కాలం కాసేపు కదలకుండా కవిత్వం అవ్వడం అంటే గాలి అద్దంలో మనల్ని చూసుకోవడం కాబోలు అనిపించేలా , ఎన్ని ఊహాలు ఎన్ని ఊసులు .
చదువరికి ఒకో పేజి తిప్పుతున్నప్పుడు ఒకో పాదం గుండా పదాల సరిగమల్లో సాహితీకరణ చెందుతున్నప్పుడు ప్రతి అనుభూతి తనదే అనిపించాలి , భవిష్యత్తు వర్తమానం కన్నా కూడా ఎదో జ్ఞాపకాల వీచికలో బలంగా కొట్టుకుపోతున్న భావనలో కాసేపు నలిగి కరగాలి . అపుడది కవిత్వం అవుతుంది ఇంకా సరిగ్గా చెప్పాలంటే గాలి అద్దం అవుతుంది .
విప్పేసిన జ్ఞాపకాలనే
తిరిగి తిరిగి తొడుక్కుని
మరణ ప్రవాహంలో ఈదుతావు
నిశ్శబ్దాన్ని నిశ్శబ్దంతో వింటూ తేలిపోతుంటావు
కవిత్వమేనా ఇదంతా కాదేమో ,కవి ఆత్మ కవితాత్మతో ముడిపడి సున్నితంగా గుండెకోత జరిపే క్షణాల అనుభవమేమో . నమ్మకం కలగలేదా అయితే
“ ఈ రాత్రినే
దాచిపెట్టు నేలవంకకి తెలియకుండా “
ఈ వాక్యంలో నిన్నోమారయిన పోగొట్టుకున్నావా నేస్తం ? లేదంటే ఇలా చూడు
“పాడుబడ్డ పదాల పేద గూటిలో
పెంచుకున్న వాక్య పక్షి ఎగరదు
దిగంతాల దుఃఖమేది అందదు .
Hmmm కాసేపో విషాదం కమ్ముకున్న మేఘంలో ఒంటరి ప్రయాణం .
సోషల్ మీడియాలో అక్కడక్కడా సత్యంగా చెప్పుకోవాలంటే చాలా అరుదుగా మెరిసే మెరుపులా చమక్కులా మాత్రమే ఎం ఎస్ నాయుడు గారు తెలిసిన నాలాంటి చదువరులు “ గాలి అద్దం” పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోగానే ముందు కవర్పేజీల నలుపు తెలుపు రంగుల్లో రమణజీవి , శంకర్ పామర్తి గారి గీతలలో మిస్టిక్ వాసనలకి మైమరిచిపోయి కాసేపలా ఆగిపోవడం ఒక వంతయితే పేజీలు తిప్పడం మొదలు పెట్టగానే నెమ్మదిగా మొదలయ్యే ఉద్వేగం , ప్రాణం ఎక్కడ ఆగుతుందో , కవిత యే జ్ఞాపకాల పరదాలు చీల్చుకొని ఏ కణంలో సున్నితంగానే అయినా కస్సుమని దిగుతుందో చెప్పడం అంత సులువేం కాదు .
నిజానికి గాలి అద్దంలో ప్రతి కవిత ఒక రోలర్ కోస్టర్ రైడ్గానే చెప్పుకోవాలి
మనసొక శోకవాయువు అని మొదలు పెట్టి ఇపుడైనా గెంతెయ్యాలి మనసు మట్టి మీద నుంచి అని రాసుకోగలిగే కవులు ఎంత మంది ఉంటారు , ఆ కవితా సముద్రంలో కాసేపు ఉక్కిరిబిక్కిరికాకుండా మనం ఎలా ఉండగలం .
టాగోర్ ఆరాధన నుండి భయటికి రావడానికి ఇష్టపడని సాహితీప్రియులు “ విసిరేసిన వక్షోజాలు జారుడుబల్లలో ఆగిపోయి కలలు కంటున్నాయి “ లాంటి వాక్యాలకి ఎంతగా ఉలిక్కి పడతారో తెలియదుగాని , ఈ పుస్తకంలో “ డాలీనందుకోలేక “ కవితలాంటివి అలాగే స్థలంకై స్తనంకై లాంటి టైటిల్స్ , ఎం ఎస్ గారి పదాల్లో బోల్డ్ నేచర్కి న్యూ ఏజ్ కవులు ఒక సలాం కొట్టాల్సిందే . పుస్తకం మొదట్లో కంటే కూడా లోలోపలకి చేరేకొద్దీ కవితో పాటు రీడర్ తనలోకి తానూ చేసే ఏకాంత ప్రయాణమొక నిజ అనుభవం . కొన్ని క్షణాల స్టిల్ లైఫ్ . అందుకే అన్నది ప్రాణమెక్కడ ఆగిందో పదమెక్కడ గుచ్చుకుందో చెప్పడం అంత సులువేం కాదు .
Thomas Gray ప్రఖ్యాత వాక్యం చెప్పినట్లు Poetry is thought that breathe and words that burn అని సెగలు , శ్వాసలు , శ్వాసల సెగలలో సగం సగం కాలిపోయి నిలబడటం గాలి అద్దం స్పెషాలిటీ ఖచ్చితంగా . జీవితపు తమకానికి తాత్వికత అద్దితే అదే ఎం ఎస్ నాయుడి గారి గాలి అద్దం . సాహితీవ్రణాలకో అవసరమైన మలాం .
*
APRIL 21, 2016
APRIL 21, 2016
http://saarangabooks.com/retired/2016/04/
No comments:
Post a Comment