Followers

Monday, October 31, 2011

ఒక మనిషి... మరో పిట్టా... ఇంకో చెట్టూ

1
ఎవరో చెవులతో నివసిస్తున్నారు
ద్వారబంధాలు కూలిన అక్షరాల్లో

కూడలి గోడల
కుంగిన ఓడల మధ్య
విలాసాలను
కూడబలుక్కుంటున్నారింకెవ్వరో

విలాస పదాలే విశాలంగా లేవు
మనసే కదలదు
ఏ పదాల్లోనైనా
తిరిగి చూసే భవిష్యత్తే
గతమై అందరి ముందూ

2
ముందుకు రాని కాలం
తొడుక్కోలేని
నీ స్కూలు నిక్కరు చొక్కా


దరి చేరవు నిశ్శబ్దాలు
ఉదయాలే భయానక మౌనం

ఊపిరి ఊహలే
ఊగిసలాడే ఊలు ఊళలు

సరిపడదు ఏ సలుపూ
సరి తూగదు ఏ మలుపూ

3
చేజారే అద్దాల్లోపల
అద్దంకై వెతకాలి
చూపు మరో నేల కంటిపై

అపుడు తెరెస్తుంది
నిదురపోయే ఆకసానికీ
నిద్ర లేపే రెప్పలకీ
మధ్య ఒక చూపు

అద్దం డంబమనీ
అర్థం దాని బింబమనీ

కనుబొమన కడుతుంది
నేలా ఆనని చూపొకటి

మిణుగురుల మెరవణి నడుమ
కొనమొనతేలి నడక సాగని
ఏరుల తేరు

ఏమయ్యిందీ పాడు లోకానికి
తిరనాల జీవితాన్ని
పంచదెందుకు తలా ఇంత

4
పంచుకునే పతనమేదో
మహోన్నతం ప్రతి నిశ్శబ్దంలో

దరి ఎవరున్నారో
దవ్వున ఎవరు చేరారో
చూడలేని పతన మైత్రది

పవళింపు రాగమే మరో శోకం
ఎవరు నిద్రించారులే ఏ కలలోనైనా

ఎక్కడికి చేరామో
ఎవరికోసమో చేరేది
ఎక్కడెక్కడికో

ఎవరు చెబుతారో
వారి నాలుకపై ఉమ్మివేయండి
వారి ఉమ్మితో కన్నీళ్ళని కడగండి
మరో పిట్ట నాలుక కింద
(కొంచెం నీడ చూపించండి
కొంత నిద్ర పోయే సూర్యుడి కోసమే
జీవించే ఆశని దరి చేర్చండి)

5
తెలవారే
ఓ చెట్టుతో
చెప్పాపెట్టకుండా వెళిపోయింది ఆ పిట్ట
అపరిచితలే చెట్టూ పిట్టా

నడి ఎండలో
బడాయిపోతూ
చెట్టును బులిపించింది పిట్ట

"అతిథీ నీ పేరేంటి?"
పిట్టను అడిగింది చెట్టు

ఎగురుతూ విడిపోతూ
రెట్టిస్తూ వెళిపోతూ
చెట్టుపై రెట్ట వేసి చెప్పింది పిట్ట తన పేరు
"పాట"

సాయం సంజెలో
వాలింది మళ్ళీ పిట్ట
రెమ్మల నీడల చీకటిలో
రెక్కలు ముడుచుకుంది చలిలో
దాచుకుంది బిక్కచచ్చి

హోరుగాలిలో
కొమ్మలు అల్లాడుతుంటే
రెమ్మలు చెల్లాచెదురవుతుంటే
బెంగగా పిలిచింది పిట్టని చెట్టు
"పాటా"


పిట్ట పలకలేదు
చెట్టు నిదుర పోలేదు ఇంకా.

6
మరలిన మౌనపు మాటలకేం తెలుసులే
మాసిన మోసపు మూస మూతల మోహాలు
ఖండిత జ్ఞాపకాలే
రేపటి జ్ఞాపికలు

ఎటో చేరిన చెట్టులో
ఏ కొమ్మ ఏ పిట్టదో
ఎవరకి మాత్రం తెలుసు
పదాల పెదాల్లోని కీటకాలుల
ఏ పిట్ట నోటికో
ఎప్పటికీ చెప్పొద్దు
కలలోని కీటకాల్నీ తినే పిట్టని చూడాలి
పిట్టల్ని తినే స్వప్నాన్ని చూడాలి
స్వప్నాల్ని ఆరగించే మనుషులే
ఇప్పుడు లేరు
ఇక పుట్టరు

7
మనిషి వెతుకుతున్నాడు
ఎడారిలో పిట్టను

పిట్ట నిరీక్షిస్తోంది
నింగిలో మనిషి పాదముద్రల కోసం

చెట్టు కనుల కాయలుకాసింది
వాలే పిట్ట ఆనవాలుకు

*
- అనంతు
ఎం ఎంస్ నాయుడు

Friday, October 28, 2011

జాలరి

ఏదీ నమ్మవు
దేన్నీ నమ్మాలనుకోవు
నమ్మకమూ అమ్మకమేనంటావా

వ్యాకరణం వాయువై కదలదు
వార్ధక్యం ఆయువై నిలవదు
స్నేహం ప్రేమై తిరిగి రాదు

ఎక్కడో నమ్మకం పువ్వులై పగిలిపోతుంది
ఎక్కడో పగిలిన పువ్వుల్లో నమ్మకం గుచ్చుకుంటుంది
అదేదీ కాదులే
నమ్మకం నీ పదాలపై తిరుగాడే అసహ్యం

చూసే ప్రతీదీ
కొంత నీలో మరికొంత బయట తగలబడుతూ మసైపోతూ

తలూపుతూ అద్దాలు నీలోకి

తలాడిస్తూ నీవు అద్దాలలోకి

నమ్మకమే దాగి ఉండదు ఎక్కడా

దాచుకో దాచుకో దాపరికం లేకుండా

Thursday, October 27, 2011

కలల్ని కడగాలి

అతను అతనితో మాట్లాడుతూనే మాట్లాడలేదు
యేవో కొన్ని అంటే కొన్నే స్వల్పమైన అల్పమైన మాటలు

అతను అతనితో వింటూనే వినటం లేదు

యేవో కొన్ని సులువైన సలుపుపెట్టే మాటలనే మాటల్ని చేసి వింటంలేదు

నల్లటి జెండాలు ఎర్రటి జెండాలు తెల్లటి జెండాలు

కింద
చెట్టు
చెట్టుకింద
పావురాలు వాటి రంగుల్లో

అతను పావురాల కళ్ళల్లోని మాటల్ని చూస్తున్నాడు

అతని అతను పావురాల మాటల్లోని కళ్ళని వింటున్నాడు

అతని సోదరి ముద్దుపెట్టుకున్న జ్ఞాపకం

జ్ఞాపకం ముద్దుపెట్టుకున్న అతను సోదరి

తండ్రి

తల్లి లేని నేరాల చీకటి

తల్లి

తండ్రి లేని చీకటి
ఏవేవో ఎవరెవరో ఉంటూ ఉండని చీకటి

ఇక్కడేదీ ఉండదు

చివరి చివరి చివరి వీడ్కోలూనూ

అతను అతను

అతని అతను
తను అవ్వలేని అతను
అతనే అవ్వలేని తను

మాటలు మొహాలు

ఒకేలా అనామకం

ఈతలో ఈతకి వెళ్లి ఈదుతూ కల

కలలో ఈదుతూ ఈతకి వెళ్ళాలి
మునగా లేదు తేలా లేదు
ఈత రాలేదు
అసలు ఈతే లేదేమో

కడగాలి

మాట్లాడే చెవుల్ని
కలల మాటల్ని

Wednesday, October 19, 2011

లోహానందం

లోహజిహ్వలు
లోహవిషాదాలు

ఎన్నో రంగుల్లో
ఎన్నో నీడలపై
కలిసే
కలలు

లోహస్నేహితులు
లోహప్రేమికులు

ఎన్నో నీడల్లో
ఎన్నో రంగులై
మరిచే
పిట్టలు

మత్తు పదార్థాల్లారా
గిరగిరా మీరూ నేనున్నూ

పిట్టలు మార్చిన
కలల్లోకే
రంగులయ్యే
నీడలు

లోహనిశ్శబ్దం
లోహానందం

బట్టల్లేని మాటలు
రెల్లుగడ్డి చాటున
ఏ రెక్కల్లేని పిట్టో
రాత్రి దారిని చూపిస్తుంది

లోహనేత్రాల్లో
మునిగిపోయాను

Saturday, October 15, 2011

ప్రతిబింబంలో అద్దం

ఊహించింది ఉండట్లేదు

ఉండేదేదో ఊహకీ తెలియదు

తెలియని ఊహలే ఉన్నట్లు

అనుకున్నాను నిన్నే చూస్తూ చూస్తూ

చెదరగొట్టకు బెదిరిపోకు

నా ముఖం నీ ముఖంలో

Friday, October 14, 2011

చేరావా నీలోకైనా

తలెత్తినా తలదిన్చినా
కనిపించే ఖాళీ స్పర్శ ఛాయ

ఏ దరీలేని ఎదలో
స్నేహమే స్పర్శ వృత్తం

చినుకు చప్పుడు కునుకు చప్పుడు
ఏ కల నడకో

ఆకలితో అద్దం అద్దంలో ఆకలి
ఎవర్నో మింగాలని ఎవరో మిగలాలని

దేహమేలేని దేశంలో ఉంటే
పౌరహక్కులు ఏ మూలకు

నియమమే సమంజసమనే నియంతకీ
లేదు ఏ ఉదాహరణ

చేరాల్సిన విరామ చిహ్నమేదో తప్పిపోయినప్పుడే
గగుర్పాటు ఓదార్పు ఏకకాలంలో

చీకటి చప్పుడు నమ్మిన బాంధవ్యం
ఏ తుది వయసో

చేరావా
నీ నిద్రలోకైనా

Tuesday, October 11, 2011

మాయా సమయం

పదానికి పదమేది
ఇదని

ఇదేనని
అనుకున్న ఆనుకున్న పదమేది

తెరిచేది ఎక్కడుందో
తెలియని ముగింపుకై

నీరు తెరుచుకుంటుంది
మునిగేది ఎక్కడో

తీసుకోవాలి
తట్టలేని ప్రతి ఆలోచననీ

చేతుల్ని తెగ్గోసుకోవాలి
మనసులోనే

అనుభవమే
అనుభవిస్తోందా

మాయా సమయం
సమసిపోదే

వాసనతోనే రాత్రిని
మర్చిపోవాలి

Tuesday, October 04, 2011

అద్దం ~ కిటికీ

మనమిద్దరం
తొంగిచూసేవాళ్ళమే

దేనిని చూసామో
గుర్తుకుంచుకోము

దేనిని చూడాలో
ఎప్పటికీ తెలియదు

మనమిద్దరం
ఎదురుచూసేది దేనికోసం