ని నీలో 

ఏ కట్టుకథలోనో 
బతికే బతుకుకై బతికేస్తావ్ బులబులాగ్గా 

పొరలు పొరలుగా పొర్లాడు 
నీడల నసలో 

వొకానొక నగ్నవృక్షంపై 
కాస్త ఆలస్యంగా నిద్రిస్తాను 
ఒడలిన వదిలిన ఆత్మీయ శూన్యంలో 

చల్లారని రాళ్లు తేలాడుతూ 
విరిగిపోతూ అగమ్య బాల్యంలో 

ఎప్పటికైనా 
కల మాట్లాడితే 
కన్నీళ్ల వాసన పీలిస్తే 
మరో మరణాన్ని జీవిస్తానేమో 

Monday, March 19, 2018

తూర్పు గౌటా

అసలు ఎవరికీ వంచన చేతకాదు. సాంస్కృతిక కాలుష్యాలు లేవు. సజీవులే సజీవులు. 

అసలు ఎవరికీ చికాకు రాదు. నీ లోపల ఖాళీ అద్దం. తిరగదు. గెంతదు. అసలు ఎవరికీ ఊపిరే అఖ్ఖర్లేదు. పువ్వులు చూడవు.  గాలీ చూడదు. సమాధీ చూడదు. 

తొడుగు. తొడుగు. సరికొత్త జననేంద్రియాల్ని. తొడుగు. తొడుగు. అపూర్వ అంగాల్ని. వాటితో సలాం పెట్టు. వాటికీ సలాం పెట్టు. మలాం పెట్టు పదాలకి. మలాం పెట్టు రాజ్యాలకి. పూజ్య రాజ్యాశ్రువులకీ మలాం అద్దు. హత్తుకో. ఒత్తుకో. ఎత్తుకో. అద్దుపద్దులేని సౌందర్య రాజ్యాధికారాలకీ  సలాం పెట్టు. మొక్కు. ఇంకా ఇంకా మోకరిల్లాలని మొక్కు. రక్తశిలాఫలకాలతో కీర్తించు.  

చరిత్ర భయపడుతోంది. ఇల్లు భయపడతాయి. పుస్తకాలు భయపడతాయి. ఆటస్థలాలు భయపడతాయి. ఆసుపత్రులు  భయపడతాయి. ప్రేమలు భయపడతాయి. యుద్ధ క్షిపణులు  భయపడతాయి. అరచేతులు  భయపడతాయి. శ్మశానాలు  భయపడతాయి. తుపాకులు  భయపడతాయి. చిరునవ్వులు  భయపడతాయి. కనీళ్ళు  భయపడతాయి. మతాలు  భయపడతాయి.  ఆటబొమ్మలు  భయపడతాయి.

ఎప్పటికి శాంతిస్తావు సిరియా? ఎప్పటికి శాంతిస్తాయి నీ ఆయుధాలు?

Wednesday, March 07, 2018

^^ పిల్లి నల్లగా లేదు ^^

గాలీ ఖాళీ. గదులూ ఖాళీ. వాటిలోని అక్షరాలు అంతకన్నా. వాటికి చీకటి లేదు. చీలే గోడలమధ్య వెలుతురూ చీకటే. ఎన్నడూ ఆలోచించకు. క్రీనీడలే సమాచారం అందించకపోయినా ఆలోచించకు. అనాలోచనల గదుల్లో ఏదీ దొరకదు ఎప్పటికీ. కుప్పకూలి కుళ్ళిన అక్షరాల శకలాల్ని ఎన్నటికీ కలపలేవు. అస్తిపంజరమేలేని మౌనంతో నీకేం పోయేకాలం. కంట్లోని కాగడాలు గడప దాటలేవా. ఊదు. ఊదు. ఈ మాటలు ఆరేవరకు. నేరమేదో ఏ కలకి ఎపుడు చెపుతావ్. ఏ అడుగుజాడల్లో ఏ కన్నీళ్ళో. వాక్యాల్లోకి వెళ్లలేని వాక్యాల్ని తిరస్కరించు. వెఱ్ఱి ఊహా ప్రార్థనల్ని ఇంకెంత కాలం వింటావ్. పెరట్లోని గడ్డి పరక నీ వంక చూడటం మానేయదే. నా ముఖంపైనే తోకలున్నాయి. వాటికీ మచ్చలున్నాయి. కడిగిపో ఏ చరిత్రతోనో. పిల్లి నల్లగా అసలే లేదు. బుసబుస మాటల్లో రక్తహీనత. చీమల్లో రక్తహీనత. కప్పల్లో రక్తహీనత. ఇపుడు పాములే రక్తదానం చేయబోతున్నాయి. ఇక రక్తాన్ని రక్తకమలంలో దాచుకోండి. అరవని పెదాలపై ఆముష్మిక హెచ్చరికలు. ఖాళీ ధవళిమ.

| | ఆఖరి స్థలం | |

చాలా దూరమే ఇక్కడకి చేరాలంటే
సమయమే మరీ పొట్టిగా
ఎపుడో చూశాను వానలో తడిసిన గాలిని
ఎపుడో విన్నాను నీటిపై పాడే పిట్టని
ఉత్త పదాల్తో ఖాళీ వాక్యాల్ని పేర్చాను
అనుకరించే ప్రేమ ప్రయాణాల్ని సమీపించలేనిక
సంక్షిప్త నిశ్శబ్దం ఎదురుపడుతోంది
ఇపుడైనా పరవశించాలి

Friday, January 12, 2018

\ అగత్యం /

ఖాయంగా ఈ కాయం
అటో ఎటో అసమయంలో
అనేత్రాల్లోకి జారుతుంటే
ఎప్పటి స్వరాత్మో
సలిల స్వప్నమై
అప్రేమతో అమాటలతో
ఏ అవ్యక్తరాగంలోనో అవివేకినై
ఏకాకితనపు అస్వస్థతే
విఫల ఉపశమనం

@అజీవితం

యెంత యెదో తెలియదు
వెతలే వెలుతుర్లో
సమయమే సంఘర్షణ
సంతృప్తి లేదు
మౌన మాయ
యాచించే యాది
దొరకని దూరంతో
శరీర శాపం
నిరంతర శవాలమధ్య
కొన్ని చూపులు
మాటల్లేని శబ్దాలు
ఎదురుచూస్తుంటాయ్
పుట్టని ఆత్మతో
ఎక్కడో జన్మిస్తావ్
జారిపో చేజారిపో
జాడల్లేని జీవేచ్ఛలో
లోపల ఏ లోపలా తగలని
లోపల తప్పిపో
మర్చిపో
మోసాల్ల్నీ మబ్బుల్నీ మాటల్నీ
ఈ వేళాకోళపు
జీవించే అజీవతంలో

) జారిపోఁ (

దొరకలేదు బాల్యం
అమ్మ ముందు
నాన్న ముందు
అసంతృప్తి
ఎక్కడ పుట్టానో
ఏ బొమ్మగానో
ఆత్మే మిగిలి
కృంగి
తగిలే
మరో ఫుల్స్టాప్
ఎదురు
చూస్తోంది
నిద్రలో
తేలి
రాలి