Blog Archive

Followers

Monday, May 23, 2011

ఎందుకని అడక్కండి

మిత్రులారా...
మీ నుంచి వెళ్లుతున్నది ఎందుకని అడక్కండి

అది దూరమవ్వనీ
అతి దగ్గరవ్వనీ
ఎక్కడికైనా బయల్దేరే చోటు లేకపోతే
తలదాచుకోటానికి మనిషీ లేని పరిసరాల్లో సంచరిస్తాను


ఇరుకిరుకు పట్టాలమధ్య పరుగెత్తుతున్న అనాలోచనలు
వేటిని మోసుకెళ్ళాలనుకున్నాయో
అంచుల్లేని తీరాల్ని తాకాలనుకున్నాయో
సూర్యరశ్మి పాదాల్ని వెంబడిన్చాలనుకున్నాయో
స్వప్న ప్రదోషాల్ని అనువదిన్చాలనుకున్నాయో
అక్షరం చెపుతుంది క్షణంలో
అంతరాంతరాల్లోంచి శ్వాస స్తంభాలు కూలిపోతుంటే

ఇక్కడ ఓటముల్లేవ్
కన్నీళ్ ల్లేవ్
అసలిక్కడ ఎవరు బతికారు

మిత్రులారా...
మీ నుంచి వెళ్లుతున్నది ఎందుకని అడక్కండి

ఆగర్భశోకితుడి లోకం కనిపిస్తోంది
చీకటి పడేలోగా చేరుకోవాలంటే
జ్ఞాపకాల సంచిని దారి మధ్యలో ప్రవహించే
శూన్య పదాల కెరటాల్లోకి గిరాటెయ్యాలి

ఇక సర్దుకోవాల్సిన సరంజామాని వెతకాలి

మిత్రులారా...
మీ నుంచి వెళ్లుతున్నది ఎందుకని అడక్కండి

No comments: