దూకాలి నిశ్శబ్దంలోకి
నిశ్శబ్దంగానే దూకాలి
ఏ జాడలూ లేకుండా
ఎప్పటి నేత్ర చిత్రకారుడో
రంగుల్ని కలుపుతుంటే
అవి కళ్లపై ఉండట్లేదు
గీసి చేసిన ఏ చిత్రమూ నిలవట్లేదు
ఓ సొంత సూర్యోదయం ప్రతి వస్తువులో
ఓ వింత మరణతేజం ప్రతి ప్రాణిలో
జ్ఞాపకాలు ఏ వర్ణంలో ఉంటాయి
కాలమే వర్ణరహితమైతే అపుడే రంగు అది
ఈ రంగుల్ని ఎవరు వింటారు
వింటున్న రంగుల్ని ఎవరు చూస్తారు
ప్రతీదీ
చూడబడేది చూడబడనిదేనా
చూడనిచ్చే చూసే చూపే లేకపోతే
జ్ఞాపకాలు ఎవరి నోటి రంగుల్లో ఉంటాయి
ఖాళీ అయ్యే ప్రదేశం ఏ రంగులో ఖాళీ అవుతోంది
వినిపించే ఖాళీ ఈ రంగులో ఎక్కడ
5 comments:
good one!
నాయుడుగారూ.. మీ పదాల సంయోజనం గాఢమైన అనుభూతినిస్తుంది. మన అంతర్లోకంలోని మాటలకందని దు:ఖమూలాల్ని రికార్డు చెయ్యటానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది మీ కవిత్వం. ఏమి అర్ధమైందని ఎవరైనా అంటే ఏమి చెప్పాలి. కొద్దిపాటి పదాలతో, వాక్యాలతో మనం బ్రతికేస్తూ ఉంటాము. అన్నీ వాటి పరిధిలోకి రావాలని తలుస్తాము. వాటివరకూ రాని సుప్త భూమికలెన్నో మనలోపల. మనలో చాలామందికి తమ లోపలి ప్రపంచం తెలీదు. ఏ ఏకాంత సమయంలోనైనా మన లోపలి ప్రపంచం తలుపులు తడుతుంటే, జరగరానిది ఏదో జరగబోతోంది అనిపించి, మిత్రుల మధ్యకో, ఏదైనా వినోదంలోకో పరుగుపెడతాము. నేను కవిత్వం రాయటం నేర్చుకొంటున్నాను అంటూ ఉంటారు. నిజమే, అందరం ఎప్పుడూ నేర్చుకోవలసినదే. నేర్చుకోవటం ఆగిపోయినవాళ్ళు మరణిస్తారు. కాని, నేను కవిని కాదు అని మాత్రం అనకండి ఎప్పుడూ. దు:ఖజ్వాలల్ని అమాయకంగా తాకే మీ వంటి వాళ్ళు కవి కాకుంటే, ఎవరిని కవి అనాలి. మరింత గొప్పగా రాయండి. రాస్తారు. ప్రేమతో బివివి ప్రసాద్
hi subbu. after a long long time. thank you.
namaste bvvprasadgaaru. thank you sir. let me struggle to write in the form of a poem.
నాయుడూ: నువ్వు కొంచెం నెమ్మదించి రాసే వాక్యాలలో వొక రకమయిన స్థిరమయిన అస్థిరత్వం, నిబ్బరించుకోవాలన్న అసహనం వుంటుంది, చూశావా? అది నాకు ఇష్టం.
చాలా ఖాళీలున్నాయి. ఈ ఖాళీలని పూరించే పదాలు నీవి.
రాయి. ఇంకా రాయి. ఉప్పెన నీళ్ళల్లో నిలబడే రాయిలాగా రాయి. పైన, బీవీవీ రాసిన వాక్యాలలో కొండంత వెలుగు వుంది. అది చాలు. ఆ మాత్రం వెలుగు చార చాలు, ఈ దండకారణ్య సంచారానికి.
namaste afsargaaru. thank you. let me strive to write at least a poem.
Post a Comment