Followers

Friday, July 29, 2011

ఈ చోటైన

మట్టి ఆకాశంలో
రెప్పల్లేని నక్షత్ర కెరటం
తొంగి చూసింది

ఎవర్నో కాదు
నన్నూనూ కాదు
నిన్నేనూ కాదు
దారుండని దేహశృతి
మేఘశాంతి తీరిన నాభి

ఇక్కడి బలహీన సూర్యుడే
నిన్నటి కాంతి మాంత్రికుడు

ప్రేమ ఎందుకు లేదో
ప్రేమకు చెప్పు
ఈ చోటైన

అందుకోవాలి

ఎక్కడికి చేరాయో
గాలి ముత్యాలు

ఇంతలో-
నదిలోకి తొంగిచూసే మేఘపుష్పాల్ని
అందుకోవాలి

ఆకాశంలోకి తొంగిచూసే హరివిల్లు పెదవిని
అందుకోవాలి

కొండల్లోకి తొంగిచూసే చందమామ సిగ్గుని
అందుకోవాలి

తోటలోకి తొంగిచూసే సీతాకోకల పరిమళాల్ని
అందుకోవాలి

ఆమెకి చెప్పలేదు
ఇవాళ అందుకోవాల్సినివి ఎన్నో ఉన్నాయని

ఆమెకి చెప్పేవి
ఇవాళ ఎన్నున్నా చెప్పకపోతేనే నయం

గాలి ముత్యాలు
ఎక్కడో చేరాయి

Wednesday, July 27, 2011

కన్నొక hauntology

అతనికీ తెలుసు
రాత్రి లేదని
దేహాలు నీటి పూల నవ్వని

ఆకాశం, అక్షరాలు తిరగబడ్డాయి అనర్ధంలో
అవో పిశాచాలు యోని నేత్రంతో

అతనికీ తెలుసు
ఊరేగే కలలు
చనిపోయే మంచు బిందువుల శిలలని

ఇది చూసే సమయం కాదు

ప్రతి చూపు
ఒక దేహమే
మరణం
ఒక చూపంత
ప్రేమ
ఒక మరణమంత
పిలవాలి
ఒకానొక చూపుని
వినాలి
ఒకానొక శూన్య నేత్ర ధ్వనిని
రుచిలేదు
ప్రతి చూపుకీ

Wednesday, July 20, 2011

ఎవరికీ ఉండనిది

పిల్లలు
ప్రేమ
లేకుండా
ఉండాలి

స్త్రీ ఓ నలుపు సూర్యుడు
తెల్లటి మరుపు

లేదు
నాశనం
మృత్యువులో


స్నేహఊహే
ఓ మనసు

దేహం
ఎప్పటిదో
ఎవరికీ ఉండనిది

నీ నా పిల్లలు ఎక్కడ

ఎపుడు చూసానులే

Monday, July 11, 2011

అలా వొంగి వొంగి

అలల రొమ్ములు
పీత చంద్రుడు
ఆగి వెళ్తుంటాయి చూస్తుంటే కదులుతుంటే
నిస్సిగ్గు సూర్యుడు అస్తమించేలోపే నీలో నక్షత్ర జిహ్వ
తాకకుండానే తాగకుండానే తరలిపోకుండానే

వినని

అనని
అవని
ఆవని

రంగులే

పొంగులే
తరలిన రుచి

మౌనాలు

శరీరాలు
ఈప్సితాలు
నక్షత్రాలు
అలా వొంగి వొంగి బయల్దేరాయి
చూస్తుంటే కదలకుంటే

సిగ్గులేని ఆకాశం కనిపించేలోపు

ఓ నీటి సూర్యుడు
మింగకుండానే మరచిపోకుండానే చనిపోకుండానే

Sunday, July 10, 2011

వణుకు

మహాప్రభో!

చూపు మందగించి

సూదిలోకి దారపు మాటల్ని
ఇటునుంచి అటు ఎక్కించలేక
పదాల్ని గుచ్చలేక

ఈ పూట కూడా నీకు విడి విడి

అక్షరాలతోనే నిన్ను అలంకరిస్తాను

బుద్ధి మందగించేలోపు

ఓ చిన్న దండైనా
నీకు అర్పించే శక్తినివ్వు

Monday, July 04, 2011

నీతో ఉండలేను

అలసటతో
అల ఒడ్డుకి చేరలేక
అలలమధ్యలో తేలుతోంది

ప్రతిసారీ
ఈ మురికి తీరాన్ని తాకి మళ్లీ
మళ్లీ వెనెక్కే ఎందుకెళ్లాలి

ఏ చేపా నాతో స్నేహం చేయదే
ఏ పాపం చేసాను స్సముద్రమా!

సెలవు
కావాలి

Saturday, July 02, 2011

నేత్ర గుహలోకి

సముద్రం
ఒక ముదర ముద్ర
ఒక కుదరని ఊపిరి

నీరే
నీటి నోటిలోకి
నేత్ర గుహలోకి

ఏ దారిలోనో ఎడారి
ఎదురుపడితేనే జీవించే క్షణం

ఎడమయ్యే జీవితంలో మరణమే
బతికించే క్షణం

మృగాలు
మాటలు

గాలే లేని మాటలు గోడమీదకి
బతుకుమీదకి మట్టిలోకి

పాకుడు పాకుడు పదాలమీదే

నాలుకైనా నడకైనా

దారంలో దారం కన్ను

తెగ్గోసుకునే క్షణం
నీకు తెలిస్తే
సముద్రానికీ చేప్పే

Wednesday, June 29, 2011

తినాలని

తనొంటిమీదున్న సూర్యుడ్ని
సూర్యుడు కిందకి దింపితే
చంద్రుడి కిందున్న సూర్యుడ్ని

చంద్రుడే తినాలని తనొంటినోరుని విప్పింది

Wednesday, June 22, 2011

ఎలా మలినమైందో నాకెందుకు

ఒక దీపం పిలిచింది
తనని
శుభ్రం చేయమని

నీ చేతులతో కాదు
కళ్ళతో
నా
నల్లటి కాంతిని పరిశుభ్రంగా

చూస్తున్న దీపంలో దీపం ఎక్కడుంది
ఎలా మలినమైందో నాకెందుకు
ఎలా అందంగా తుడవాలో
ఈ కళ్లకి ఎప్పటికి చెప్పగలను

ముందు
ఈ కళ్ళనే శుభ్రం చేయాలి

Tuesday, June 21, 2011

దారి

ఇక్కడికి
దారి దారి తప్పి రాలేదు
దారి దారీ లేక ఒచ్చాను

దూరం ఒక నిశ్శబ్ద నిశ్శబ్ద దర్పణం
అద్దంపై అద్దపు రోజులు లేవు

నిద్రించే నిద్ర నిద్ర దూరం ఎవరికి తెలుసు
తేలుతున్ననేల నేలలోకి వెళ్ళాలి

నీటి బొమికలు నిద్రలేచేలోగా
నేల గాలి గాలిలోకి ప్రయాణించాలి

తోటలోకి
స్మశాన తోటలోకి
సముద్ర వనంలోకి
దారి
దారి కావాలి.

దరికి చేరే దూరం
ఏ అలకి అలకి తెలుసు

నీ చేతిలోకి
ఏ చేతుల్నీ తీసుకోకు
ఆఖరికి నీ చేతుల్నీ

Thursday, June 09, 2011

రాత్రిని రాత్రి చేయటానికి

ఎవరికో
నా నీడని చూపాలి
విప్పేసిన ఉప్పటి వెలుతురుతో
~
ఎవరికీ
నీడనివ్వని యంత్రాలు
శ్వాస ఋతువుల్లోకి
~
ఎవరెవరికో
అనిశ్చిత జ్ఞాపకాలే రావని
నా దేహాన్నీ మర్చిపోయాను
~
ఏ పురాతన విగ్రహమో
నన్ను చూస్తున్న కంటిని విప్పాలనుకుంది
కన్నొక నాలుక
~
నకిలీ పిర్రల్తో
దేకుతూ వచ్చే మాటల్లో
తోలు బొమ్మల చంద్రుడు
~
ఎవర్నీ చూడని సూర్యుడు
చీకటిని తింటూ
తింటున్న ప్రశ్నలు
~
ఎవరు ఎవరు ఎవరు
స్మశాన సన్మాన ప్రేమలో
నా రాత్రిని రాత్రి చేయటానికి

Wednesday, June 08, 2011

గాలి కాయితంలో

ఒక గాలి నిండిన కాయితాన్ని చించు
చించిన పదాలు కింద పడొచ్చు

చిరిగి పడిన పదాల్లోకి నీ కళ్ళని పంపు
వెతికే వెలితీ, వెలితిని కనుక్కునే వెలితీ కనిపించొచ్చు

మాట్లాడు కాయితపు నాలుకతో
పూర్తవ్వని అక్షరాలు పూర్తయ్యే అనాకార అక్కరాలు

అదే చీకటి మౌనం
అదే మౌన నిశీధి

చెవుల్ని ఎడంగా పెట్టు
కన్నీళ్ళనీ ఎడంగా పెట్టు

గాలిలేని గాలి కాయితాన్ని తీసుకో
నీ పదాలతో నింపు, చింపు

ఏమి చూసావో రాయి
నీ గాలి కాయితంలో

Friday, June 03, 2011

వింత విషం

నీ చర్మం
చీకటిగా తడుస్తోంది
ఆవిరయ్యే ఆయువు
ఆగిపోయే చీకటి

నా చర్మం
తుడిచిన అక్షరం
పద మోసం
ఆరిన వాక్య కెరటం

మన చర్మం
వానలో పుట్టిన పరిమళం
పరవశించిన వయసు
కంటిరెప్పల సువాసన

నీటి పాదాలు
నా కన్నీళ్లు

వింత విషం
కాలం


Wednesday, June 01, 2011

.................తెల్లారదు

.................తెల్లారదు. ఎన్నిసార్లు నిద్రించాలి ఒక ఆఖరి రాత్రిలోనే. రాత్రాంతంలోకి రాద్ధాంతం చేస్తూ వచ్చే నల్లటి గాలి మెడని వొదిలి వొచ్చేసే గడ్డిపరకలకి ఎవరు చెపుతారు ఆకాశం అభావమని. నా ముఖం నా చుట్టూ తిరిగేస్తుంటే, స్వదేహ వలసకై ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటావు. నీ పాములు నీలో యెగిరి నీ కళ్ళల్లోంచి బైటికి అసలు వొస్తాయా. తెల్లారే ఆరే తెల్లటి ఎముకల్ని యేరుకోవాలి. ఏటిలోకీ ఎగిరించాలి. ప్రవహించాలి. నీ ముఖం నీ ముఖమయ్యేలోపే, కొట్టుకుపోవాలి, కొరుక్కుతినేసే కోతి హృదయంలో పురుగులు చేరాలి. రిహార్సలు చేయాలి చనిపోవాలంటే. గమనించు నీ ఆఖరి తేదీ ఏదో. ఎవర్నీ కనుక్కోకు. నీ భగవంతుడి వొంట్లో నిద్రపోయే నీ కన్నుల కన్నీళ్ళనీ అడగకు. నువ్వు దాచిపెట్టిన నీ వీధి ఏదో, ఏ తడిలేని మబ్బుకు చెపుతావు. పువ్వులోకి పాకే పువ్వులు, డబ్బుల్లోకి పాకే డబ్బులు, డోకుల్లోకి పాకే డోకులు, తిరస్కృతుల నేలలోకి పాకే తిరస్కృతులు. తెల్లారదు.......................

Tuesday, May 31, 2011

ఎవర్నీ పిలవకు

ఏదీ........
నీ నిశ్శబ్దాన్ని వినిపించు

నీ నీడల్నీ మోసే
సూర్యుడ్ని చూపించు

నీ పదాల్లో దాగున్న
అక్షరాల్ని అలిఖించు

నీ నగ్న వాయువులో
పుష్పించే వృద్ధాప్యం

నీ సరికొత్త సమాధిలోకి
ఎవర్నీ పిలవకు

ఎవరి జ్ఞాపకాల్లోనో
బీటలేసిన నీ అద్దం

సజీవ స్వప్నాల్లోకి
నీ దారి నీకుందా

Saturday, May 28, 2011

అహృది......

ఆనందం, అనాకృతి, అశాంతి, అలజడి, ఆక్రందన, అహృది......
దగ్గరయ్యే తొడల చీకటి మధ్యలో
ప్రసవించలేని ఓ విరామ విన్నపం
స్మరించే ఫలం, దేహామృతం
మృత్యువు

ఈ యెర్ర ఎరని తినే నిద్రే చెప్పాలి
సంస్కార వియోగం

వాక్యం కింద సమాధి
సమాధి కింద వాక్యం

నిన్నటి కలలో పాచి ప్రేమికులు

దాగుడుమూతల
దాగుడుమూతుల కన్నీటి పదాలు

వాసనలు మనసులో

Friday, May 27, 2011

నీ నేత్రం నీదేనా

ప్రతి వాసనొక పశ్చాతాపమే
నిరాటంక సమయంలో

ఏ నేత్రం ఎవరిదో
ఎవరికి తెలుసు

ఆగు
ఆగు ...అని పిలిచే మురికి కన్నీటిని
నలుదిక్కుల్లోంచి మోసుకొచ్చే మాటలే
బరువు నాలుకలోనూ

కదలని వాక్యమే సమాధి

కాలమానాల్లేని స్మశానం
ఎవరి దేహంలోనూ ఉండదు

కాస్త విడిపోవటానికే
శవపేటిక భాష

పేగుపోగుల్లో మంటలు
బతికుండే అంత్యక్రియలు

ఏ జ్ఞాపక స్థలంలోనో
సూర్యచంద్రులు

గుమికూడిన గుబుల్ని భుజాన్నెత్తుకుని
ఏ ఆకాశ తీరంలోకో నడవాలి

పొట్టి వీధులు

చీకటినీ చూస్తాను
ఈ మాటలతో
అలసిపోయే చీకటితో

మరొక వాక్యం
కింద
మరొక చీకటి

ఒక నిశ్శబ్దం భయపెడుతోంది
కొంత పొడవుగా

పొట్టి వీధులు
ఆకాశంలో

పంటికింద చీకటిని
వెతికే
కళ్ళు కావాలి

Wednesday, May 25, 2011

పీతకళ్ళతో

నీ నీడని విప్పు
ఐనా నీకు నువ్వు దూరం

మెరుస్తున్న అద్దపు డేరాల్లోంచి
పీతకళ్ళతో తిరుగు

ఏ దుఃఖమూ లేని అలలే
తీరాన్ని తాకుతాయి

నీ నిశ్శబ్దం నీ పడవ

నీ దేహాన్ని విప్పు
ఐనా నువ్వే దూరం నీకు