ఒకానొకసారి మెడపై తేలే తలలో కొన్ని ఆలోచనలు అడుగంటితే
అడుగునున్న తలతో ఆలోచనలు సంభాషించాలని పూనుకున్నాయి
ఈ తల నచ్చట్లేదు
ఈ మెడకి నాకు పడట్లేదు
ఈ ఆలోచనలు తలకెక్కట్లేదు
ఈ మాట్లాడే బుర్ర బూర ఎంతకీ పగలదు
ఏ చప్పుడూ చేయకుండానే నా చెవుల్ని కళ్ళని లొంగదీసుకుంటోంది
ఏ నాలుకుందో ఈ తలలో తెగ్గోసుకోవాలని చూస్తున్నా వీలుపడట్లేదు
ఎన్నో బానిస గొంతులతో
ఎన్నో అనుకరణలతో
మరెన్నో రుచులతో రోజూ రొంపి రొంపి చేస్తోంది ఈ తలకాయని
ఎక్కడికీ వెళ్ళదు పంపిద్దామంటే
అంటిపెట్టుకునే ఉంటోంది మెడకి అనుక్షణం
ఎలా వొదిలించుకోవాలి
ఇపుడే నీటిలో కడిగిన నీడలు
ఎండబెట్టాను ఎగిరేద్దామని
చనిపోయున్న కాగితంలో
ఏది తయారు చేసారో అది నిజమేనా
ఏది సృష్టించారో అదీ నిజమేనా
ఏది అంతరించిందో అదే నిజమా
ఏది నిజమో అది అంతరించాలా
ఇవేవీ కాదులే అని బొడ్డులేని ఆలోచనొకటి
తలతిక్క తలకి ఊరడింపు పలుకులేవో చెప్పుతుండగా...
చెప్పాపెట్టకుండా తల తలదిగి
తలతిరిగినట్టు కిందపడబోయి ఆలోచనల కళ్ళ కాళ్ళని పట్టుకోగా...
తలతిప్పి చూసిన ఆలోచనలు
కాళ్లు విదిలించుకొని పరిగెత్తాయి
తలకి దూరంగా ఆలోచనలు
ఆలోచనలకి దూరంగా తల
ఒకానొకసారి తలదాచుకుంటూ రాత్రిని తింటూ...
కలల తలలోకో
ఆలోచనల కలలోకో
2 comments:
హతవిధి! ఎంత సమస్య? సమస్యే మరి. మరీ.
hi anon. thank you for your exclamations.
Post a Comment