Followers

Wednesday, June 29, 2011

తినాలని

తనొంటిమీదున్న సూర్యుడ్ని
సూర్యుడు కిందకి దింపితే
చంద్రుడి కిందున్న సూర్యుడ్ని

చంద్రుడే తినాలని తనొంటినోరుని విప్పింది

Wednesday, June 22, 2011

ఎలా మలినమైందో నాకెందుకు

ఒక దీపం పిలిచింది
తనని
శుభ్రం చేయమని

నీ చేతులతో కాదు
కళ్ళతో
నా
నల్లటి కాంతిని పరిశుభ్రంగా

చూస్తున్న దీపంలో దీపం ఎక్కడుంది
ఎలా మలినమైందో నాకెందుకు
ఎలా అందంగా తుడవాలో
ఈ కళ్లకి ఎప్పటికి చెప్పగలను

ముందు
ఈ కళ్ళనే శుభ్రం చేయాలి

Tuesday, June 21, 2011

దారి

ఇక్కడికి
దారి దారి తప్పి రాలేదు
దారి దారీ లేక ఒచ్చాను

దూరం ఒక నిశ్శబ్ద నిశ్శబ్ద దర్పణం
అద్దంపై అద్దపు రోజులు లేవు

నిద్రించే నిద్ర నిద్ర దూరం ఎవరికి తెలుసు
తేలుతున్ననేల నేలలోకి వెళ్ళాలి

నీటి బొమికలు నిద్రలేచేలోగా
నేల గాలి గాలిలోకి ప్రయాణించాలి

తోటలోకి
స్మశాన తోటలోకి
సముద్ర వనంలోకి
దారి
దారి కావాలి.

దరికి చేరే దూరం
ఏ అలకి అలకి తెలుసు

నీ చేతిలోకి
ఏ చేతుల్నీ తీసుకోకు
ఆఖరికి నీ చేతుల్నీ

Thursday, June 09, 2011

రాత్రిని రాత్రి చేయటానికి

ఎవరికో
నా నీడని చూపాలి
విప్పేసిన ఉప్పటి వెలుతురుతో
~
ఎవరికీ
నీడనివ్వని యంత్రాలు
శ్వాస ఋతువుల్లోకి
~
ఎవరెవరికో
అనిశ్చిత జ్ఞాపకాలే రావని
నా దేహాన్నీ మర్చిపోయాను
~
ఏ పురాతన విగ్రహమో
నన్ను చూస్తున్న కంటిని విప్పాలనుకుంది
కన్నొక నాలుక
~
నకిలీ పిర్రల్తో
దేకుతూ వచ్చే మాటల్లో
తోలు బొమ్మల చంద్రుడు
~
ఎవర్నీ చూడని సూర్యుడు
చీకటిని తింటూ
తింటున్న ప్రశ్నలు
~
ఎవరు ఎవరు ఎవరు
స్మశాన సన్మాన ప్రేమలో
నా రాత్రిని రాత్రి చేయటానికి

Wednesday, June 08, 2011

గాలి కాయితంలో

ఒక గాలి నిండిన కాయితాన్ని చించు
చించిన పదాలు కింద పడొచ్చు

చిరిగి పడిన పదాల్లోకి నీ కళ్ళని పంపు
వెతికే వెలితీ, వెలితిని కనుక్కునే వెలితీ కనిపించొచ్చు

మాట్లాడు కాయితపు నాలుకతో
పూర్తవ్వని అక్షరాలు పూర్తయ్యే అనాకార అక్కరాలు

అదే చీకటి మౌనం
అదే మౌన నిశీధి

చెవుల్ని ఎడంగా పెట్టు
కన్నీళ్ళనీ ఎడంగా పెట్టు

గాలిలేని గాలి కాయితాన్ని తీసుకో
నీ పదాలతో నింపు, చింపు

ఏమి చూసావో రాయి
నీ గాలి కాయితంలో

Friday, June 03, 2011

వింత విషం

నీ చర్మం
చీకటిగా తడుస్తోంది
ఆవిరయ్యే ఆయువు
ఆగిపోయే చీకటి

నా చర్మం
తుడిచిన అక్షరం
పద మోసం
ఆరిన వాక్య కెరటం

మన చర్మం
వానలో పుట్టిన పరిమళం
పరవశించిన వయసు
కంటిరెప్పల సువాసన

నీటి పాదాలు
నా కన్నీళ్లు

వింత విషం
కాలం


Wednesday, June 01, 2011

.................తెల్లారదు

.................తెల్లారదు. ఎన్నిసార్లు నిద్రించాలి ఒక ఆఖరి రాత్రిలోనే. రాత్రాంతంలోకి రాద్ధాంతం చేస్తూ వచ్చే నల్లటి గాలి మెడని వొదిలి వొచ్చేసే గడ్డిపరకలకి ఎవరు చెపుతారు ఆకాశం అభావమని. నా ముఖం నా చుట్టూ తిరిగేస్తుంటే, స్వదేహ వలసకై ప్రాంతాన్ని ఎంచుకుంటావు. నీ పాములు నీలో యెగిరి నీ కళ్ళల్లోంచి బైటికి అసలు వొస్తాయా. తెల్లారే ఆరే తెల్లటి ఎముకల్ని యేరుకోవాలి. ఏటిలోకీ ఎగిరించాలి. ప్రవహించాలి. నీ ముఖం నీ ముఖమయ్యేలోపే, కొట్టుకుపోవాలి, కొరుక్కుతినేసే కోతి హృదయంలో పురుగులు చేరాలి. రిహార్సలు చేయాలి చనిపోవాలంటే. గమనించు నీ ఆఖరి తేదీ ఏదో. ఎవర్నీ కనుక్కోకు. నీ భగవంతుడి వొంట్లో నిద్రపోయే నీ కన్నుల కన్నీళ్ళనీ అడగకు. నువ్వు దాచిపెట్టిన నీ వీధి ఏదో, తడిలేని మబ్బుకు చెపుతావు. పువ్వులోకి పాకే పువ్వులు, డబ్బుల్లోకి పాకే డబ్బులు, డోకుల్లోకి పాకే డోకులు, తిరస్కృతుల నేలలోకి పాకే తిరస్కృతులు. తెల్లారదు.......................