Followers

Thursday, August 05, 2010

శితి

సంచరించు. గబగబా మాటల దూరాన్ని అందుకో. దారి లోపల దారి. నిశ్శబ్ద సూర్య సమయమిది. స్వాగతించే నిర్మల నిశీధి. త్వరత్వరగా చేరే పదాల్లో అలుక్కుపోయే నిస్సహాయ గతం. సైగలు చేసే వాక్యాలు. పలకరెవరూ. పదిలపర్చుకునే అస్థికలు లేవు. హుటాహుటిగా అశ్రువుల్ని తరలించే శరీరం. తొందర తొందరగా తారీఖుల్ని మూటకట్టాలి. చీకటి కిరణాలు. పదే పదే వెంబడించే ఒంటరి గాలి. లేరెవరూ వారి వారి సమాధి దగ్గర. స్పర్శరహిత ప్రదేశంలో పరిభ్రమించు. నిర్గమ్య మార్గాలుండవు. పగిలిన సూర్య దర్పణం. ఆశ లేని అశాంతి. స్నానం చేసే చంద్రుడు. కదలకు. ఆకుల్లోంచి సముద్రాలు రాలొచ్చు. నక్షత్రాలు మట్టిలో పెరగొచ్చు. నవ్వుతున్న అంతిమ యాత్ర. గుండ్రటి చెట్లకీ తెలుసు మరణించే వాయువు తమతో ఉందని. అలల పాదాలపై నడవాలి. అచ్చుతప్పులున్న మృత్యువు. సరిదిద్దే బతుకు బలపం విరిగింది. మెత్తటి నీడలో సీతాకోకచిలుక. ఉప్పటి వియోగం. రాయని అక్షరాలపై పాకే మూగ వెలుతురుని తుడవాలి . పచ్చటి ఏకాంతంలోకి ఎగిరిపో, ఎవరిలోనో జ్ఞాపకపు ద్వారాలు మూతపడేలోపు. పొడవాటి కళ్ళల్లో గడ్డి పెరుగుతోంది. గాలి నిద్రపోతోంది.

No comments: