Followers

Saturday, October 20, 2012

నాయుడు అసాంఘికుడా? *

ఒక కవితా సంకలనానికి ఇంత కంగాళీ శీర్షికని కవీ ఇంతవరకు పెట్టినట్లు లేదు. షెల్లీ కవిత 'The Triumph Of Life' ని విశ్లీషిస్తూ Jacques Derrida 'Living On' అనే వ్యాసంలో ఒక ప్రశ్న వేసాడు. "How then is the title of the book to be read? First, is it readable?" అలాగే 'death sentence' అనే పదబంధాన్ని కూడా చాలా దీర్ఘంగా విశ్లేషించాడు. మరణశిక్ష అనే మాటని మృత్యువు అనే ఒక బహుమతి అనికూడా అర్థం చేసుకోవచ్చన్నాడు (arret de mort). విజయం షెల్లీ జీవితపు విజయమా? మృత్యువు మీదా? జీవితం మీదనేనా? ఎవరి జీవితం? జీవితం అంటే ఏమిటసలు? ప్రశ్నలన్నీ వంద పేజీల బృహదావ్యాసంలో చర్చించాడు. అదంతా ఫ్రెంచ్ గోల.

ఇక వెళ్ళిపోతాను అంటే పేచీ లేదు. ఒక వెళ్ళిపోవటం ఏమిటసలు? ఒకడు ఒకానొక వెళ్లిపోవటమా? లేచిపోవటంలానా? ఒక రాక, ఒక పోక? కొన్ని శబ్దాలు కొందరు కవుల్ని ఏరుకుంటాయ్. You are he who writes and is written అని ఒకడంటాడు. మరొకడు (పాఠకుడన్నమాట) 'little by little the book will finish me'(Edmond Jabes). అందరూ హాయిగా హైకూలు రాసుకుంటుంటే నాయుడోచ్చి ఎక్సెండెంట్ కవిత్వం రాస్తూ, చెరిపేస్తూ, చింపేస్తూ, తగలబెడుతూ, పారేసుకుంటూ, తన కవితల్ని తానే ఇతరుల దగ్గర్నుంచి దొంగిలిస్తూ, రహస్యం పారేస్తో మళ్లీ నాలుగేళ్లకిలా వొచ్చాడు ఒక వెళ్లిపోతానంటూ.

సరిగ్గా 7.9.1997 నాయుడు అచ్చుకి సిద్ధం చేసి నాకు 'ఇపుడే' అనే కవితా సంకలనాన్ని ముందుమాట కోసం పంపిస్తే  47 కవితలకు ' 47డుపులు' అని రాసి పంపాను. దాని ప్రతి నా దగ్గర ఉంచుకొని. 47 కవితలు ఏమయినాయో ఇప్పటికీ ఒక రహస్యమే.

' ఒక వెళ్ళిపోతాను' లో మొదటి కవిత పేరు - 'చివర్నుంచి'. భాషాగత , భాషాంతర్గత శూన్యవాదం కవిత నిండా. అన్ని కవితల్లోనూ ఒక అంతఃసూత్రం కన్పిస్తుంది. అది నిబద్ధత కాని ఒకానొక అసంభవిత స్వబద్ధత. "A systematic undoing of understanding"( పాల్ డి మాన్) చివరకు పాఠకుడికి మిగిలేదేల్లా, 'నోరు మెదపకుండా మనలో మనం మాట్లాడుకోవటం'(నాయుడు)

భాషని అనన్వయత్వంతో రాస్తాడు ఈ కవి. ఎలా అంటే 'గడియారం వీపులో / పొగాకు వాసన'. 'ఒక లోనికి వెళ్
ళే తిరుగుతున్న / అస్పర్శ'. 'వెయ్యి స్పర్శల కన్నీళ్లు'. 'నా లోపల / చనిపోయాను'. 'అన్నీ గుర్తే / అయినా సగం మర్చిపోయినట్టు గుర్తుంటాయి'. 'పదం కింద చెదలు పట్టి'/ ఈ అనన్వయ భాషనే ఫాలిటిక్ ఫాలసి అంటారు కదా.
ఆక్సీమొరాన్ కూడ ఈ కవి శిల్ప రహస్యాలలో ఒకటి. అసత్యమైన సత్యం, అసత్యమే సత్యంలా - 'నాలుక లోపల / మరో నాలుక / సముద్రం / నీటిని మింగుతోంది.' 'మృత్యు ముఖం నా ముఖం / లోపల.'
ఇతని సినక్ డొక్ ఇలా ఉంటుంది. 'అద్దం కాలుతుంటే కొన్ని అక్షరాలు పోగై / పొగై అద్దం చుట్టూ తిరిగి నవ్వు కుంటాయి/'
Transferred epithet ని  ఇలా వాడుకుంటాడు. "రైలు పట్టాల్లో గుండె నొప్పి, ఉబ్బసం, పచ్చ కామెర్లు / పక్షపాతం నాలుకతో తమలపాకు నవ్వులతో ఎక్కడికో' / 'పట్టుకున్నాను పసుపు కొమ్ముల గాజుల్ని', 'కన్నీళ్లు ఆవలిస్తున్నాయి" దీన్ని ఇమేజిజంగా వెంటనే గుర్తుపట్టుకోవచ్చు. ఇమేజెస్ని విడవడు నాయుడు - 'కలొకటి / ఏడుస్తుంటే ...' 'వణుకుతో గుండె గాలి'/ 'నా దేహం లోపలికి / మరొక నా దేహం వెళ్ళింది.' 'నువ్వు / నేను / ఒక్క కన్నుతోనే ఏడుద్దామా.' ' ఈ రోజు కూడా ఆకాశం వొచ్చింది'/ 'ఎవరూ మిగల్లేదు నా కల చెవిముందు.'
కొన్ని metaphysical conceits - అసలు బండంతా వీటితోనే నెట్టుకొస్తాడులా ఉంది నాయుడు... 'మరణం వినిపించటం లేదు'/ 'ఈ చీకట్లోంచి ఎప్పటికైనా తప్పిపోవాలి.''సుడిగుండాల లోని నది మాయం/ గడియారంలోని కాలం మాయ'.'ఎవరివో రెండు పెదాలు విరిగి పడుంటే / నా కన్నుని విప్పి దాచేసాను.'
నాయుడి కవితల్లో anthropocentric విరగబాటు తిరగబాటు, ఆఫ్రికన్ తాంత్రిక క్యూబిజమూ స్పష్టంగా కన్పిస్తాయి. ఎపుడంటే - 'వీపుకి వక్షోజాలు / కొత్త దేవుడు.'
'అతడి యోనినీ ఆమె శిశ్నాన్నీ తాకి / వొచ్చి వెళ్తూనో వెళ్తూ వోస్తూనో ఉన్నాం'. 'పేగు చుట్టూ ముగ్గులు పెడుతున్న కన్నీళ్లు / ఒక వరస కలపలేని చుక్కలు.'
పూర్వం ఎపుడో అన్నాడీ కవే - 'పాడై పోయిన వాక్యంలోని / ఫుల్ స్టాప్ ని బాగుచేస్తున్నాను ' అని. అందుకే మళ్లీ ఈనాడు ఒక పేజీ నిండా విరామ చిహ్నాల్లేని 'గాలి యోని మృదు మృత్యువు' అనే కవిత (పారాగ్రాఫ్ కవిత) ప్రచురించాడు. అసలీ శీర్షికకు అర్థం ఏమిటంటారా? నార్సిజం అంటే ఏమిటో అదే ఈ కవితకు అర్థం.
నాయుడు అసాంఘికుడా? నాయుడి కవిత్వం అసాంఘికమా?
వాయొరిజమా? గడ్డకట్టిన స్వీయ కరుణా? పూర్వమెపుడో అన్నాడతనే - 'నిశ్చలంగా నిర్మలంగా / లంగా ఎత్తుకుంటాను ఆకాశం వరకు'/ అని.  ఈనాడు అంటున్నాడూ, 'మృత్యువుకీ, మూత్రశాలలకీ వాస్తు ఉంటుంది'/ స్త్రీ పురుషుల మూత్రాంగాలకి వాస్తు ఎక్కడుంది / ప్రతి మూత్రానికీ, మృత్యువుకీ / దూరం అవ్వటమూ ఓ జీవితమే.' 'పసినవ్వు ముందు / మోకరిల్లి ఉన్నాను / నన్నిక్కడ్నించి లాక్కెళ్ళవద్దు' అన్న కవి అసాంఘికుడా?

కవిత్వంలో కలాజ్ శిల్పాన్ని ఇలా చూపిస్తున్నాడు 'కళ్ళు / స్త్రీ పురుషుల జననాంగాలు ముఖంపైన.' 'ఎత్తుపళ్ళ సముద్రం' / 'గోడకానుకున్న నీడలు'/

తాంత్రిక వాస్తవికత నాయుడి కవిత్వంలోని మరొక అంశం. 'నా దేహం లోపలున్న ఎముకలన్నిటిమీదా పూలు ఉంచాను.' 'ఆమె గర్భిణీ గొంతుతో / 'గదిలోనికి వెళ్ళండి / అశ్రువుల్ని నింపుకోండి / కానీ, ఏడవకండి బలహీనతల్లోంచి'. 'ఈ రాత్రిని / గోడకి తగిలించాను / రేపు బైట పారేస్తాను.'

'అస్పర్శం' అనే ఒక పూర్తి పుట కవిత చదవండి. లైంగికత కవిత్వంలోని ఒక ప్రధానాంశంగా గుర్తించండి.

అదొక kabbalistic magical absolute. ఈ absoluteని తట్టుకోగల ధైర్యం ఉంటే నాయుడి పుస్తకాన్ని తెరవండి

ఇప్పట్లో ఆ ధైర్యం లేకపోతే పోయిందిగాని ముందీ పుస్తకాన్ని కొనుక్కుని దాచేయండి. లేదా నాయుడు మళ్ళీ ఏ కోపంతోనో ఆ అచ్చు ప్రతుల్నీ తగలేట్టేస్తాడేమో.

ఎం. ఎస్. నాయుడు ఒక విశిష్ట కవిగా గుర్తుపొందుతాడా లేదా అనేది మన సోషల్ సైకాలజీ ఆఫ్ రీడింగ్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అకవులనే మనం కీర్తిస్తూ కూచుందాం లెమ్మంటే ఏ గొడవా లేదు చివరికి. 

------

*ఒక వెళ్ళి పోతాను - సంకలనానికి, వార్త 2-10-2001లో 'మో' గారు  రాసిన సమీక్ష ఇది. 

No comments: