Followers

Monday, October 31, 2011

ఒక మనిషి... మరో పిట్టా... ఇంకో చెట్టూ

1
ఎవరో చెవులతో నివసిస్తున్నారు
ద్వారబంధాలు కూలిన అక్షరాల్లో

కూడలి గోడల
కుంగిన ఓడల మధ్య
విలాసాలను
కూడబలుక్కుంటున్నారింకెవ్వరో

విలాస పదాలే విశాలంగా లేవు
మనసే కదలదు
ఏ పదాల్లోనైనా
తిరిగి చూసే భవిష్యత్తే
గతమై అందరి ముందూ

2
ముందుకు రాని కాలం
తొడుక్కోలేని
నీ స్కూలు నిక్కరు చొక్కా


దరి చేరవు నిశ్శబ్దాలు
ఉదయాలే భయానక మౌనం

ఊపిరి ఊహలే
ఊగిసలాడే ఊలు ఊళలు

సరిపడదు ఏ సలుపూ
సరి తూగదు ఏ మలుపూ

3
చేజారే అద్దాల్లోపల
అద్దంకై వెతకాలి
చూపు మరో నేల కంటిపై

అపుడు తెరెస్తుంది
నిదురపోయే ఆకసానికీ
నిద్ర లేపే రెప్పలకీ
మధ్య ఒక చూపు

అద్దం డంబమనీ
అర్థం దాని బింబమనీ

కనుబొమన కడుతుంది
నేలా ఆనని చూపొకటి

మిణుగురుల మెరవణి నడుమ
కొనమొనతేలి నడక సాగని
ఏరుల తేరు

ఏమయ్యిందీ పాడు లోకానికి
తిరనాల జీవితాన్ని
పంచదెందుకు తలా ఇంత

4
పంచుకునే పతనమేదో
మహోన్నతం ప్రతి నిశ్శబ్దంలో

దరి ఎవరున్నారో
దవ్వున ఎవరు చేరారో
చూడలేని పతన మైత్రది

పవళింపు రాగమే మరో శోకం
ఎవరు నిద్రించారులే ఏ కలలోనైనా

ఎక్కడికి చేరామో
ఎవరికోసమో చేరేది
ఎక్కడెక్కడికో

ఎవరు చెబుతారో
వారి నాలుకపై ఉమ్మివేయండి
వారి ఉమ్మితో కన్నీళ్ళని కడగండి
మరో పిట్ట నాలుక కింద
(కొంచెం నీడ చూపించండి
కొంత నిద్ర పోయే సూర్యుడి కోసమే
జీవించే ఆశని దరి చేర్చండి)

5
తెలవారే
ఓ చెట్టుతో
చెప్పాపెట్టకుండా వెళిపోయింది ఆ పిట్ట
అపరిచితలే చెట్టూ పిట్టా

నడి ఎండలో
బడాయిపోతూ
చెట్టును బులిపించింది పిట్ట

"అతిథీ నీ పేరేంటి?"
పిట్టను అడిగింది చెట్టు

ఎగురుతూ విడిపోతూ
రెట్టిస్తూ వెళిపోతూ
చెట్టుపై రెట్ట వేసి చెప్పింది పిట్ట తన పేరు
"పాట"

సాయం సంజెలో
వాలింది మళ్ళీ పిట్ట
రెమ్మల నీడల చీకటిలో
రెక్కలు ముడుచుకుంది చలిలో
దాచుకుంది బిక్కచచ్చి

హోరుగాలిలో
కొమ్మలు అల్లాడుతుంటే
రెమ్మలు చెల్లాచెదురవుతుంటే
బెంగగా పిలిచింది పిట్టని చెట్టు
"పాటా"


పిట్ట పలకలేదు
చెట్టు నిదుర పోలేదు ఇంకా.

6
మరలిన మౌనపు మాటలకేం తెలుసులే
మాసిన మోసపు మూస మూతల మోహాలు
ఖండిత జ్ఞాపకాలే
రేపటి జ్ఞాపికలు

ఎటో చేరిన చెట్టులో
ఏ కొమ్మ ఏ పిట్టదో
ఎవరకి మాత్రం తెలుసు
పదాల పెదాల్లోని కీటకాలుల
ఏ పిట్ట నోటికో
ఎప్పటికీ చెప్పొద్దు
కలలోని కీటకాల్నీ తినే పిట్టని చూడాలి
పిట్టల్ని తినే స్వప్నాన్ని చూడాలి
స్వప్నాల్ని ఆరగించే మనుషులే
ఇప్పుడు లేరు
ఇక పుట్టరు

7
మనిషి వెతుకుతున్నాడు
ఎడారిలో పిట్టను

పిట్ట నిరీక్షిస్తోంది
నింగిలో మనిషి పాదముద్రల కోసం

చెట్టు కనుల కాయలుకాసింది
వాలే పిట్ట ఆనవాలుకు

*
- అనంతు
ఎం ఎంస్ నాయుడు

2 comments:

హెచ్చార్కె said...

పాటా! బాగున్నావు. వినిపించీ వినిపించని నీ రొద, బహుశా, నాది కూడా. విరిగిన రెక్కలతో(నే)పాట ఎగరడం బాగుంది.

ఎం. ఎస్. నాయుడు said...

thank you sir