అక్షరాలూ లేని పదం
తాకాలో, తడవాలో, తుడుచుకు పోవాలో
ఎంతకీ చెప్పదు తుషార విషాద స్వప్నం
పదాల శూన్యం ఎల్లప్పుడూ తోడుండదు
శూన్యలిపై జ్ఞాపకం తోడు రాదు
మౌన వజ్రాలు నీ పెదాలు
నిరీక్షణలో నీ మాటలే నాకొక మరోజన్మ
గాలిపటానికి గాలి దూరం ఎంత
ప్రేమపటానికి మనసు దూరం ఎంత
అనేక రేయింబవళ్ళ కనుపాపలపై
ఆశతో ప్రయాణించే వర్షానయ్యాను
ఏ తీరాంతంలోనో
దీపంలోని తలుపుల్ని మూయాలి
అప్పటివరకైనా, తలుపెయ్యకు
తల వంపుల తలంపుల తలుపెయ్యకు
అవే, నేల రెక్కలై, దేహభాగాలై
రూపంలేని ఒంటరి మాటలై అడ్డుపడ్తాయి
తలుపెయ్యకు. తారట్లాడే కలలు
కాలాన్ని వొదిలి మరీ వస్తాయి
ఆకలి తీర్చే ధాన్యాన్నీ, ధ్యానాన్నీ
ఊక ఎగిరినట్టు తలుపెయ్యకు
కన్నీళ్ళని ఆపిన కనురెప్పల్ని మూసినట్టు తలుపెయ్యకు
జ్ఞాపకాల్ని శరీరంతో తోసినట్టు తలుపెయ్యకు
తలుపుల నిశ్శబ్దాన్ని కలపకు
గాలి నురుగులో
పదాల అద్దాల్లో
మెరుపుల మన్నులో
నింగి శ్వాసలో
నీ కోసమే తలుపులు తెరుచుకోవాలని
ద్వారాలే లేని దుఃఖకాంతినై అంకురించాలని
1 comment:
శ్రీశ్రీ, తిలక్, అజంతా, ఇస్మాయిల్ - వీరి కవిత్వం చదవగానే, కలం పట్టేసుకొని వ్రాయాలనిపిస్తుంది. అలాంటి ప్రయత్నాలలో, కలం కాల్చుకునే ప్రమాదం ఒకటైతే, కాపీ కవులుగానో, ఇమిటేషన్ కవులుగానో మిగిలిపోయే ప్రమాదం మరోటి. అటువంటి ప్రమాదాల బారిన పడ్డ ప్రజలు చాలామందే ఉన్నారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, మీ కవిత్వం చదవగానే చేతులు కలం కొసం వెదుకులాట మొదలెట్టేస్తుంది, తమాయించుకోవటం కూడా కష్టమౌతుంది. అద్భుతమైన కవిత్వమండి మీది.
Post a Comment