Blog Archive

Followers

Sunday, October 11, 2009

The Empty Leaf

పెరుగుతున్న ఆకులో
ఆలోచిస్తున్న మరణం అందదు

తీరం దాటిన ఆకులు
హృదయం దాటని ఆకులు

నిరాధార జ్ఞాపకాల్లో
మన్ను పెదాలు, ఎముకలు

మసి నిద్రలో
నువ్వే బంధించిన జ్ఞాపకం నా శ్వాస

మైకంలా
వ్యర్థమయ్యే సమయం

వెన్నెల కడుపులో
దర్పణ శోకాలు

జీవ నిక్షేపాలు
తొలి ప్రతిమల సమాధులు

తడి తడి గాలి నీడ
నేత్ర ఆయువై

చెదిరిపోతున్న చూపుల్లోంచి
నిలకడలేని మాటల్లోంచి
వొస్తున్న ఒంటరి నిశ్శబ్దం
జారిపోవాలని నిద్రపోతాను

ఎల్లలు దాటే స్పర్సలు ఎక్కడ
మమతల మైకంలో ఎవరున్నారు
భాగాహారమౌతున్న భావాల్లో భారాలెన్నో
ముంచుతున్న సొంత ఏకాంత కౌగిలి కథలు
శ్వాస వీధిలో వెలిగే నింగి పరిమళాలు ఎక్కడ
మనసు దాహాన్ని తీర్చే ఆకృతులు లేవు
కమ్ముకొచ్చే ధ్యానశోకం ఏకాకి కదూ
ఉంటూ ఉండే మసక కలలో
కలల మసకో తోడుంటూ
అనుభూతుల ఉయ్యాలనూగుతుంటే
అటే ఎగిరిపోతుంది ఉయ్యాల

ఆకుటుయ్యాలలో చంద్రుడు
నీటి ఉయ్యాలలో సూర్యుడు

ఆకాశమొక ఆకు
తెగిపడి, ఎగిరెగిరిపోయింది

కంట్లోని ఆకుల కింద
కన్నీటి గుడ్లు

అటూ ఇటూ తిరుగుతూ
చీమ ఒకటి

No comments: