నిద్ర కళ్ళల్లోకి తొంగిచూడు. అదొక అడవి తీరం. గుచ్చి గుచ్చి చూసినా, అందేదీ అగుపడదే. కొన్ని యుగాలనాటి ప్రదీశామీమూ, వెళ్ళినా, తిరిగొచ్చే వీలు లేక, భయమింకా పోలేదు. అందులో కొంత కోతకి గురైన కలొకటి ఉండేది. ఇంకెప్పటికీ, ఇంకెవరకీ దొరకని దొంగ కల ఇప్పటికీ. కంటిపాపలో సగం సగం విరిగిన చిత్రాలేవో. అచిత్రాలేవో. ఊహా చిత్రాలేవో. విచిత్రటూహలేవో. కదలాడే కనుపిట్టల నేల ఏదో కనుగొనలేక ఆ ఊపిరిపిట్ట, తన రెక్కలు ఎక్కడ దాచిందో. ఆ రెక్కల మాటలు ఎవరి చేతుల్లో తేలుతూ మునుగుతాయో. ఎగిరిపోతాయో. ఆ ఊపిరిరెక్కల మాటలపిట్టకనులు ఎందరి కళ్లపై పడి, గీరేస్తే, పీకేస్తే, చూసే ఈ మాటల కలల పిట్టని తినే కొన్నినిద్రలు దొరుకుతాయా. దొరకని వెలితి. ఎక్కడుందో తెలియదు. ఎప్పటిదో. బాధిస్తోంది. బంధీనై, నా నీడల చిరునామాకై, నా దేహంపై తిరుగుతున్న అలల్ని చెట్టులో దాస్తున్నా, చనిపోయే చంద్రుడై, అలలన్నీ విరిగిరిగి పైకి లేస్తున్నాయి విత్తనాలులేని చంద్రుడి చెట్టుమీద. చీకటి కొమ్మల మసి మాసిపోక, మూసిన మూతి మాటల మాటల్లోంచి మరికొన్ని చీకటి కొమ్మలు పెరుగుతున్నా, ఖైదీనై, ఖరారు కానీ ఖడ్గమేదో నాపై తిరుగుతున్నా, లేత రంగుల గీతాల్లోని గీతలేవో ఆకుల ఎముకల్లోని నిశ్శబ్దంతో సంభాషించక, గాలికి ఎగిరెగిరి ఎక్కడికి చేరేది ఎవరికి చెపుతాయి. కొన్ని వృద్ధ స్వప్న హస్తాల్లోంచి, ఎండిన నిద్ర విత్తనాల కళ్ళల్లోంచి, నీ నీలి నేల నెత్తురు జలపాతపు గాలిదుప్పటిలోంచి...కదిలే గొంతులు, కుమిలే నాలుకలు, కమిలే కన్నీళ్లు, కులికే కలలు, కెలికే చావులు, కసిరే కసి, కోసే కోపాలు, కడుపు ధ్యానం, కుడుపు శోకం, కొయ్య ఇల్లు, కొయ్యలేని కౌగిలింతలు, క్షణిక నీతులు, కుండలో కుండలినీ అస్తికలు, కాయితపు కడలి, కూలిన కాలపు గెల, కుళ్లిన కలలు, అప్పటి దేహపు సందర్భాల మాలిన్య మాసికలతోనే ఈ రోజుకీ ఓ రోగపు పులకరింత. నా కళ్ళల్లోకి నేనే తొంగిచూడాలి, తొంగోవాలి. తోలుతీసిన కొండల్ని వెంటపెట్టుకుని నడవాలి. తీరపు పూల చేపల్ని పట్టుకుని లేచిపోవాలి. ఇసుకిసుక సూర్యచంద్రుల రాత్రుల్ని విసుక్కోకుండా వెంబడించాలి. గాలి గుర్తులులేని గాలిపటం ఎక్కి నిద్రపోవాలి. నిదురలో జ్ఞాపకాల రాక్షసి తల నరికి, నా తలలో దాచేయాలి. తల నీడల తలనీలాలు అర్పించి, అప్పటికప్పుడు మూసుకుపోయే నీడల ఎడారి గుహల్లో తలదాచుకోవాలి. తడారిపోయే తలంబ్రాల తక్కెడలో ఇప్పటి కలల బరువు లెక్క తేలదు. తెగులు పట్టిన మానసిక ప్రపంచంలో తేలిపోవాలి. రాలిపోవాలి. బరువు కలలే నేల మీద మిగులుతాయి. లెక్కాడొక్కా వొద్దులే, వోడిపోయిన వడ్లగింజల గింజుడులో గంజిలేని గుంజీల గుణాలు ఉంటే చాలదూ. వంచించే వచనముంటే చాలదూ. వంగిపోయే వాక్యముంటే చాలదూ. వంకరటింకర కలలుంటే చాలు, రేపు ఇదే వీధుల్లో మరల మరల తచ్చాడుతుంటాను. కొన్ని అనామక నిద్రలతో. మరికొన్ని అకాల ఆకారాల పదాలతో. గాలి తెరలు తలాడించేవరకు. నా కల తలుపులు మూసేవరకు.
2 comments:
ఏమీలేని కుండని ఎక్కడికని తెరచి చూపిస్తావు. ఈ గాలిలోకి. ఎన్నిసార్లు ఇక్కడికే వచ్చిన మనిషి తిరిగి ఎక్కడికి వెళతాడు. ఇక్కడ తెరుచుకున్న ఖాళీ ఎక్కడికివెళ్ళినా ఒక సాగతీసిన అదే నీడ.
సగం విరిగిన కుండకల నేలను కనుగొనలేక ఊపిరిపిట్ట తన లేలేత రెక్కల మాటలను ఎక్కడ దాచిందో. చనిపోయే చంద్రుడై అలలు ఎందరి కళ్ళపై పడి గీరేస్తే పీకేస్తే మాటలకలలపిట్టని తినే కొన్ని నిద్రలు దొరుకుతాయా. దొరకని ఎక్కడిదో తెలియని వెతికే వెలితి. నీ దేహంపై తిరిగే అలలు ఎగిరి ఎగిరి గాలికి చెపుతూనే ఉంటాయి. ఈ చీకటి నెత్తురు గాలి దుప్పటిలోంచి కదిలే గొంతులు, కుమిలే నాలుకలు, కమిలే కన్నీళ్ళు ఎముకల గూడుపైపడి ఎండినకళ్ళతో మాట్లాడుతూ పొగిలిపొగిలి పులకరిస్తూనే ఉంటాయి.
మొహంలేని వెలితి ఎందుకింకా వెతికెతికి ఎప్పటిదో తెలీని తిరిగేమొలిచే దాహాన్ని ఎన్నిసార్లు ఎక్కడికివేచ్చి మళ్ళీ మళ్ళీ ఇసుకిసుక సూర్యచంద్రుల రాత్రుల్ని వెంబడిస్తూ ఉంటుంది. చీకటికొమ్మల మసిమాసిపోక మళ్ళీ మరికొన్ని చీకటికొమ్మలు పెరుగుతూ ఈ తెరలు గాలాడించడం మానవు. అప్పటివరకు ఈ అనామక నిద్రలు, అకాల అకారాలు నీకలలని తడుతూనే ఉంటాయి.
chala goppa prose poem
Post a Comment