Followers

Tuesday, November 30, 2010

వాన మొక్క

అనుకోవాలి.

రేగుపండు గాలి వాసనకి
వేపపూత మబ్బుల వాసనకీ మధ్య.

ఒక పాత కంటిలో కొన్నే కనులు.
పాటలు పాడిన కళ్ళతో
జ్ఞాపకాలకై ఎదురు చూడాలి.

అనుకున్నా. కళ్ళు ఎంతో పాతవని.
పూలూ పాతవే.
మాటల్లోని మాట్లాడని మాటలూ పాతవే.

అనుకోకుండా.
శరీర అస్పష్టతతో
ఇక్కడ ఏదీ జరిగినట్టు ఉండకూడదు.

చల్లటి కాంతి కావాలి
ఎవర్నో చూసేందుకు.

అపవిత్రతతో నవ్వుకోవాలి
పవిత్రతతో ఏడవాలి.

అనిపిస్తేనే.

సెలవులు లేని కొండల నుంచి
విశ్రాంతి లేని మేఘాల నుంచి
జీవించే మృత్యువు నుంచి దాక్కోవాలి.

గాలీ
ఉన్మాదే.

మారుతున్న నిన్నటి నీళ్ళపై
గూడు వొదిలి రాగలిగే నీరు ఏది.

కంటిలో పెరుగుతున్న నాచు పూలు.
హృదయం ఎండిపోయే వాన మొక్క.

ఓ సీతాకోకా!
నీ మనసు నీకన్నాఎంత బరువు?

Friday, November 26, 2010

హాఫ్ లాంగ్ కి.............. దూరంగా

ఎందుకు వొచ్చాను
పదునైన సూర్య నిశ్శబ్దంలోకి
..

ఉసుళ్ళు నిద్రపోయే చీకటికి
నేనెంత దూరంలో ఉన్నాను
..

కళ్ళల్లోకి తిరిగెళ్ళే ముళ్ల మాటలు
ఏమి చెప్పాయో మనసూ చెప్పదు
..

నమ్మకం లేదు
నీటితో
నీటిలో బతికే జీవుల మీద
..

కన్నీటిపై
కన్నీరు
ఎవరు చూస్తారులే
..

కీటకాల కాలం ఏమిటో
వాటి అరుపులు, నావి
ఎపుడు ఒక్కటవుతాయో
..

చరిత్రలేని చరిత్రకి
చరిత్రలేని మనుషలకే
చరిత్ర సుదీర్ఘంగా
..

ఏ కాయితపు బెజ్జంలోంచో
అక్షరాలు మాటలై పడిపోతాయి
వాటికై ఆకాశంలో యెక్కడని వెతకను
..

చలి చంద్రుడు
వెచ్చటి సూర్యుడికై
రాత్రంతా కలియతిరుగుతూ
..

కొండల పైన
కొండల కింద మనుషులే కానీ
మనిషిలో ఏ కొండ లేదు
..

సీతాకోక చిలుకా!
నీ నగ్నత్వాన్ని ఎవరికి చూపించావో చెప్పు
వారికి ప్రణమిల్లుతాను

Saturday, November 20, 2010

ఎక్కడైనా

ఊపిరి లేని పదాలకై
పదాల లోపల పదాల వెతుకు

లోపలి శ్వాస
సువాసన లేని నిశ్వాస

ఎవరి ఆఖరికీ
ఉండని గాలి, గాలి

వాక్యం
వాలుతున్న పర్వతపుమొన

మేఘ
అవిశ్వాసం

కట్టకట్టుకుని అక్షరాలు యేవో
వేరే యేవో చెపుతాయి

మోకుల్లాంటి మాటలు

మాసిన పదాలతోనే
పురుడుకై వెళ్ళాలి

వాక్యం
అంతర్గత ఆత్మ హత్య

జనించే మృత్యువు
మరనేచ్చకై జీవిస్తుంది

వ్యాకరణ వాక్యాలతోనే
విషం నింపాలి

గొంతుకోసినా
ఊపిరి నీడ దక్కాలి

ఎప్పటి నిద్రలోకో
సూర్యకాంతి సాయంత్రానికి వస్తుంది

ఇంకొంత
ఈ పూట ఎక్కడైనా

ఊపిరిని వొదిలి రావాలి
ఎవరికీ తెలియనట్టు

Friday, November 12, 2010

హాఫ్లాంగ్ కవితలు

మేఘాల రవిక
ఈ నీలి కొండలపై.
ఆకాశం తొంగిచూస్తోంది

--
చంద్రుడి అడవిలో
దారులన్నీ జలపాతాలే.
ఒంటరి చీకటికి దారి ఏది.

--
ముఖాలు లేని మేఘాలు
ఎక్కడున్నా దీవిస్తాయి
అర్హత ఎవరికి కావాలి?

--
కొండల్ని, స్త్రీలని
ఎల్లప్పుడూ ప్రేమిస్తేనే
సూర్య విశ్రాంతి

--
నిశ్శబ్దం
సముద్రాలకి, కొండలకి తెలిసినట్టు
స్త్రీకే ఎందుకు తెలియదు

--
పగటి మేఘాల్ని చూసి
రాత్రి మేఘాలు ఎన్నడు
చలించాలిలే

--
జ్ఞాపకాలు
కన్నీళ్ళపై మిగిలిన
నేత్రాలు

Wednesday, November 10, 2010

ఆమె గొంతులో

ఇపుడు వొచ్చిన
రాత్రిని ఎలా పోమ్మనాలో
ఆకాశంతో ఏ కలా చెప్పదు

మనం చెప్పుకుంటున్నవన్నీ
అద్దం లోపలి మాటలే

ఏ కడలి చాయో
గాలి చలికి వణుకుతుంది

నా కన్నీళ్ల ఇంట్లో లేదు నిద్ర
నిద్ర పెదవుల్లో సూర్యాస్తమయాలు లేవు

కలలకి కళ్ళు దూరమే ...

ఆమె గొంతులో
ఓ చిన్న రాత్రి ఉదయిస్తోంది

మళ్లీ బతుకుతాను
ఈ రాత్రిలో

Monday, November 08, 2010

నీ రాత్రి నీకు

ఎన్నో సాయంత్రాలు సూర్యుడికి

ఏ ఒక్క సాయంత్రమో నీ దగ్గర

పలకలేని మాటల నిశ్శబ్దంలో ఆకాశం

మేఘాలే కొండలపై , కొండల కాళ్ళపై పడి అలిగి వెళుతున్నాయి

ఎప్పటికైనా ఒక నదిని దాటి వెళ్ళే చంద్రుడ్ని చూడాలి

చిక్కిపోయో చిక్కుకుపోయో ఉండే ముఖం చూడాలి

ఆగాలేమో

లేచివుల్ల ముత్యపు చినుకుల పర్వతాల్ని చూడాలంటే

నీటి విరూపాల్ని దాటే ద్వారాల్ని తాకాలంటే

రహస్య పదాల మౌనంలో సంభాషించాలంటే

ఎక్కడా ఇటువంటి సాయంత్రాలని కోరుకోకు

ఎక్కడైనా నీ సాయంత్రాలు నీకై ఉంటే

నీ ప్రేమల్ని కాస్తంత గురుతు చేసుకో

నీ జ్ఞాపకాల్ని కాస్తంత ప్రేమగా గురుతు చేసుకో

నీ గడిచిన దినాల్ని మరీ ఇబ్బంది పెట్టకు

అవి ఎవరికీ చెంది వుండవు

ఏ సాయంత్రమో

నీ దగ్గర

ఒక అనామక రాత్రి నీకు తోడువుంటే

నీ

రాత్రి నీకు ఉన్నట్టు

కాదూ

ప్రేమకి

రాత్రులతో పని ఏమిటి

కొన్ని సూర్యోదయాలు

మరికొన్ని సాయంత్రాలు కావాలి

Wednesday, October 27, 2010

సమాప్తం ఒక స్థలం ,,,అనుకుని అనుకోని అవతలి తల తలరాతలో తడి ఏదీ దగ్గరకు రాక,,, ఒక స్థలం సమీపించింది


ఆఖరి నేత్రాన్ని రక్తపుగనులు తవ్వినట్టు వెలికితీసి తాకని వాటి గురించి ఆలోచించాలి, ఏమీ ఎరగనట్టు, ఏదీ చేజారనట్టు, మాటల మౌనం నలిగినట్టు, ఏదో పలికినట్టు, ఆ నీటిని పట్టుకునే ఫట్మని మిగలాలి, పట్టుమరి, పట్టుమని ఎవరికీ యావజ్జీవ బతుకు లేదు మరి.

ఎదకి ఎడమైనా, ఎడారి ఆకాశ స్నానంలో, ఏ స్నానమూ తిరిగిరాని మబ్బులతో తిరిగి, చూస్తున్నవన్నీ ఆగినట్టు, ఆపినట్టు ఉంటుంటే, ఊపిరి కొస తెగిన చప్పుడు తెలి
యనట్టు నిద్రిస్తుంటే, ఎప్పటికీ ఏ ఆనందమూ రాని శోక స్థూపాలపై పాకే పూల తీగల్ని చూసి, మైమరుపో, మరుపో ఉంటునట్టు ఉండే మౌన ధిఖ్ఖారాల ఓదార్పు దుఖమై, ఎవరి శూన్య స్థలంలోనో సంచరిస్తుంటే, లేనివేవో లభిస్తుంటే, వృత్త విమోచనాలు వాపసు తీసుకుంటే, ప్రతి నమ్మకం ఒక స్థిర అబద్ధమే.


వణుకుతున్న గడియారపు ముళ్ళపై నడవలేకే, ఎటూ పోలేకే, దిగమింగుకునే శ్వాసల్ని దింపుకుంటునట్టు దోబూచులాడాలి. సెలవులు పెట్టకుండా.

Friday, October 22, 2010

ఏదో,,,

ఏదో
ఓ రాత్రిని దూరం చేసి
నీకూ లేని రాత్రితో
కొండల మధ్య
దైహిక సూర్యాస్తమయాల
మేఘాల స్వప్నంలో ఎవరూ లేరు

వర్షం కింద మేఘాలు
వేగం లేని బుర్ర బురద
ప్రవహించే ఇంద్రియ ముద్రలు

స్త్రీ లేని (ప్రదేశంలో ఉన్నప్పుడు )
రహస్యం ఎక్కడో ఉంటుంది

బాష రాని శూన్యం
శూన్య శోకం

మత్తులో లేని
మాటలే మిగులుతాయి

నిద్రపోయే కొండల ఊపిరిలో
మేల్కోవాలి

ఆఖరి నిద్ర కింద
ఎవరూ లేరు

Sunday, October 17, 2010

హాఫ్లాంగ్ కవితలు

ఒంటరి సీతాకోకచిలుక
రాత్రి -
రెండు నిద్రలు కలలో
_____

ఆమె గొంతులో
ఆమే లేని ఆమె
_____

అద్దం కింద అద్దంలో
స్వప్న ముఖాలు
ప్రేమించే కాలం
_____

మేఘాలు, వక్షోజాలు
అధరాలలో
చాయా శిల్పాలు
_____

కొండల దారి
ఆకలి వాన
తడవని నేల
_____

ఒంటరి గది
నేను లేను
రాత్రే వేరు
_____

పువ్వులు
మబ్బుల్ని పిలిచాయి
ప్రేమతో

Monday, September 27, 2010

అద్దం ,అద్దంలో చూసి

ఏమీ లేని ,అక్షరాలు లేని ,వాక్యాల లోపల ,పదాల జ్ఞాపకమో ,మాటల దుఃఖమో ,నలుపుకుంటూ నల్లటి లేత నలుపు అద్దం ,అద్దంలో చూసి ,తేలికైన తడబాటు తారట్లాట తృప్తికి ,తనువుకీ తట్టని తలరాత తారతమ్యాల తలపోతల తరుణంలో ,ఋణ మరణం ,తలవంపుల వంపుల విఫల శ్వాసల ఛాయలో ,ఆపై ,ఆపే ,ఆగే ,ఆకృతి అంతంలో ,అంతిమ ఉయ్యాల ,ఆమనికీ ,భూమికీ ,ఆఖరి నిశ్శబ్దం ,తనకే ,తనదే ,అని ,అందరికీ ,చెప్పుతూ ,చాటుతూ ,దాటుతూ ,దాటవేసే దారులు ,ఎవరెవరివో ,ఏమీ ఉంచుకోని అలల తలలా ,తపనల కడలికి ,కదలికలకి ,కలవని కన్నీటి కళ్ళతో ,కనికరం లేని కావలి కళ్లకి ,కలైనా రాని కలలో ,ఏదీ ,ఏదీ ,కనిపించని ,ఏమీ లేని బరువు అక్షరాలు ,బలహీనమైనవి.

Thursday, September 16, 2010

ప్రేమతో

దూరం దొరకదు
దొరికే దగ్గరతనమూ దొరకదు
పద దూరమవుదాం
పదాలు దూరమైతే
నశ్వర సుఖాలు
అవసరం
అనవసరం
ఆందోళనలే వాక్యాలు
వాక్యాలే ఆందోళనలు

"writing is the opposite of working" - georges bataille

పసి రోదనే దూరం
దూరమవ్వాలి ఏదీ దగ్గరగా లేనపుడు
ప్రేమతో

మరొకరిలోకి

బయలుదేరాలి
ఒకరి నుంచి మరొకరికి
మరొకరి ఒకరిలోకి

చేరని విరామ దుఃఖమే
కొత్త లోకపు పునాది

మాటలు మాటలలోకి
ఇంకే మాటల సాన్నిహిత్యం

తెరవని వాక్యం కింద లేరెవరూ )( పరితపించే పదాల మధ్య మిగలరెవరూ)( రక్తపు నీటిలో ఈదుతుండే అక్షరాలని ఆపేదెవరు)

(వెనక్కి నడిచే చీమలు)( విత్తనాల్నితగులపెట్టే కళ్ళు )

( అండ త్రిభుజాలు)( సామూహిక వాంతులు)

( నిద్రించే దేవాలయాలు)
( దేవులాడే దాహార్తి)

విస్తరించు నర్తించు నటించు(

)మూసిన వాక్యంలోకే ప్రవేశించాలి)( ఆరబెట్టిన పదాల్ని వెంటేసుకుని

మరొకరిలోకి
ఒకరెవరో నిష్క్రమించాలి

Tuesday, September 14, 2010

వెతుక్కోవాలి

మురికి కంటితో

చేతులు కలిపాను

కలిసాను దురద పెట్టే అన్నింటితో


గొంతులోకి తొంగిచూసి

ఊపిరిని ఎగదోసి

పెదాలపై నడిచి

నన్నొదలటం లేదు

నకిలీ మాటలతో

నకిలీ నాలుకతో

నిన్నటిలోకి నెట్టింది


రేపటికి చూపుని వెతుక్కోవాలి


Monday, September 13, 2010

రాయాలి

నాలుకకి ఓదార్పు కావాలి

కాలాన్ని నాలుకతో వృధా చేయాలి

నలుగురు చేరని నాలుకతో జీవించాలి

కన్నీళ్లు రాని ఒక కన్నైనా ఉండాలి

కళ్ళు లేని మనసు పుట్టాలి

మెదడులో ఎండిన విషరక్తచారికల వాసన

నిద్ర చర్మాన్ని వొలుచుకుని తింటున్నారు

రంధ్రాల పడ్డ అక్షరాల్ని నేయాలి

మాటల బొమ్మలులేని వాక్యాల్ని రాయాలి

చెరిపేయాలి నిజాల్ని వల్లించే పదాల్ని

మరునాడు లేని రోజులో ఉండాలి

సెలవు చెప్పని కలల్ని వెంటబెట్టుకోవాలి

అనునిత్యం మరిచిపోయే జ్ఞాపకాల వెంటపడాలి

గోతులు గోడలు గోడు చెప్పే మాటలు
నదులు సముద్రాలు నీతులు చెప్పే మాటలు
చేపలు పిట్టలు చెప్పే మాటలు

రాసుకోవాలి
రాయాలి

Sunday, September 12, 2010

ఖాళీ లేని శూన్యం

నా బయట కొన్ని అచిత్రాక్షరాలు

నీ
లోపల మరికొన్ని అక్షర చిత్రాలు

ఎవరి
సంకేతాలు ఎవరికి చేరతాయి

చేరని
సంఘటనలు ఎవరివి

ఎవరెవరి
కోసం

సంజ్ఞల నిశ్శబ్ద స్పర్శ

స్పర్శల
సంకేత నిశ్శబ్దం

ఎవరిని వెతుకుతుంది

యధాతథ
యథార్థాల్లో యాత్రించే

యముని
యశస్సు యెంత

ప్రతిదీ
ఒకానొక చిత్ర వ్యక్తీకరణ

అవ్యక్త
చిత్ర పదాల్లో నిజమెంత

పదాల
అనుభవంలో నిజం ఉందా

లిపిలేని ఆలోచనలనే అనుభవిస్తున్నామా

ముడిపడని
ముడివిడవని మాటల అనుభవం ఏమిటి

ఖాళీ లేని శూన్యం

ప్రవేశించే
పదాల ఖాళీలో అనుభూతి యెంత

తిరిగి
పలకని కల

Thursday, September 09, 2010

మసక మాటలు

అందరి పాదాల ముందు మసక మాటలు రాలి వాలిన నెలవంక వంక చూసే చూడనట్టు నటించిన సూర్యుడి ముడతల కంటిలో ఇరుక్కోవాలనుకున్న ఉడత మడత తోక తొడతో కోసుకుపోయిన చంద్రుడి ఊడల నవ్వులకేసి ఊగుతూ ఉంటే వాసనేస్తున్న వాన పదాల దారాల్ని తుంచుతూ వొంచుతూ లాగుతూ తాబేటి మెడ కింద దాగిన సముద్రపు నక్షత్రాలు నగ్నశాంతిని తాగుతూ ఉంటుండగా పూసిన ఈకలతో కాయితాలపై ఎగురుతున్న చెవుల వంతెనల కింద కొట్టుకొస్త్తున్న కుట్టుకొస్తున్న కన్నీటి చిరుగుల బొమికల రెక్కల్ని జాగ్రత్త చేస్తూ వాచిన వాచీ సమయం తేలుతూ పైకి లేస్తుంటే కారుతున్న జ్ఞాపకాల వడపోతలోంచి వొడలిరిగిన వోటమి జీవితాన్ని వొదలక ముగింపు లేక అక్కడక్కడ కవిత్వపు నక్కల నకలు వాక్యాలతో నిద్రిస్తుంటే జారుతున్న చీకటి దేహ ఖైదీనై మరణించు మరణించు మరణించు అని ఆదేశించే ఆత్మని తన్నకుండా విడిచిపెట్టేలోపే ఎక్కడ్నుంచో మనల్ని చంపే గాలిలో జెరాక్స్ చావులు యెగిరి వొస్తుంటే ఆసుపత్రి ఆకలిగా ఆవులిస్తోంది మర్చిపోయిన అక్షరాల్ని మగత గతంలో నెమరేసుకుంటూ దవడల వొదులు వొదులు పదాల్ని నల్లగా చప్పరిస్తూ చెట్లపై ఊగుతున్న చంద్రుడ్ని చూస్తున్న కలువలన్నీ ఏదీ వినటం లేదు ఆఖరి రంగు ఏదో చూడటం మానుకున్నాయి అప్పటికే అప్పటి పాదాల కింద ఏ ముసలి రూపం అద్దంలో నడిచిందో ఎవరూ చెప్పలేదు చెప్పరెవరూ మరణమూ ఒక జీవితమే అని అనుకోకుండా ఉండాలేమో తల్లీ నదిలో అందరి పాదాలు మసక మసకగా మునకలేస్తూ అడుగుజాడలు లేకుండా వర్షంలో వర్షం తెగుతూ ఎగురుతూ మిగలని చీకటిలో వణుకుతూ...

Sunday, September 05, 2010

కంటిలో కన్ను

అస్థిర నేత్రం \\ ఆవిరయ్యే నిశ్శబ్దం \\ నకలు లేని చావు \\ ఆటు పోటుల దుఃఖం \\ చల్లటి మౌనం \\ చావుకి చందాలు \\ పేగులో ఆకాశం \\ గాలి గట్టిపడింది \\ నిద్ర చనిపోయింది \\ అపవిత్ర జ్ఞాపకం \\ వాసనేస్తోంది \\ వినాలి \\ అస్తమించే కాలాన్ని \\ చినుకులు \\ ఏ రాత్రీ లేని రాత్రి \\ ఒక ఒంటరి లోచూపు, శూన్య స్తనం \\ పసి సూర్యుడు \\ కంటిలో కన్ను \\ మిగిలింది \\ ఎంగిలి చావు \\ తప్పదు \\ మోసిన కన్ను \\ మూసిన ముక్కు \\ మరువని మవునం \\ తండ్రీ \\ నీ సమక్షం లేని లోటు \\ నువ్వే ఏర్పరిచిన వెలితి \\ ఎలా \\ ఎలా \\ ఎలా భరించాలో చెప్పీ చెప్పక \\ అర్థమయ్యీ అర్థమవ్వక \\ ఇబ్బంది పడుతున్నా

Saturday, August 28, 2010

కాలం || కాయం

ముడుచుకుపోతున్న పదాల శరీరం || వివరించని ఆంతరంగిక జిహ్వ || అనాధ వాక్యాల్లో విరక్తి విషం ||కాటికాపరి ఎదురుచూపు || ఆశల నిషా || శాప శాంతి || నిరాకార దహనారంభం || నవ్వే చీకటి || కన్నీటిపై ఎగిరే సీతాకోకచిలుక || సముద్రపు నీడ || మూత్రపిండాల గాలి || వల || స్పర్శ సర్ప సూర్యుడు || వెన్నెముక విత్తనాలు || ఉత్తుత్తి ఊపిరి ఉయ్యాల || బంధించే బాధలు || కలల రాకపోకలు || తెగవు || ఆఖరి ఆలస్యం || ఊహించని అహింస || నీడల్ని వింటున్న నీడలు || అక్షరాలు ఏ వైపు అడుగులేసాయో || వాక్య శ్వాస చెప్పదు || ప్రేమించే అంధకార స్పర్శ || స్మశాన గర్భం || రహస్య స్వర్గం || అపూర్ణ వలయం || అసంపూర్ణ మరణం || మనసు మూత్రం || కల నాలుక || వడలిపోయిన కుబుసం || కరుగుతున్న అద్దం || రక్తంలేని శ్వాస || మాట్లాడని మనుషుల మాటలు || నాచు పట్టిన గాలి || ఒక్కసారే || ఎముకల కలలో భగవంతుడు || చోటులేదు || వర్షంపై వర్షం || రాత్రి వొదిలిన చీకటి || అర్థరాత్రని తెలియని చావు || మూట || నవ్వని కనుపాప || ఓదార్పు || హస్త ప్రయోగం || యోగ యోని || యోచన || నిశ్శబ్ద నిరాలోచన || ఎండుతున్న కన్ను || గాయం || కాలం || కాయం || మాయం || అపవిత్ర మిత్ర చిత్ర మౌన పదం || మృత్యువు || కాలంలోనే ఉంటూ కాలం చేయాలి || కలకాలం || తల్లిదండ్రుల భాష పోతోంది || ఈ-చర్మం కుట్టుకోవాలి || కట్టూబొట్టూ తిరగేసి కట్టాలి || వైరాగ్య అవిశ్రాంతి || సమాధి || మెదడులో ఉమ్మనీరు || తర్ఫీదు పొందని నిద్ర || జవాబులు || నగ్నాస్థికలు || కూరుకుపోతున్ననల్లటి జ్ఞాపకాలు || తేలని తెలుపు తప్పులు || బతికిలేని వాక్యాల్లో శరీరం || గోడలు లేని శవం || మళ్లీ ఎదురుపడలేము నాన్నా...

Friday, August 13, 2010

ఆఖరి అడుగులు

పిట్టల మాటలతో
చినుకుల చిందులతో
ఇంద్రధనువు ఎగురుతోంది

కంటిలోని నిద్రతో
కలలోని కన్నీళ్ళతో
చేపొకటి తప్పిపోతోంది

కలల కప్ప గెంతుతూ
బాతు మెడని తొలుస్తూ
రాత్రేదో సూర్యుని ముందు

కెరటాలు లేని సమయం
పడవలు మునిగిన ఆకాశం
చల్లటి నిశ్శబ్దం

పాదముద్రలు లేని
శ్వాస అధరాలు
ఆఖరి అడుగులు వేస్తున్నాయి

Tuesday, August 10, 2010

గాలి అద్దం

ఒకానొక అతడి సాయంత్రంలో
అతడ్ని సూర్యుడు వెంబడించాడు

ఒకానొక అతడ్ని వెంబడించే
సూర్యుడు సాయంత్రమయ్యాడు

ఎవరికో చెందిన అతడు
సాయంత్రాన్ని సూర్యుడ్ని
కలిపి కుట్టలేక ఒకానొక అద్దంలో నిష్క్రమించాడు

ఎవరికీ చెందని అతడు

సూర్యుడి సాయంత్రాన్నివెంబడిస్తుంటే
ఎప్పటికీ లేని రాత్రేదో భూమిలో తిరుగుతోంది

అతడు తిరిగిన భూమి ఎవరిదో
ఎవరి రాత్రిలో అతడు ఉన్నాడో
ఒకానొక అద్దమైనా చెప్పదు

ఎవరికీ ఏదీ చెప్పని ఒకానొక రాత్రి

అతడ్ని వెంబడించేలోగా
గాలి అద్దం వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుంటోంది

ఎవరికీ చెందని ఒకానొక గాలే

అతడ్నీ వెంబడిస్తోంది
చిట్టచివరి నీడ కోసం