ఒప్పందాలు లేవు
కలలకి, కళ్లకి.
దృశ్యాలన్నీ
నీవీ, నావే
మురిసిపోయి
చూశాం, పలకరించాం
వేర్వేరు దారుల్ని కలిపే స్నేహం
విరబూసే నిద్రదే.
రాత్రే
ఆకాశంలో ఉండదు
ఎదురు పడవు
కలలు, కళ్లు
అదృశ్యాలయ్యే
చిత్ర ఛాయల్నే నమ్మాలి.
ప్రవహించే హైరానా జాగృత జగత్తులో
అన్నింటికీ జరామరణాల శాపాలే.
అవి ఎవరి కలలు
ఎవరి కానుకలు
కలల కబుర్లు చెప్పే
ఆ మాయావిని పారిపోకుండా పట్టుకోవాలని
ఎన్నో స్వప్న ముద్రలు
అడ్డుపడే జీవితమొక్కటే
అనువదించినా, అన్వయించినా
అంతరార్థాల చిక్కుముడుల్ని విప్పేదెవరు
ఒదిలొచ్చిన కళ్లలో
కలల కన్నీళ్లే
1 comment:
చాలా బాగుంది। ప్రత్యేకించి ఎత్తుగడ॥
Post a Comment