Followers

Tuesday, May 31, 2011

ఎవర్నీ పిలవకు

ఏదీ........
నీ నిశ్శబ్దాన్ని వినిపించు

నీ నీడల్నీ మోసే
సూర్యుడ్ని చూపించు

నీ పదాల్లో దాగున్న
అక్షరాల్ని అలిఖించు

నీ నగ్న వాయువులో
పుష్పించే వృద్ధాప్యం

నీ సరికొత్త సమాధిలోకి
ఎవర్నీ పిలవకు

ఎవరి జ్ఞాపకాల్లోనో
బీటలేసి నీ అద్దం

సజీవ స్వప్నాల్లోకి
నీ దారి నీకుందా

Saturday, May 28, 2011

అహృది......

ఆనందం, అనాకృతి, అశాంతి, అలజడి, ఆక్రందన, హృది......
దగ్గరయ్యే తొడల చీకటి మధ్యలో
ప్రసవించలేని విరామ విన్నపం
స్మరించే ఫలం, దేహామృతం
మృత్యువు

యెర్ర ఎరని తినే నిద్రే చెప్పాలి
సంస్కార వియోగం

వాక్యం కింద సమాధి
సమాధి కింద వాక్యం

నిన్నటి కలలో పాచి ప్రేమికులు

దాగుడుమూతల
దాగుడుమూతుల కన్నీటి పదాలు

వాసనలు మనసులో

Friday, May 27, 2011

నీ నేత్రం నీదేనా

ప్రతి వాసనొక పశ్చాతాపమే
నిరాటంక సమయంలో

నేత్రం ఎవరిదో
ఎవరికి తెలుసు

ఆగు
ఆగు ...అని పిలిచే మురికి కన్నీటిని
నలుదిక్కుల్లోంచి మోసుకొచ్చే మాటలే
బరువు నాలుకలోనూ

కదలని వాక్యమే సమాధి

కాలమానాల్లేని స్మశానం
ఎవరి దేహంలోనూ ఉండదు

కాస్త విడిపోవటానికే
శవపేటిక భాష

పేగుపోగుల్లో మంటలు
బతికుండే అంత్యక్రియలు

జ్ఞాపక స్థలంలోనో
సూర్యచంద్రులు

గుమికూడిన గుబుల్ని భుజాన్నెత్తుకుని
ఆకాశ తీరంలోకో నడవాలి

పొట్టి వీధులు

చీకటినీ చూస్తాను
మాటలతో
అలసిపోయే చీకటితో

మరొక వాక్యం
కింద
మరొక చీకటి

ఒక నిశ్శబ్దం భయపెడుతోంది
కొంత పొడవుగా

పొట్టి వీధులు
ఆకాశంలో

పంటికింద చీకటిని
వెతికే
కళ్ళు కావాలి

Wednesday, May 25, 2011

పీతకళ్ళతో

నీ నీడని విప్పు
ఐనా నీకు నువ్వు దూరం

మెరుస్తున్న అద్దపు డేరాల్లోంచి
పీతకళ్ళతో తిరుగు

దుఃఖమూ లేని అలలే
తీరాన్ని తాకుతాయి

నీ నిశ్శబ్దం నీ పడవ

నీ దేహాన్ని విప్పు
ఐనా నువ్వే దూరం నీకు

Monday, May 23, 2011

ఎందుకని అడక్కండి

మిత్రులారా...
మీ నుంచి వెళ్లుతున్నది ఎందుకని అడక్కండి

అది దూరమవ్వనీ
అతి దగ్గరవ్వనీ
ఎక్కడికైనా బయల్దేరే చోటు లేకపోతే
తలదాచుకోటానికి మనిషీ లేని పరిసరాల్లో సంచరిస్తాను


ఇరుకిరుకు పట్టాలమధ్య పరుగెత్తుతున్న అనాలోచనలు
వేటిని మోసుకెళ్ళాలనుకున్నాయో
అంచుల్లేని తీరాల్ని తాకాలనుకున్నాయో
సూర్యరశ్మి పాదాల్ని వెంబడిన్చాలనుకున్నాయో
స్వప్న ప్రదోషాల్ని అనువదిన్చాలనుకున్నాయో
అక్షరం చెపుతుంది క్షణంలో
అంతరాంతరాల్లోంచి శ్వాస స్తంభాలు కూలిపోతుంటే

ఇక్కడ ఓటముల్లేవ్
కన్నీళ్ ల్లేవ్
అసలిక్కడ ఎవరు బతికారు

మిత్రులారా...
మీ నుంచి వెళ్లుతున్నది ఎందుకని అడక్కండి

ఆగర్భశోకితుడి లోకం కనిపిస్తోంది
చీకటి పడేలోగా చేరుకోవాలంటే
జ్ఞాపకాల సంచిని దారి మధ్యలో ప్రవహించే
శూన్య పదాల కెరటాల్లోకి గిరాటెయ్యాలి

ఇక సర్దుకోవాల్సిన సరంజామాని వెతకాలి

మిత్రులారా...
మీ నుంచి వెళ్లుతున్నది ఎందుకని అడక్కండి

రా...

వాక్యం మారదు
మూత్రం మారింది

రెండు నాలుకలతో నడవలేను
నిన్ను ఏడుస్తాను

దొరకని పడవలు ఉంటాయి
నిద్రపోయే మసక నిశ్శబ్దంలో

నిన్ను ప్రతిపూటా
ప్రేమించటానికి రాలేను

శ్వాసొక విగ్రహం

అయినా
కొన్ని నిస్సిగ్గు వాక్యాలతో
పదాల్ని చంపి వొస్తాను నిరాయుధుడ్నై

ఇక రా వెంటపడే
కాగుతున్న నీడలి జిమ్ముకుంటూ

ఇల్లు

ఇల్లు పెద్దదవ్వదు
పిల్లలే మరీ పెద్దయ్యారు
రాగలిగిన వాళ్ళు వచ్చెళ్ళారు
కాలం పేరుకుపోయింది కళ్ళ పెంకులపై
ఇల్లొక శవపేటిక

Sunday, May 15, 2011

ఇక ఎవరితో...

పిట్టలకి పువ్వులకి అద్దాలు ఎవరిస్తారు

తుఫాను కంటిలోకి దూకే మెరుపులన్నీ తిరిగిరావా

అంతరిక్షంలో మనిషి మాంసపు ముద్దలు

పిడకలు పిడకలు పిడకలు పీడకలలో

వాక్యమొక నిశ్శబ్ద ప్రపంచం

మాటల దిండుని లాగకు

వ్యక్తావ్యక్తపు దుప్పటిని ఉతుకు

చావొక సున్న

పఠించే ముద్రలన్నీ ఎటుపోతాయి

విడుదలయ్యే జ్ఞాపకాలు ఇక ఎవరితో ఉంటాయి

Wednesday, May 11, 2011

నకిలీ నవ్వు

పువ్వులపై
కొండ నీడ, నీ జ్ఞాపకం
=

నీ నీడ
ఎంతసేపు వానా
=

సూర్యుడా
నీ దువ్వెన ఎవరి జేబులో
=

నీ దూది కళ్లపై
ఎన్నో కలలు, ఎండాకాలం
=

వానలో నీ జుట్టు
చెరిగిపోదా సీతాకోకా
=

అక్షారలకీ, మ్రుత్యువుకీ
దూరం తెలిసేది కాయితపు కంటిలోనేనా
=

ఏదైనా సత్యం ఉండుంటే
విధ్వంసం అందులో ఉండును
=

నీడా
నీ ఇల్లెక్కడ
=

ముడతలుపడ్డ కనుపాపా
నీ ప్రేమ దైవమెక్కడ
=

నా మనసా, ముళ్లపందీ
నీ మాంసం రుచిగా ఉండునా

Tuesday, May 10, 2011

అద్దం

చనిపోయే పిట్ట
ఎగురుతోంది
ఎవరి కంటిలో పడిందో

కన్నే ఎక్కడో
ఎగురుతోంది
ఎవరి చెవిలో పడిందో

ఇక రానని చెప్పే
పెదాలకై అద్దం
నోరుజాపుతోంది

Sunday, May 08, 2011

ఓ తోపుగాడు

మరికొన్ని మాటల్ని చీకట్లో ఉంచి, చీకట్లోంచి చిట్టెలుక అక్షరాల్ని నాలుకపై దిద్దుకొని, అటూ ఇటూ ఎగిరే కెరటాల కంటికంతిలోకి చుట్టుకుపోయే రేయింబవళ్ళనో , రేగుపళ్ళ నిద్రలోంచి బైటికి రాలేక, తోవా లేక, తోపుగాడు నీ పక్కనే, నాపక్కలో, పలకమీద అందపిండాలు, అండపిండాలు పెడుతుంటే, ఎవరి కళ్ళల్లోని కాలో, కలో మాటల్లోకి చేరి చెరిగిపోకుండా, దురదై, దూదై, ధూపమై దేకుతూ మరోచోటేదీ కానరాక, అక్షారాల్ని గోక్కుంటూ రంగురంగుల గులకోసం గుళ్ళస్నానంచేయాలి, ఉంచిన చీకటి మాటలతో.

Saturday, May 07, 2011

~~చూడాలి~~

కొంత. ఎంతోకొంత అంత తీరిక, దొరకనపుడు ఏడ్వాలి. మనుసుని ఓ మెత్తటి ఇసుక సూదితో పర పర కోయాలి చిరగకుండా. అపుడు కొంత రక్తం పోయాలి కంటిలోంచి తీసి. కన్నీళ్లే, పంటిలోపల నన్ను నముల్తూ. కొంతే, నమిలిన కళ్ళల్లోంచి చూడాలి.

Thursday, May 05, 2011

మాటల మౌనం

సన్నటి అక్షరాలపై లావుపాటి కాయితాలు
ఎవరు రాసిన పదాలో

అంత్యక్రియలు పూర్తికావు
~శ్వాస స్థలం భస్మం కాదు ~

ఆకారాలన్నీ సన్నని పాదాలపై మరుగుజ్జు పదాలు
ఎవరు ఎప్పటికి ఎక్కడికి చేరారో చేరాలో

అడుగులు అడుగుజాడలు ఆగడాలు అంతమవ్వవు
~జన్మస్వప్నం అందదు~

కుళ్లిన కాయితపు మెడలో
నా పక్కటెముకల్ని తొడుక్కున్నా

~పక్కకి రా, నీ కల నీకిచ్చేస్తా~
మాటల మౌనం ముసుగులో ఉందో

Wednesday, May 04, 2011

ప్రియుడా!

కన్ను మొదలయ్యే స్థలం
నీ దగ్గరుంటే చెప్పు

అద్దం ఆక్రమించే నేత్రం
నీలో ఉంటే ఎవరికీ చూపకు

స్మశానంకి సాయంత్రమైంది
వాన సమయం ఎవరికో

నిప్పు ఉప్పటి గాలి
తేనేలేని ఎముకలు

మనసులోని చర్మానికి
పాడు దురద

పదం మొదలు నరికేస్తే
నాలుక ఇక పెరగదు

ప్రియుడా!
నీ రాత్రికి విరామసంకేతాలు ఎన్ని