Blog Archive

Followers

Saturday, July 08, 2023

/ అదుఃఖ స్థలంలో /



నీ నాలుక కొలతలు ఎంత

నీ అబద్ధాల విస్తీర్ణం ఎంత


పగిలే గాలి

పగలే గాలి 


భుజాన మోసే అక్షరాలు 

ఇంకెంత దూరం అని అడగవా 


ఎవరికీ నీడల సంపద 

ఎవరిదీ ప్రేమల వంచన 


క్షమాపణ చెప్పలేని హత్యలే చూస్తాం

చివరి చూపు కొలతలెంతో 


ఏ భాషలో ఎలా లెక్కిస్తారో 



Thursday, July 06, 2023

నీ నుంచి...

వెలుతురు, 

అనేక నీడల్ని వెంటపెట్టుకుని ప్రయాణించే దుఃఖం, ఆనందం.


చీకటి, 

ఏకైక పాదముద్రల్ని విడదీసే, కలిపే, కల్సుకోలేని ఒంటరి అడుగులు.


నిశ్శబ్దం, 

ఒక అవయవం, ఒక పూర్తి శరీరం, ఒక కన్నీటి తడి గుండెలోపల.


ప్రేమ, 

గొంతులేని ఓ అందమైన కేక, ఓ తోడేడ్పు, ఓ ఒంటరొంటరితనం.


నవ్వు,

గొప్ప నిదర్శనం నీ ప్రేమకి ఈ బతికే కాలంలో.


దుఃఖం,

నువ్విచ్చే నిద్రలేని, శాంతిలేని, కలలేని, అలజడైన ఆత్మ.


మరణం,

మళ్ళీ మేల్కోలేని వెయ్యేల నిద్ర.


15-11-98

Tuesday, July 04, 2023

కన్నీటి నాలుక

 ఈ అద్దం ఎటూ చూడదు


ఈ శవం ఎవరిదో

ఓ అగతం


ఏ విత్తనమో

ఈ భగవంతుడు


ఎవరికీ వుండని నిశ్శబ్దం

ఏ గొంతులో దాగుంది


ఎవరెటు చూశారో

నాలుకలోని కన్నీటిని


ఏ ముఖమో

ఓ నీడ వాసనేసింది


ఈ వంకరటింకర శరీరం

ఏ గాలికీ కుళ్ళిపోదు


ఏ నొప్పీ రాదు, కనిపించదు

నా ముఖాన్నే చూస్తే


లోపాలు ఏ లోపలున్నా

నీ హృదయం వినే మౌనం ఏ దూరంలో ఉన్నా


నీవో

శాపగ్రస్తునివే


దహనం కాని పదాలే

నీ కలకి కావాలేమో

Tuesday, June 13, 2023

intivaipuki


 

|| రేపటి నీడ ||

 ఎలా చూస్తుంది నిశ్శబ్దం

ఎటూ తిరగలేని శబ్దనిశిలో
అబద్ధాల కవులు, కవితలు
ఏం రాసారో
జీవితం
ఎలాగోలా దిగలేని గమ్యం
అనుకోకుండా అనిపించే చావు
ఎవరిక చూసారులే
గుమ్మంలేని నీడలో వున్నా

/ అందుకో /

 యిది ఏ సమయమైనా

ఓ వినని మనవి
యెవరో నాలాగే
తన నాలుకపై వో చిత్రం చూడాలనుకునే అవస్థ
యే అలిపి తనతో/అతడితో సంభాషించిందో
ఓడిన అక్షరాల సంకెళ్ళ తృప్తి
యెవరికి చేరిందో
యోగ ప్రేమ
యెవరి దాహాన్ని ఆపిందో
వొద్దు
వడలిన నీడ
దూరం చేరే వో పదం దూరమే
సౌఖ్యం
దుఃఖం కన్నీళ్ళకే రాదు
అదెవరికో, యెక్కడకో, చేరాలనే.

\ ఆగిన నిశ్శబ్దం \

 చెప్పటమే జరుగుతుంది తాకలేని

ఆకారాల స్పర్శ గురించే
నింపటమే నిండని కన్నీళ్ళ పొగడ్తలని
పిరికిబందలు ఈ వాక్యాలు అరూప ప్రేమకై
అద్దంలోంచి మాటలే, ఎగరవు. చూసే నాలుక, నీ లోపలి రెక్కల్ని తింటోంది. పక్కటెముకు బాధ ఎదురుచూపు, అంతా క్షేమం, అనటానికే, తన నవ్వని నవ్వుతో ఏడుస్తుంది. బెదరలేదు. మరో ఖాళీ మోక్షం పిలుపు. వినపడే అంగంగాలు, విరిగి. ముఖాలు ఎవరికైనా బరువే. వాక్యంలోంచి ఒక్కో పదాన్ని చెరిపేస్తూంటాను ఉంకో పదాన్ని చేర్చటానికి. పలకరింపు పదాల స్నేహం, ఎంత కౄరం.
దేహాలు, పుష్పాలు వెలుగుతాయి ప్రతి చీకటిలో ఎన్ని క్షమాపణలు ఎవరికి దక్కాలో
ఇక్కడేం జరగలేదు
ఎవరికీ
ఏ గదికో
ఓ గాలి చివర శబ్దం వస్తుంది

]బహుమతి[

 ఇదొక పాత పదమే

కొంత కొత్త ఆలోచనలకి గురైందని అర్థం కాదు
కానరాని ఆంక్షల ఆకాంక్షల జాగ్రత్తల జ్ఞానంలో
చూడలేని వాక్యం
దొర్లు

°° తప్పు నాదే ఎందుకైందో °°

 మిగిలిన అక్కడి అలలని వొదిలి

కలలోకి ఎగిరే కడలిని నాలో మోసుకుంటూ.
స్పృశించిన ఎడారి తడి ఇసుకలో
దేహం ఓ దారితప్పిన చేప.
నేత్ర దేవాలయాల్లో మోహం
కనిపించినా తీరదు, దొరకదు.
మౌనశిల్ప హృదయం
ఎగరాలనే.
బట్టలిప్పేసే పదాలు ఎక్కడో ఉంటాయి శిలలై.
రోగులు ఎవరూ మరణించరు.
కీర్తి
గడ్డకట్టిన అంధత్వం కాకపోతే చాలు.
ఓ కొత్త తోక
నా నాలుకపై.
సాలిగూడులో ఉన్నా
ఎవరో తెంపాలని ఎదురుచూస్తున్న.
కనికరించకే.

[ అంతరంగం, ఎక్కడో ]

 పాడుబడిన పదాలు చెల్లవిక

తేలుతూ ఉంటాయి అక్షరాలు ఎప్పటికప్పుడు
మాటలు తీరాన్ని వెతుకుతాయేమో
అదృశ్య దేహం సంచరించే
మౌనంలో చీకటి లేదు
కొమ్మపైనుంచి ఎగరని పిట్ట
మొలవని వాక్యంలో పంజరం
దేనికోసమో ఎదురుచూపు
నీరేలేని అలొకటి ఎప్పటికైనా
ఎదురురావొచ్చు
మునగలేం
మునగమని చెప్పే వెలుతురు ఎక్కడుందో
కళ్ళని చెరిపేసే నవ్వులే
ఎక్కడికో నడిచిపోతాయి
వెకిలి కల
ఎటు వైపో

-- పొరపాటు --

 ఎన్ని ముడతలు కావాలి ఈ నిద్రకి

ఎన్ని మడతల అక్షరాలు మిగిలాయో నోటిలో
గూడు ఏ మాటలో ఉందో
చేరలేం
బుర్రలేని జ్ఞాపకం
జ్ఞానం యిస్తే ఎవరిని అడగాలో
చనిపోయే నిశ్శబ్దం ఎలా నవ్వుతోందని
నొప్పి రాదెందుకో
ప్రతి అవహేళనా
నా లోపలి వినికిడిని చంపుతుంటే
దూరం జరగలేను
దేహమే వో అనాధ శత్రువు
కాకపోతే చాలు

°° అదో రంగంతే °°

 ఇవే అది.

రాని మాటల మధ్య తిరగని బాల్యం
shadows of smell కోసమేనేమో
అవే మాటలు కావాలనే ఎక్కడో
scent of thoughts కోసమేనేమో
ఎటో మార్చిన పదాలలో
అటో ఇటో పరుగెత్తని అక్షరాలు
smile of death కోసమేనేమో
నత్తి సుఖం
అస్థిపంజరంలో
ప్రవేశించే నిరూహ
ప్రతి ఉదయంలో ఎప్పటినుంచో
కడపటి కదలిక
నృత్య వంచన
నా నాలుక తలుపు
తెరవని రంగు పులుముకుంది

[ ఇంతలోనే ]

 ఎవరో చూసిన అదృశ్య పదం

ఎవరో నీలోకీ వేస్తే
నచ్చలేదు నీ కన్నుకి
లెక్కలేనన్ని రెక్కలున్న పిట్ట
నీ నాలుకలో తిరిగిందని
ఎవరికైనా చెప్పగలవా

| భయం |

 కొలతలు తెలియవు కానీ ఓ

డబ్బా అంత కంటిలో
కాలం కాలుస్తున్న కల వొంటిని
వొంపిన అల ఏ
అభావ తీరంలో ఖైదైన మరణం
ఎటు చూసిందో
పూడ్చిన పదాలలో అపార నిశ్శబ్దం
నొప్పి పెట్టే గాలిలో అహంకార స్వేచ్ఛ
తేలుతూ ఉండే
పాచిపోయిన నీడలు
రాత్రంతా
ఓ కొత్త నాలుకను అల్లుకుంటాను
చేరలేని
ఉబ్బిన చీకటిలో ఉన్నా
ఒంటరితనం ఎవరికి రాలి కనిపించిందో
ఆత్మనేత్రాలు
ఇంకా ఎవరికి గోకుతూవుంటాయో

[ వేచి చూసే శబ్దం]

 కాయితంపై దీపం పెట్టాలి

వెలగనిదో వెలిగేదో
చీకటిని చూపే దీపం
నా అను మనసు తనువులో
తను ఎవరో
ఇప్పటికీ తెలవదు
బలిదీసుకోలేని ఆయుధం
ప్రకటించే ప్రదర్శన
శరీర అస్త్రం
ఓ గంభీర శిక్షలో
ఇకనైనా విహరించు
దేనినైనా వొదిలి రావటం
దేనినుంచైనా వొదిలి పోవటం
దేనికైనా వొదిలి వెళ్ళటం
దేనిలోనూ లేకపోవటం
దేనికో ఉండకూడదనుకోవటం
దేనినో ఉంచాలనుకోవటం
ఎంత హింస
అక్షరాలే మిగులుతాయా
ఓ మూగ నడకకై
దేనినీ చూడకుండా వినటమేనా
ప్రకృతి పరమావధి
ఏదో రద్దీ నీడలో ఉన్నప్పుడే
ఎవరూ తాకని నేలపై చిందర వందర కల
నాలోనే ఓ చూపు
రహస్యపేటికలు తయారు చేసుకుంటుంది
నాలోని చెవికి
లింగమార్పిడి జరుగుతుంది
అందుకోని
మునిగిపోలేని
మోహ మౌనం
చూడని అక్షరమై
నవ్వులోంచి నవ్వని పదమై
తడిచిన మౌన పదమై
కుంచించుకుపోయే ఆకారాలే ప్రతి ఒక్కరిలో
కుంచించుకుపోయే నిశ్శబ్దాన్ని ఎవరూ చూడరు
ఏ చీకటో
దీపంకైనా ఉండనీ

// కనిపించే నా చావు //

 చీమ వో రాత్రిని పిలిచింది

యీ పూట తన దగ్గరే వుండమని, తిరగమని.
అదో రాత్రి అంతే.
చెవిటి రాత్రికి
చెవులో వో కల కనిపించింది.
"నీవు ఎప్పటికీ
ఎప్పుడూ, ఎక్కడా ఒకచోట ఉండలేవు"
అని
వొకానొక శాపం విదిలించింది.
రాత్రంతా రాత్రి
తన అలలపై ఎగురుతూనే
అరుస్తూనే ఇప్పటికీ

[ దేహంలోకి రాలేని దేశవాళి దురద ]

 వెతికే చూపులేవో అందులో ఉండునేమో

దొరికే మాటలేవో అందులో ఉండవేమో

ఆలోచనలు కనిపించే ఆకాశంపై ఎగరగలవేమో


విరిగిపోయే వొరిగిపోయే వీడిపోయే
పారిపోయే ఆనందం ఎగరనీ

కనిపించనీయకు ఎప్పటికీ
నోరు తెరిచే అద్దాన్ని ఎవరికీ

ఆకలేస్తే ఎవరిని దేబరించాలో
ఈ చిందరవందర ఆత్మైనా దారి చూపుతుందా

విడదీసేది ఏదైనా
ఎక్కడుంటుందో చూసావా

చప్పుడు చేసే మాటలతో
ఓ వాక్యాన్ని
చప్పుడులేని నిశ్శబ్దంలో ఎలా బంధించాలి

ఓ అబందీ

బట్టలిప్పేసే పువ్వులు నిను చూస్తాయి
నీకెప్పటికీ తెలియదు నీ నగ్న హాసం

గోడలులేని గోడలు కావాలేమో
ఓ చనిపోయే సువాసనలో

ఎప్పటికో అక్కడెక్కడో
నీ కన్నీటి బొట్టు విగ్రహం ఉండనీ

Thursday, February 09, 2023

|| అచరం ||

యీ కాస్త మిగిలిన చినుకుల‌ చీకటి సమయం చాలు

యే దారేలేని నిశ్శబ్దం ప్రయాణించటానికి


చప్పుడు కావాలి 

ఓ మౌనమైకంలో జీవించాలంటే


రోదించే ఏ దూరమో  

నీలో ఎప్పటికీ రాదు

భయం కావాలి‌ ఏ కలకైనా


ఏదో నవ్వులేని నవ్వు నీలో 

ఎప్పటికీ ఎవరికీ చెప్పవు


పదాల మధ్య కిటికీలోంచి 

నీ కిటికీని ఎవరైనా తెరిచారా

తెరవకు నువ్వైనా 


శరీర నాణెం

శరీర దానం

శరీర జ్ఞానం


తెరుచుకోలేని రాత్రి నీలో 

దహనమే అవ్వదు 


ఇక ఎటూ చూడకు 

నీ నేత్రాలు నీవి కావు 


తొక్కుడుబిళ్ళ వాక్యాలు కింద ఎగిరే 

మనసులేని చీకటే నీకొక చినుకైతే చాలదా 


వొక స్థలంలోకి

యే నీడ ఏ నీడలోకి చేరిందని

| ఇప్పటి చూపు |

బలహీనమైన రంగేదో

అనాకారి ఊహలో


చింతా చిత్రం దొరకదు


మరలే కాలం కలలే

తారుమారు


శరీరంలోని ఈ మనసే

ఏ చోట ఉందో


వీడ్కోలు పలికే

భ్రమ శాశ్వతంగా ఉండనీ 


మరణం ఓ కదిలే రంగే

|| తప్పిపోయిన నీడ ||

వణుకుతోంది

దీపం చీకటిని చూసి

యిక నేనెటు వణకాలో


ఆమే తిరిగొచ్చింది

యే నీడా లేకుండా

నేనింకా ఆమెకై


భయం వేసింది

కలలో తిరగాలంటేనే

పదాల కలలు మరెక్కడో

| ఏమైనాసరే |

యింటికే

చేరాను.‌ చేరలేదేమో. ఎవరిక ఎవరికి చెపుతారు.


వర్షంలోని చినుకులే మౌనమై

తీరమేలేని వొదిలిన అలలు

ఖాళీ సముద్రంలో నేను


ఇక చాలించాలి ఎవరికోసమో

వలలోలేని కలలో కలనై

ఏ భాషలోనైనా నీకై ఎంత దూరమైనా 


సమీప మనసు అల‌ల అద్దం 

నీకెందుకు తెలియాలిలే


నీలో చేరలేని 

నిశ్శబ్ద పరిమళం

ఇకనైనా ఎదురుచూడనీ

: తాకని కల :

కన్నొక డప్పు

అదో

భయశబ్దనివాళి


దేహమే.. కనిపించిందా.. వినిపించిందా..

ఎటూ గెంతలేవులే.. శూన్య శబ్దప్రసవం నీలో


తయారయ్యే వాక్యం చూడలేవులే


వేలాడే‌ వస్తువులేవో వొంటిపై

నిశ్శబ్ద అందాలని నరకడానికి ఎదురౌతాయి

మేఘతరంగాలై ఎండమావై


నాలుకపై 

మెలికలుపడే

అక్షరాల వెంట్రుకలు అందరిలో గుచ్చుతూ


చేరిందని చేరిన ప్రతి స్థలం 

ఓ వికృత మరణం 


కలల కులం పారిపోవాలి

యీ దేహం నుంచి

అంతుచిక్కకుండా


పూర్తి కాలేదంతే. చూస్తున్న అద్దం ఎందుకో ఎదురులేని వాటికోసం ఎదురుచూపులు. పవిత్ర నగ్న నిశ్శబ్దం. విడిపోని స్పర్శ. ఏ కళేబరందో.

:: చెవిటి కల ::

అంతం దొరికిన నేత్రం

చూస్తున్న నీలో


వణికిన మనసే 

చిన్న చివరి చిటపట


మనసు మిణుకు వణుకు

నీకు తెలియదులే


సుదూర అక్షరాల అంకెల సంకెళ్లు

నీ ముందు చూడగలనా


నాకొక చెవిటి కల చాలు

యికనైనా బతకటానికి


ఓ కళేబరంలో


అది ఎవరికి చెందిందో?

:: యెవరికో ఆ నిద్ర ::

నమ్మకం వో విషం

కలలోని విషం యెప్పటికీ తెలియదులే


దేహం 

వో పునరావృత స్మరణ చేష్ట

యే ఋజువూ వుండని బతుకుకి


నిద్ర

ఓ అవస్థ


రేపటి ముఖం 

యెవరికీ గుచ్చుకోకూడదు


కడగలేని కలలు 

కదలలేని మనసు


రంగులు వెలిసిన

ఖాళీస్థలం నీ నవ్వు


కాస్త చలి పిలుపు చాలు

మాట్లాడే మాటలే ఉండవిక

[ సంజ్ఞ ]

యిప్పటికీ పరాయి పదాలతోనే 

నాది కాని భాషలో కూరుకుపోతూ


ఆలోచనల వలకి

చికిత్స లేదు 


పై పై పొరల మధ్య 

అక్షరాల తోపులాటే 


మెత్తటి పిర్రలు కలలో

షోకు శోకం 


వో వుదయం 

వున్నట్టు


యే చూపు చెపుతుందో

:: చల్లటి వేడి ::

ఓ ప్రదేశం

ఈ కనపడని వాక్యంలో

నీలో సంచరించకపోతే

అతిథి గృహం అద్దంలో నువ్వు లేనట్టే


మనకి ఖాళీ అందాలు, అద్దాలు

ఓ భాషలో కూరుకుపోవటం ఇష్టం


వెతుకు

వెతకలేని దృశ్యంనే


శరీరంపై 

శవంనే చూడగలవు


నరాలే లేని నేలపై

నీ పొగరంతా

వినని అక్షరాల మైకమే


తెరిచే ఉంచిన పదాలు

నీ దుఃఖం చెప్పలేవ్


అదేదో తర్వాత

ఏ బహుమతి కాలంలోనైనా

నీ నీడ నీకై ఎదురుచూడదు


స్పష్టమైన 

నిశ్శబ్దం నీలో లేదులే

:: వినని వీడ్కోలు ::

పాత కాయితంలో కొన్ని మాటలు రాసినప్పుడు 

చెరిపేసుకునే జ్ఞాపకాలు చాలు 

ఊహలే ఉన్నంతవరకు 


ప్రతిరూప వంచితులు

చుట్టుముట్టిన పదాలే


గానం చేసే నకలు అక్షరాలు

ఏ దుఃఖితుడూ అందుకోడులే


నీకే కనిపించే అవే పిట్టలు 

నీకై మారిపోయే అవే రాత్రులు

నీలో చనిపోయే ఓ దిగంబర మౌనం 

నీతోనే యింకా ఉంటుందా


అబద్ధం ఓ నచ్చిన వెలితి వెలుతురే

:: నేల అలలో ::

నడవని పడవల మధ్యే నడుస్తాను ఈ పూట

నాలో నిర్దిష్ట సమయం వేదిక లేదిక


తరచూ తిరగలేని తీరంలో 

ఖగోళ విశ్రాంతి చినుకులో

 

ఓ కల పక్కన 

నవ్వని నవ్వుతో నిద్రలేవాలి


ఏదో వొక గాయంలో


ఈ పూట పాతిపెట్టిన

నా దేహం లేకపోతే కాకపోతే చాలు

:: నీ నీడ నీకే లేదు ::

వో తారీఖు ఉండని పగటిపూట


దగ్గరగా నిన్ను చూసి పారిపోయే‌ అల

అలా యెత్తుకుపోయింది తన మూగ చేతుల్లోకి


ఆమెకొక దేహం దొరికింది

ఆమొక అలేమో


ఇల్లు

అనుకునే ప్రదేశం ఉండనోడికి

నిద్రనే ఊహే ఓ విషం

ఓ ఊపిరి శిక్ష 


ఆమె నిను ఎప్పటికైనా 

విముక్తం చేయగలదా


కృశించే రంగులేవో 

ఆమెకు బాగా తెలుసు


యేది నీ తారీఖో

యికనైనా రాసుకో

|| వో అరవని అద్దం ||

కానీ, అయినా

యీ రెండు కళ్ళు బహు యిబ్బందే.

యెంతవరకు పైకి చూడగలవో నాకు చెప్పవు.


తొంగిచూసే నిశ్శబ్దం 

వొంటరై యెదురు చూడదు.


హృదయ భ్రమ 

దేహాన్ని క్షోభపెడుతోంది.


బందీనైనాను.

కలలోలేని నల్లటి స్వేచ్ఛకై.


ధూళినే సేకరించే పదాలతో

వో మరణం నను చూస్తే

తిరిగిచూడగలనా.

Under the influence of Abbas Kiarostami

పూయని పూవుకై 

కొమ్మ యెదురు చూసిందని

చెట్టుకి యెప్పటికి తెలిసిందో


యెగరని గాలిపటం కన్నీళ్లు

ఏ చేతిలో మిగిలాయో


ప్రదర్శనకు ఉంచిన 

తైలచిత్రంకి నీడలేనట్లే

నువ్వూ లేవు


కాలి నడకకీ

కల నడకకీ 

దేహమే అడ్డు


గమ్యం ఏ దుఃఖందో

ఆ దారిలో నవ్వని మరణం 

ఓ ఎగతాళే


మిగిలిన దిష్టిబొమ్మ

కొత్త నేస్తంకై ఎదురుచూపులు

ఖనన మౌనంతో 

[ విరామం ]

ప్రతి నీడకీ నీడకీ మధ్య

కరిగిన అడుగుజాడలు


విరిగిన ఖాళీలు యెగిరొస్తుంటే 

సముద్రపు చీకటిలోకి మోసుకుపోవాలి


ఎందుకులే 

పనికిరాని

తెరుచుకోని విరక్తి 


బాహ్య ఆత్మనే దేహం అందామా


మసిబారిన మౌనం

యే రంగులో వుందో