Followers

Tuesday, August 30, 2011

స్వప్ననేత్రం

అనుకూలమైన పదాలే
లేవు రెక్కలిప్పే సముద్ర పక్షి నేత్రంలో

చూస్తుందంతా రంగులు కలిసిన నీడలు
నీడలు కలిసిన రంగులే

తలవొంచే దుఃఖంలో ప్రేమెక్కడిది
దుఃఖంలో మనసు శిరస్సొంచే ప్రేమెక్కడిది

ఉబుకొచ్చే మౌనస్పర్శలు
నీత్రాశ్రువులు నేత్రాన్ని ఎపుడైనా ప్రశ్నించాయా

చెరిపేసిన మాటలన్నీ మాటల్తో
ఎక్కడికైనా చేరాయా

గళమొక నేత్రముఖ శూన్యమై
ఆవిష్కరించే నిశ్శబ్దాన్ని ఎవరు తిరిగి చెప్పగలరు

వొడిలిపోయే వొదులు పదాల్లో
అసంపూర్తి వాక్యాలెన్నో

సూర్యస్నేహ భూమిలో
స్వప్ననేత్రం ఎవరు చూడాలిలే

బూజు కలల్లో చిక్కుకొన్నాను

Tuesday, August 23, 2011

నిర్వృతి


ప్రతి
కారణమూ ఒక ఘటనే
సమాంతర పదాల్లోనే అన్వేషణ

తెనేతెర అద్దంలో ఉన్నాను
కన్నీళ్లు
సీతాకోకచిలుకలు

ప్రతీదీ అనుమరణమేనా
కృంతాంతుడ్ని పరిహసించానా

ఏ నిలింపభాష కావాలి
ఒట్టి నాలుకతోనే ఉత్తుత్తునే

ఇది జరిగినిది కాదు
ఇది జరిగేదీ కాదు

కలల పోలికల్నే ఇంకా ఇంకా
డ్రీమిస్తూ డ్రియాలిటిస్తూ

నిర్వచనాలు
పదాల మధ్య ఇమడవు

నివీసు లేడిపుడు
ఎవరిక్ ఉత్తరమ్ రాయాల్

స్వాపమొక శాపము
వాక్యమొక నీటితాత

ఆపైన ఆలోన
ప్రతి ఘటనా అకారణమే

సగం ముసుగు చాలు నాకు
నన్నేను ముద్దుపెట్టుకుంటా

నవ్వే కన్నీటి బొట్టు
Sintax ని ఇపుడు ఎవరు వసూలు చేస్తారు

ఋజువు బూజులే అన్నీను
ముడివిప్పకు ముడ్డిచూపించు

---- మో గారికి ----

Monday, August 22, 2011

సగం విరిగిన విరామచిహ్నాలలోకి

... కాకపొతే

కన్నీళ్లు వొస్తాయి

...కాలేకపోతే



విషమే చిమ్మే మౌనం వొస్తుంది


... సరే


ఎదురుపడకు ఓటమి నీడలతో



... ఇంకెందుకులే


ఎన్నాళ్ళు మృతలాభాల్ నష్టాల్



... ఐపోయిందా


ప్రతిసృష్టి



సృష్టి ప్రతి


... మిగిలిందా

నల్లటి ఒంటరి ఒంటేలు



... ఇక్కడే ఎక్కడున్నాం


నిన్నటి ఊపిరితో

వొచ్చేస్తున్నా...


సగం విరిగిన విరామచిహ్నాలలోకి

జ్ఞాపకం చేయకు

మరణించాలనే ప్రతి అల ఒడ్డుకి చేరితే
ఎవరో బతకమని బలవంతంగా వెనక్కి లాక్కెలతారు

ఎప్పటిదో ఓ రాత్రి తన రాత్రిని అసహ్యించుకుంటుంది

కాలాన్ని అపహాస్యం చేయాలనేనా మృత్యువు రోదిస్తోంది

జరామరణాల మధ్య విరామం
ఎంతో ఎవర్ని అడగాలి
అద్దంలోపల్లున్న మట్టిలో ఆడుకుంటున్నాను

వొంగిపోయానో లొంగిపోయానో ఇంకా దాగున్నానో
పరమపదించే పదమేలేని నిద్రలో ఆడుతున్నానో

గుండెల్లో ముళ్ళు పెరుగుతున్నాయి
కన్నీళ్లు గుచ్చుకునే మెత్తటి కొండలు

స్పర్శ స్పృహ
ఎంత ద్రోహం
ఎంత జ్ఞానం

విడిచిపెట్టే ప్రతిదీ అదృష్ట అదృశ్యం
జ్ఞాపకం చేయకు ప్రయాణించాలని

సమాధి ఎదురుచూస్తోంది

Sunday, August 21, 2011

దీపాన్ని చూసే సమయం

దీపం వెలుతురులో వెలిగే దీపాన్ని ఎప్పటికి చూస్తాను
చీకటిలో వెలగని దీపాన్ని చూసే సమయం ఎప్పుడు
జననమరణాలులేని వెలుతురో చీకటో ఎక్కడిపుడు

ఏ పదమో

పదమే ఏ పదమో
ఎటునుంచి వచ్చి పోతోంది

బహిష్కృత ఛాయలేవో

ప్రతి పుష్పంపై

Saturday, August 20, 2011

వినిపించే ఖాళీ

దూకాలి నిశ్శబ్దంలోకి
నిశ్శబ్దంగానే దూకాలి
ఏ జాడలూ లేకుండా

ఎప్పటి నేత్ర చిత్రకారుడో
రంగుల్ని కలుపుతుంటే
అవి కళ్లపై ఉండట్లేదు
గీసి చేసిన ఏ చిత్రమూ నిలవట్లేదు

ఓ సొంత సూర్యోదయం ప్రతి వస్తువులో
ఓ వింత మరణతేజం ప్రతి ప్రాణిలో

జ్ఞాపకాలు ఏ వర్ణంలో ఉంటాయి

కాలమే వర్ణరహితమైతే అపుడే రంగు అది

ఈ రంగుల్ని ఎవరు వింటారు

వింటున్న రంగుల్ని ఎవరు చూస్తారు

ప్రతీదీ

చూడబడేది చూడబడనిదేనా
చూడనిచ్చే చూసే చూపే లేకపోతే
జ్ఞాపకాలు ఎవరి నోటి రంగుల్లో ఉంటాయి
ఖాళీ అయ్యే ప్రదేశం ఏ రంగులో ఖాళీ అవుతోంది

వినిపించే ఖాళీ ఈ రంగులో ఎక్కడ

Thursday, August 18, 2011

| తల ఎర |

ఒకానొకసారి మెడపై తేలే తలలో కొన్ని ఆలోచనలు అడుగంటితే
అడుగునున్న తలతో ఆలోచనలు సంభాషించాలని పూనుకున్నాయి

ఈ తల నచ్చట్లేదు
ఈ మెడకి నాకు పడట్లేదు
ఈ ఆలోచనలు తలకెక్కట్లేదు
ఈ మాట్లాడే బుర్ర బూర ఎంతకీ పగలదు
ఏ చప్పుడూ చేయకుండానే నా చెవుల్ని కళ్ళని లొంగదీసుకుంటోంది
ఏ నాలుకుందో ఈ తలలో తెగ్గోసుకోవాలని చూస్తున్నా వీలుపడట్లేదు

ఎన్నో బానిస గొంతులతో
ఎన్నో అనుకరణలతో
మరెన్నో రుచులతో రోజూ రొంపి రొంపి చేస్తోంది ఈ తలకాయని

ఎక్కడికీ వెళ్ళదు పంపిద్దామంటే
అంటిపెట్టుకునే ఉంటోంది మెడకి అనుక్షణం
ఎలా వొదిలించుకోవాలి

ఇపుడే నీటిలో కడిగిన నీడలు
ఎండబెట్టాను ఎగిరేద్దామని
చనిపోయున్న కాగితంలో

ఏది తయారు చేసారో అది నిజమేనా
ఏది సృష్టించారో అదీ నిజమేనా
ఏది అంతరించిందో అదే నిజమా
ఏది నిజమో అది అంతరించాలా

ఇవేవీ కాదులే అని బొడ్డులేని ఆలోచనొకటి
తలతిక్క తలకి ఊరడింపు పలుకులేవో చెప్పుతుండగా...

చెప్పాపెట్టకుండా తల తలదిగి
తలతిరిగినట్టు కిందపడబోయి ఆలోచనల కళ్ళ కాళ్ళని పట్టుకోగా...

తలతిప్పి చూసిన ఆలోచనలు
కాళ్లు విదిలించుకొని పరిగెత్తాయి

తలకి దూరంగా ఆలోచనలు
ఆలోచనలకి దూరంగా తల
ఒకానొకసారి తలదాచుకుంటూ రాత్రిని తింటూ...

కలల తలలోకో
ఆలోచనల కలలోకో

Wednesday, August 17, 2011

గది చనిపోయింది

చేరకపోవచ్చు
అద్దం వరకు కన్నీళ్ల నిద్ర.

మిగులుతున్న స్నేహితుల సంఖ్య
మిగలని రక్తసంబంధీకుల స్నేహం అర సున్న.

అవహేళనే
రహస్యం.

కూర్చున్న ప్రతి పదమూ అవహేళనే.

నిద్రరాదు
సూర్య జ్ఞాపకముంటే.

విరగలేని అక్షరాలు కళ్ళలోనే.
లోపల్లోపల లోపల లోపాల పాల అక్షరాలు.

భాషలో కాలం ఒక మరుగుజ్జు
మరుగుజ్జు కాలం ఒక భాష.

భక్తిపుష్పాలు
రతిభక్తిపుష్పాలు
భక్షించాలి భజించాలి

ఇక నాకలేను నా చర్మాన్నే
చర్మమే నన్ను నాకుతోంది

నల్లటి ఇల్లు
చెవులు లేని కళ్ళు

ఓడిపోవాలి
ఒంటరి నీడలకై
ఒంటరి మాటలకై
ఒంటరి మరణంకై

ఎవరోలే
కలలో తిరిగే పిట్టలు పిల్లలు స్త్రీలు మృగాలు

గది
చనిపోయింది

రాత్రీ
చనిపోయింది

పగలు
బతికే అవకాశాలు తక్కువే

Friday, August 12, 2011

మరో వాక్యాన్ని రాస్తున్నప్పుడు

ఇదొక వేళ అని మాత్రమే తెలుసు
సమయాలు ఎవరో చూసుకుంటారు
ఎవరికీ ఎవరూ చెప్పలేరు చెప్పుకోలేరు స్థలంలోనే బతికున్నామని

ఒక ఆదివారమో, ఒక దినవారమో
దేహంతపువారమో, సదా రాత్రివారమో
గడిపేది బతికుంటేనే

వర్షమో సూర్యుడో
తడతారు స్త్రీకీ లేనటువంటి చేతులతో
గాలే ఆగుతుంది కళ్ళల్లో

ఖాళీ జిహ్వాలో
ఖాళీ నేత్రంలో
ఖాళీ మనసులో
ఎన్ని మాటలున్నా నన్ను చేరవు

వాసనో యాతనో
నీటిని తవ్వే దేహంలో
నిప్పుని పూడ్చే శవంలో

చేరుకోవాలి
చేదుకోవాలి
చనిపోకముందే బతకలేని క్షణాల్ని

చెట్లు నడిచే తోవలో
కొండలు పరిగెత్తే రహదారిలో
సముద్రాలు గెంతే గగనంలో
నేనూ నా ఆఖరి వాక్యం
సేదతీర్తాం

మమ్మల్ని కదపకండి
మరో వాక్యాన్ని రాస్తున్నప్పుడు

Tuesday, August 09, 2011

౦ జీరో ౦ జీరో

కావలించుకున్న కవల కళ్ళల్లోని
కౌగిలింతంతా వృధానే

కూర్చున్న రోగి చీకటికి
నీకు, నాకు మాటలు ఎక్కడ్నుంచి వొస్తాయి

సంచరించే గర్భసంతోషం ఎవరిది
నవ్వటానికి ఒప్పందాలు ఎక్కడ

భయపడే చావు
చావుకి భయపడే మనం

శూన్య శోకం
శోకవిశ్రాంతి

ఆకాశం ఆకాశమే
సూర్యుడే సూర్యుడు కాదు

చెవులు బాధపడ్డాయి
బాగుపడ్డ కొన్ని కళ్ళని చూపించు

అద్దంలోపల సముద్ర కెరటాలు
రోజు అద్దాన్ని చూళ్ళేదు

జీరో జీరో
నా చూపంతా
మాట్లాడు లతో

Saturday, August 06, 2011

నన్నే బతికున్నానా?

సమాధానం
దానం
చేసారు
తీసుకునేది నేనేనా
నువ్వేనా

ప్రారంభం
అంతమైంది
ఎవరు మొదట ఆట చూసింది

అర్థమైంది
అంధత్వం
నా బయటికి చూపాలి లోపలని
నా బయటని లోపల చూపించాలి

నా లోపల బయట నన్నే కనిపిస్తున్నానే
అంధత్వం అర్థమెక్కడ

మూర్చ అక్షరాల్లో
నన్నే బతికున్నానా
నన్నే చనిపోయే ఉన్నానా

Monday, August 01, 2011

దేహించాలి నా దేహాన్నే

నాతో దారితప్పి నడిచిన నీడల వెనక
నా నీడల వెనక దారితప్పి నడిచే నేను

ప్రార్ధించాలి నా ప్రార్ధననే

అభ్యర్ధించాలి నా అభ్యంత్రాల్నే
శోకించాలి నా శోకాల్నే
రమించాలి నా రతినే
దర్శించాలి నా దృష్టినే
స్ఫర్శించాలి నా స్పర్శనే
మరణించాలి నా మరణాన్నే
గాలించాలి నా గాలినే
అదృశ్యమవ్వాలి నా అదృశ్యంలోనే
ప్రేమించాలి నా ప్రేమనే
రుచించాలి నా రుచినే
నవ్వాలి నా నవ్వునే
దేహించాలి నా దేహాన్నే
శూన్యించాలి నా శూన్యంలోనే
కోపించాలి నా కోపాన్నే
చూడాలి నా చూపునే
బాధించాలి నా బాధనే
శరీరించాలి నా శరీరాన్నే
భాషించాలి నా భాషలోనే
చీకటించాలి నా చీకటిలోనే
నిద్రించాలి నా నిద్రలోనే

నా నీడల వెనక దారితప్పి నడిచాను