Blog Archive

Followers

Monday, November 21, 2011

((( మీది కాదులే )))

చెరిపేయాలి చెలియకీ తెలియని సూర్యుడిని. చేరవేయాలి మాటలనే మాటల్లోకి. ఆమెతో మాటల ఆట ఆడకూడదు. మాట్లాడకూడదు. సిద్ధాంతాల్ని విషపు పురుగులు తింటాయి. చల్లటి పిట్టలు పురుగుల్నే తింటాయి. చీకటి మూతుల ముద్దుల్లో శవాలు నవ్వుతాయి. గుర్తుపట్టలేని చెట్లు, కలలు, బావుల్లోకి దూకుతాయి. అలవాటో, అనుభవమో తెగుతున్న ప్రార్ధనలో ప్రభావాలే పురుడోసుకుంటున్నా, ముదిరిన ప్రవచనాలలో శూన్య రంధ్రం. నీటి గాలి తేలదు కళ్లపై. తెలియని మనసు అడుగుల్లో అడుగులేసుకుని ఎక్కడికని, ఎందుకని. అంధకౌగిలేదో సంభాషిస్తూ శరీరాన్ని దాటుతూ. నేలపెదవిపై ఎవరో మూర్ఛద్వేషాన్ని నాటారు. అంతమవ్వదు ఇపుడే వస్తున్న జ్ఞాపకం. చీకటి వాసన. మరణాన్ని చీల్చే మాటల్లోకి మాటల్నే మార్చాలి. ఏమార్చాలి. ఇసుకలో సూర్యుడ్ని దాచాను. ఏ రాత్రీ మీది కాదిక.

Wednesday, November 09, 2011

~~~ఇంకా పూర్తికాలేదు~~~

కళ్లకి సాక్ష్యాలు దొరకవు. తెరిచిన తలుపుల్నే భుజాలపై మోసుకుని లోపలికి బయటకి. సరిపోదు ఈ రాత్రీ, కన్నీళ్ళని లెక్కించాలంటే. కలలు కలల్ని ఊసేస్తాయి. కంటిలో చిరిగిన ఆలోచలని కుడుతున్న మౌనానికీ చెప్పవు నీ అబద్ధం. నిశ్శబ్దం తర్వాత ఏ రహదారిలోనో వీడ్కోలు. ఇల్లు ఎందరికి ఉంటుంది సముద్రమై. ఎడారి చీకటే అందులో. గద్ద గూటిలోని గోడు ఎవరికి చెప్పాలిలే. మిణుగురుల సంతకాల్ని అనుకరించాలి. తేడా తేడా. నీడ నీడకీ. కన్నీటికీ, కన్నీటికీ. యంత్రాలే అత్యాచారం చేస్తున్నాయి. ఆగిపోయే సముద్రనదుల్నీ, మనిషి ఎముకల్నీ, తిరిగి తిరిగి దర్శించుకోవాలి. నవ్వే పేదలు, నవ్వే పెదాలు ఎవరు చూసారులే. అసహ్యహించుకునే మాటలేవో ప్రతి వొంటిలో. ఆ అసహ్యరహస్యం అందరిలో దాగుందా. రెండు సమాధులు ఈ వొళ్ళంతా. ఆనందం ఆనందంతో ఎపుడైనా ఉందా. కళ్ళని, కన్నీళ్ళని తెరిచే మనసుని చూసింది ఎవరు. దొరకని దొంగతనమే దైవత్వం. నిన్నటి వర్షం ఇంకా ఏ కనులలోనో. కొందరికే సత్యమే అసంతృప్తి. నా అంత్యక్రియలు ఇంకా పూర్తికాలేదు. నమ్మించే గాలి, నీరై, ఏ పూవుల అంచుల్లోనో. ఖాళీ పుష్పాలు. ఖాళీ సమాధులు. ఖాళీ నేత్రాలు.

Monday, November 07, 2011

నన్ను తీసుకెళ్ళు

పక్షి రెక్కలు
భూమిపై

భూమి
పక్షిపై

ఆకాశం
ఓ సమాధి

ఏ గొంతులోనో
పిట్టగూడు

చనిపోతాను
కొన్ని మాటల రెక్కలపై

గాలీ
నీ నిద్రలోకి నన్ను తీసుకెళ్ళు



Thursday, November 03, 2011

ఎలుక నాలుక

ఒక వెర్రితనాన్ని
ఇక్కడ ఉంచాను

అది పెరిగిందో
లేదో రోజూ వచ్చి చూస్తాను

ఒకోసారి ఇక్కడేదీ కనిపించదు
ఒకోసారి ఇక్కడేదో ఉన్నట్టు

నీడలపై నీడల అనుకరణ
అనుసరించే పదాల నీడలు

వెర్రితనం ఎవరికి తెలియాలిలే
రహస్యమోక్షం అందులోఉంటేగా

ఏడుపులు కలలో
వెర్రితనందేమో

తనకీ నాకూ మధ్య
ఓ మేఘమే అడ్డు

తొంగిచూడలేను
సూర్యుడిలోకి

ఎలుక నాలుక
నా కంటిలో తిరుగుతోంది