Followers

Monday, March 19, 2018

తూర్పు గౌటా

అసలు ఎవరికీ వంచన చేతకాదు. సాంస్కృతిక కాలుష్యాలు లేవు. సజీవులే సజీవులు. 

అసలు ఎవరికీ చికాకు రాదు. నీ లోపల ఖాళీ అద్దం. తిరగదు. గెంతదు. అసలు ఎవరికీ ఊపిరే అఖ్ఖర్లేదు. పువ్వులు చూడవు.  గాలీ చూడదు. సమాధీ చూడదు. 

తొడుగు. తొడుగు. సరికొత్త జననేంద్రియాల్ని. తొడుగు. తొడుగు. అపూర్వ అంగాల్ని. వాటితో సలాం పెట్టు. వాటికీ సలాం పెట్టు. మలాం పెట్టు పదాలకి. మలాం పెట్టు రాజ్యాలకి. పూజ్య రాజ్యాశ్రువులకీ మలాం అద్దు. హత్తుకో. ఒత్తుకో. ఎత్తుకో. అద్దుపద్దులేని సౌందర్య రాజ్యాధికారాలకీ  సలాం పెట్టు. మొక్కు. ఇంకా ఇంకా మోకరిల్లాలని మొక్కు. రక్తశిలాఫలకాలతో కీర్తించు.  

చరిత్ర భయపడుతోంది. ఇల్లు భయపడతాయి. పుస్తకాలు భయపడతాయి. ఆటస్థలాలు భయపడతాయి. ఆసుపత్రులు  భయపడతాయి. ప్రేమలు భయపడతాయి. యుద్ధ క్షిపణులు  భయపడతాయి. అరచేతులు  భయపడతాయి. శ్మశానాలు  భయపడతాయి. తుపాకులు  భయపడతాయి. చిరునవ్వులు  భయపడతాయి. కనీళ్ళు  భయపడతాయి. మతాలు  భయపడతాయి.  ఆటబొమ్మలు  భయపడతాయి.

ఎప్పటికి శాంతిస్తావు సిరియా? ఎప్పటికి శాంతిస్తాయి నీ ఆయుధాలు?

No comments: