Followers

Wednesday, April 28, 2010

ఓ లేత వలయం

మరొక వాక్యరహిత ప్రేమలేఖో, లోకమో
విస్తరించే వైరాగ్య శాంతి శోక ఛాయే, అపరచితం
మేలు లేదు ఎన్ని పదాలతో, మైత్రించినా
శంకించే స్నేహం మరో రూపంలో, రహస్యమే
విధి అనురాగ ధన్యతే, వేదన
దృశ్య భావన ఫలాల నృత్యం, ఓ లేత వలయం
ఒకానొక అవస్థ, వినోదం
సంభాషించే నేత్ర పరిచయం, అదృశ్యం
మంత్రించే మిత్రుత్వం, మౌనమే
ఇదో వింత విలాప మైకం, నువ్వే లేకపోతే
స్వర్గం పృథ్విపై ఉన్నా సుఖం, లేదు
దేహాతీతంగా కొన్ని ఋతువులు, మృగ్యం
ఇప్పటి బంధనాలు నాకు
బహు, దూరం

Tuesday, April 27, 2010

నిస్పృహ

కలలెలా ఉండాలో నిద్రకి తెల్సు. నడవని పడవ నీళ్ళల్లోంచి గాలి అలల్ని నెట్టుకుంటూ, పాలు తాగుతున్న చేపల్ని తప్పించుకుంటూ, చప్పుడు లేకుండా తిరుగుతున్నఅక్షరాల వలని విడుస్తూ, తప్పిపోయే సూర్యస్తనం వెంట బెండు చంద్రుడ్ని ముక్కల ముగ్గులు చేసి విడ్చి పెడ్తే, వాక్యాలు పైకెగురుతుంటే, ముడుచుకొని మడతబడ్తున్న కళ్ళని కాళ్ళతో కడచేర్చే కొయ్యనీళ్లన్నీ తునాతునకలవుతుంటే, వాడిపోయి మీదపడ్తున్న జాజిపూల ఇసుక చెంపల్ని చేరాలని తిరిగొస్తుంటే, కాగితాల గోడలు పుట్టలవుతుంటే, అందులోంచి లుంగీ విప్పుతున్న చీకటి మొలతాడు మూల్గుతుంటే, ఎపుడో, ఇక్కడెక్కడ్నో, ఉన్నాననో, మారిపోయాననో, దుప్పటి ఎముకలు దొ(కొ?)రుకుతుంటే, అప్పటికీ మొదలవ్వని కన్నీళ్ళని పట్టుకుంటుంటే, నేల జిలేబి గుండీల్నిప్పుతూ, హుక్సుల్లేని చేతుల్తో మోహమోసాన్నో, చిగురు చివర చుట్టుకున్న వాసనో, తొడల బతుకో, నెనోదిలొచ్చిన ఇళ్లో, తడబడే చినుకుల్లో పనస మొగ్గల బలం లేనపుడు, ఎంతో దగ్గరి కాంతిలో చూసేది చూస్తుంటే, పిలుపొకటి, ముఖమై మాట్లాడుతుంది మరమరాలు నములుతున్నట్టు, వెనక్కి తూలిన నవ్వుల్తో, బధిర వయసు శరీర వికృతిలో, ఏ కరుణ జిహ్వ అంటులోంచో వటపత్ర స్వప్నాలు, ఇవి నీ చేతుల్తోనే విప్పదీసే వాక్యాలు, వ్యావృత అశ్రువులు, రెప్పపాటులో తరిగిపోయే చీకటి చిందులు, మరునిమిషంలో మాయమయ్యే అపవిత్ర తిరస్కృతి, అడుగుతీసి అడుగేస్తున్న ప్రతి ఆలోచనా బందీయే, ఎందుకో హత్తుకున్న నిద్రలన్నీ ఎవరివి, హరించిన స్వప్న జగత్తు ఎక్కడిది, హడావిడి సోన హాళాహలి ఎంతసేపు, ఎవరికీ తారీఖులు లేనపుడు, గుర్తులేనపుడు, ఛాతీపై సర్పాలు తిరుగుతుంటే, ఎదలోని కప్పలు బైటికొస్తుంటే, విగ్రహాల్లోంచి విపత్తులు రాళ్ళవుతుంటే, అందవిహీన శిల్పాలు వర్ణాలవుతుంటే, మంటల్ని కడుగుతున్నారు మొండెంలేని అక్షరాల రక్త దాహంతో, దిసమొలతో వాక్యాల్ని తడుపుతున్న లజ్జతో, ఖండిత మనో అంగాల కలవరింతల్తో, ఇంద్రజాలమో, ఇంద్రియజాలమో, ఇంగిత ద్రోహమో, బొజ్జోపెట్టు, భోజానాలు పెట్టు, భక్తి పెట్టు, పాటలు పెట్టు, వెన్నెముకల కులకలల్ని చీల్చిపెట్టు, ప్రజాప్రసాదాల్తో నర్తించు, అడ్డు వస్తున్నచెవుల్లో జోలపాడు, నాటకీకరించు, నాలుకల కలలకి పిండ ఆందోళనలు కల్పించు, సౌఖ్యమైన జ్ఞాపకాల్ని ఇవ్వు, ఇవ్వొచ్చు మోజు తీరని రక్తాన్ని, రక్తాన్ని తాగొచ్చు, కలల్ని తినొచ్చు, రా, లేకపోతే తప్పిపోదాం, కల తల కపోల అపోహలో...

Monday, April 26, 2010

ఇంకెంతసేపో

అంతరంగంలో నన్నెప్పుడూ ఉండనివ్వను

పట్టేంత ఖాళీ ఉంటే
నన్ను నన్నుగా ఇరికించే వాణ్ణి

పరాయినై...

నేరేడు గుత్తుల్లాంటి కొత్త ఊహలకి
సీతాఫలాల్లాంటి గతించిన బాధలకి
చలించని వృద్ధ వృక్షానయ్యాను

చరించని పుష్పాలేవో వాహనాలై
తరించని త్రికాల బిందువుకై తిరుగుతున్నాయి

రేపటి రోజులో
నలుదిక్కులూ పర్యటించిన ముఖంలో
ఏ చిరుగుల రాత్రీ లేదు

నిన్న శేషించిన
'పగలు'
ఇంకెంతసేపో

మానసిక వ్యాకరణంతో
వాక్యంతాన్నైనా బంధించాలి


Sunday, April 25, 2010

ఖాళీ వాసన

ఆకుపచ్చటి ఆకాశాన్ని మోసుకెళ్ళే మధ్యాన్నపు నత్తి
అలలు. తలుపు గాలిలో . మాట్లాడే నిశ్శబ్దం.

దేహానికీ, అక్షరానికీ సంబంధంలేని శ్వాసని వింటున్నాను
నోటితో. అక్కడ వొదిలి వచ్చిన కాలం ఎవరికి దొరికిందో.

పదాల దుంపల స్పర్శలో ఖాళీ వాసన. చీకటి
తింటున్న వర్షం. వానపాము ముద్దు నవ్వు.

పువ్వులు తిరుగుతున్నాయి. గాడిదల్ని ఎక్కి . రోత
సుఖం కన్నీళ్ళల్లో. పుల్లటి కలలు. గడ్డిలో.

ఇంట్లోకి సముద్రాన్ని వెంట తెచ్చుకున్నాను. చంద్రుడి
గుర్రాలు నక్షత్రాల్ని మింగి నీళ్ళు తాగటానికి సూర్యుడి దగ్గరకెళ్ళాయి.

Thursday, April 22, 2010

విషాద స్వేచ్ఛ

ఎలా నిద్రపోను
అక్షరాల రొదలో

ఆ మూల నుంచి ఈ మూలకి
మనసు మసగ్గా దేహాతీతంగా
అంతరాంతర నిరీక్షణలో

ఈ తీరం నుంచి ఆ తీరానికి
వెంబడించే నక్షత్రాల నిశ్శబ్దం
అర్థాంతర వాక్య యాతనలో

ఎలా నిద్రపోను
నిద్ర అద్దంలోని దారినెవరో తుడిచేస్తుంటే

అక్కడక్కడ విరావ సదుపాయాలు
అప్పుడప్పుడు కన్నీళ్ల దప్పిక

చేతులెత్తేస్తాం
చేతులిచ్చేస్తాం
చేతనాచేతన అచలిత విషాద స్వేచ్ఛలో

పైకి చూడు
చొచ్చుకొస్తున్న ఊదా గాలి

Monday, April 19, 2010

ఎవరికైనా

ఒక ప్రదేశం నుంచి
ఒక దేహం నుంచి
ఒక పదం నుంచి
ప్రయాణించటం యెంత ఆసక్తికరం

ఒక నిశ్శబ్ద ఆహ్వానం నుంచి
వైదొలగటమూ సమీపించటమూ
నిర్దేహ దృష్టితో అంతమొందటమూ
ఆనంద విఫలమే

చిన్న రాత్రి చాలు
వేల జ్ఞాపకాలు ఒక్క వాక్యమౌటానికి

ఆకాశం ఆగిపొతే
రాత్రి పాదాలు ఇక ఎక్కడ

కలుసుకోలేని కలలు
ఇక ఎవరి భూమిలోనో

తోడూ ఉండని నాలుకకి
ఎవరు స్నేహితులు
ఎవరు హంతకులు
ఎవరు మాంత్రికులు

స్తబ్ద శబ్ద స్మశాన
స్థల స్థన శోధనే ఎవరికైనా

రంగుల సాలీడు

బాధాంగాలన్నీ దొరకట్లేదు
కోసి తీద్దామంటే

ఏది బాధించని
అంగాంగమో తెలియట్లేదు

పాడుబడ్డ పదాల పేద గూటిలో
పెంచుకున్న వాక్య పక్షి ఎగరదు
దిగంతాల దుఃఖమేదీ అందదు

నా రంగుల సాలీడు
వలకి నేనే బందీ

ఇక్కడ చంద్రుడి నీడ పడదు
సంచరించే మాటల పేగులపై సూర్యోదయము కాదు

సర్పస్నేహమే ఎక్కడైనా
అంతరిస్తున్న అంతర్లోక అక్షరాలు

కొవ్వెక్కి బాధపడే బాద్ బోధ నాకొద్దు
మనకొద్దు బాధపెట్టే బోద కన్నీళ్లు

ఎపుడు వినగలను నరుకుతున్న
కలల కంచె చప్పుళ్ళని
ఎన్నో తుమ్మ చెట్లు కళ్ళల్లో

చీకటి గాలిఎదురు పడుతోంది
మీ లోకపు నిద్రలో ఇక తిరగను

Thursday, April 15, 2010

లొంగిపోగలమా...

లొంగిపోతాం కొన్ని మాటలకే
మనకే తెలియని మనవే అయినా

అవి
చైత్రమాసపు కారు మబ్బుల్లోంచి వాలొచ్చు
నిరాశాజనకమైన కిటికీలోంచి రావొచ్చు
దాహార్తి నశించని ఆసుపత్రి గదుల్లోంచి వినవచ్చు
నిర్లజ్జ దుఃఖ శరీరాల్లోంచి బైటపడొచ్చు
పిల్లల కలవరింతల్లోంచి ఎగరొచ్చు
అప్రియమైన శాంతి వాక్యాల్లోంచి పాకొచ్చు
ఆఖరి నిద్రో సమీపించే ఆసందర్భంలో దూరొచ్చు
అన్ని అక్షర బంధనాల్నీ తిరస్కరించి చేరొచ్చు
నిరాశ్రయుడి పలవరింతల్లోంచి తప్పి గెంతొచ్చు
ఏదో ఒక నేత్ర రత్యానంతర జుగుప్సతో జారి పోవొచ్చు

కొన్ని మాటలు మనకీ కనిపించవు
ఇంకొన్ని మనల్ని ఉరితీస్తుంటాయి ఎల్లప్పుడూ

డాలీనందుకోలేక…

అనంత బాహ్యార్థ స్థిమిత సంజ్ఞల్లో
కలిసిపోయిన వేగుచుక్కలు

మెరిసే కొంగ రెక్కల్లో వ్యామోహార్తికి
నీలి గుర్రాల చప్పుల్లో
జారిన చినుకుల్లో వాన

అనేకానేక మూర్త భంగిమల్లో పేర్చుకున్న
గాలి కలలు తెగిపడుతున్నాయి
ఆధోజగత్తులో

కామోప్రేత స్ఖలనాలింగానాల చిట్ పట్ లు
చల్లగా కోస్తున్నాయి

రాల్తున్న శిరోజాల్లో అంటిన బంక ఇసుకని
తోసుకుంటూ అక్షరాలు

చనిపోయిన అస్తిత్వ ఎముకల్లో గూడుకట్టుకున్న
ఆలోచనలు ఇంకా వదలడం లేదు కళేబరాన్ని

బయటకొచ్చిన చూపు విసిగిపోయింది
దేహంతో

ఉండగా మారిపోతున్న ముఖంలో అద్దం
కపాలంగా కన్పడి కన్తడిలో ఎండి
పేడులా కూరుకుపోయింది భూమిలో

ఏక నేత్ర దృశ్యాల్లో అంతరంగ శబ్ద ప్రపంచం
రాగంలా విన్పడుతోంది గిటార్ నీడలో

క్షణాలు కరిగి అభౌతిక సెగలో కాలి
వ్రణ వ్రణాలుగా గడ్డకట్టి
వరసగా నీళ్ళల్లో ఈదిన ఆల్చిప్పలు
భయం భయంగా భూగర్భంలో నృత్యం చేసి
మసక మసక లేత చేప రెక్కలు
నిశ్శబ్ద భూమ్యాకాశ మధ్యలో సాగుతూ వేలాడి
పీచు పీచుగా నాచులో జాగ్రత్తగా
నడుస్తో హృదయావేశం

విసిరేసిన వక్షోజాలు జారుడుబల్లలో
ఆగిపోయి కలలు కంటున్నాయి

వ్యవహార నియంత్రణా జాగరణలో
మూర్తీభవించిన చీకటిలా శోక
శకలాలు పడ్తున్నాయి స్వప్నంలో

నోర్విరిచిన ఖాళీలో వానపాము ఆటలో
దిగబడిన బాటలో కూర్చున్న మాటలు
రంధ్రంధ్రానికీ మధ్య వెడల్పుగా నీడలు

Tuesday, April 13, 2010

పీడకుడు

వాయువో ఆయువో
జ్ఞాపక జ్ఞానమో
సదా పీడిస్తుంటుంది

విశాల వైరాగ్య భూమి
ఆహ్వానం లభించదు

ఎవరి స్పర్శల్లోంచో
పదాల నింగికై ఎదురు చూస్తుంటాం

ఇదో చిన్న అద్దపు బుడగ
అక్షరాలా పాదాల్ని కళ్ళల్లో
పెట్టుకుని ఎగురుతున్నట్టు

ముఖాల్ని కాయితపు పడవల్ని చేసుకుని
తిరుగాడే వాక్యాల మధ్య కొన్నినిద్రలు ఉండవు

వడలిపోయే రోజుల్ని వెంటేసుకుని
సమాధి ఆకాశంలో ఎగరబోయేవి ఇంకెన్ని శ్వాసలో

పునరావృతమయ్యేవే మిగిలి ఉండవు
అవన్నీ కుబుసాలు దాచుకుంటున్న ఆత్మలే

వాటి గురించి ఇపుడెందుకులే
సూర్యుడు నిద్రపోతున్నాడు

చీమలు ఎలా నిద్ర పోతాయో
ఎవరు చెప్తారు

కన్నీటిలో కళ్ళు ఉండవు
అవే ఊరకనే వృధా అవుతాయి

నేనే నా పీడకుడ్ని

Saturday, April 10, 2010

ఆయువై

రాత్రంతా భుజాన్నేసుకుని
చంద్రుడ్ని ఆకాశం తిప్పింది

కలల వెన్నెల్లో సేదతీరిందో
సూర్యుడు నిమిరిన ప్రపంచమంతా బిత్తరపోతోంది

ఎన్ని నక్షత్ర జలపాతాల్లోఆడుకుందో
విశ్వ విలాస ఆనందం విస్తరిస్తోంది

ఎంతకీ దొరకని నిద్రేదో
ఆహ్వానించని ఆయువై ప్రవేశిస్తోంది

ఇక
ఇహపరాలు పర పర

Friday, April 09, 2010

నేను రాత్రి

రాత్రి లేని నేను
లేని నేనులో రాత్రి

చీకటి, ఏకాకిగా
దోబూచులాడే ప్రయాణం, ఒంటరిగా

తపనో, తనువో, తమస్సో
త్రికాల శూన్య నిశ్శబ్దమో
అలిగి, వెలిగి, మరిగి
ఏకమౌతాయేమో

మౌనంలో రంగులు కనిపించవు
నిజాల్ని ఊహించాలేమో

కల నిజమే
దేహం నాదైతే

నీడల నింగికి
కలవనివో, విడిపోయేవో, సాగిపోయేవో ఉంటాయి
సులభ విరక్తో, వొడలిన చూపో, అందని ఆనందమో ఉండొచ్చు

తొలి చినుకై
నేనుత్త నేనై
వెంటపడని రూపమై
కోరుకోని కనుపాపై
నేనూలేని దీపమై
చెరిసగం చెరిపేసుకుని
దగ్గరి దగ్గరి పెదవుల చావునై
మిగులుతాను మర్చిపోయిన నాలో నాతో

అద్దమో, అశ్రువో
ఒకే ఒక వింత శబ్దం
పిలుస్తూనే , అరుస్తూనే
అల్లరల్లరిగా కౌగిలించుకుంటుంది
దుఃఖ దేవతలెవరూ ఉండని చోట

శ్రుతో, శ్రోతో, సూక్తో
అయ్యే జ్ఞాపకాలొద్దు

ఇక భవిష్యత్తు అంతరించింది
నా సొంతవంటూ ఏమీ లేవు
మృత్యువు తప్ప

రాత్రీ!
నేను నీలా అవుతానా
నీలా నేనవుతున్నానా

Thursday, April 08, 2010

నిహతి

ఒళ్లు మరచిన ఆకలీ!
నా రహస్య నిశీధ శోకంలోకి
అమాంతం అడుగెడ్తావెందుకు

అసలు తలంపు తలుపు తీసిందెవరు
ఒచ్చి ఉన్నాక ఉండే ఉత్త
వృత్త వాయువుకై బెదురు చూపెందుకు

నిరూహ నిర్దగ్ధ నిత్య నర్తకీ!
ఇదంతా ఇంతేనని
గర్భ చక్షువు వీక్షించేదేమిటి

హృదయ వ్యాలోల విరావం ఎందుకు
పదిగాడ్పుల గరుకు గురుతుల కానుక
పంపేలోగా ఆ విచిత్ర వణుకేదో చెప్పేయ్

ఎప్పటికప్పుడు ఇతరేతర పదాలతో
అప్పటికప్పుడు సంచార ఊహలూరుతుంటే
అనువదించాల్సినవి మాయమౌతుంటే

తేలుతున్న తడబడ్తున్న తెగుతున్న
తప్పిపోతున్న తెప్పరిల్లుతున్న తరలిపోతున్న
తాలులో మునిగున్నా

ఏ మాలిన మహోదయమో
ఈ మస్కరి ముమూర్షువుకి

అంతేలే
అంతులేదులే
నీ భీతావహ సస్వరూప పాతాల తృప్తికి

Wednesday, April 07, 2010

మబ్బుల వల

ఒడ్డుకి చేరిన అలని
చేప లోపలికి లాగుతోంది
-----
తటాకంపై
లేత దద్దురు
కప్ప మునిగింది
-----
అద్దంపై చీమ
తోడువస్తున్నది
నిజమైన చీమేనా
-----
భయపడుతున్న కలలు
నిద్దట్లో పాపాయి
వాటిని తంతోంది
-----
ఎవరి శిశువునో
వృద్దుడవ్వాలని లేదు
-----
నాలోని ఖాళీ స్థలం కోసమే
వెదురు పువ్వుల ఎదురు చూపు
-----
ఈశాన్యంలో చంద్ర గ్రహణం
అస్తమించే కొంగల నెలవంక
-----
వాన వెలిసింది
పౌర్ణమిని
ఆటకి పిలిచాయి చేపలు
-----
ఆమె వద్దకు అత్యాశతో
అనంత వ్యధతో వెళితే
ఎందుకొచ్చావంది
-----
వైరాగ్య ద్వారాలు లేవిక్కడ
పంచ భూతాల విన్యాసాల లోలుడ్ని
-----
అమోహ విలయంలో
వాక్యాన్ని వెతుక్కునే
దృష్టినిస్తావా
-----
మృత్యు ముఖంలో
మత్స్య మాలిన్యాన్ని
శుభ్రపరిచేదెవరు
-----
రెల్లుపొదల గాలిలో
పిట్టల రెక్కల పాటలు
ప్రేమ దొరికింది ఆకాశానికి
-----
మరలా రాని
మోక్షమే
బతికుండటమేమో
-----
ఇల్లు విడిచెళ్ళే
సూర్యచంద్రుల కింద
ఇంకొంత దూరాన్ని చుట్టివస్తా
ఇక పిలవకు

అనాధ

సమాధిలో దాగిన తారీఖు ఒకటి
తారీఖు దాచిన కాలమొకటి
కాలాన్ని దోచిన ప్రాణమొకటి
దొర్లుతున్నాయి పరాగత స్వప్నాల్లో

ఉత్త మాటలు మూగిన
శూన్యవర్ణం అది

దృశ్యాలు చెరిపిన
ఈబరి అది

ఆనందనేత్రం పరిభ్రమిస్తున్నా
ప్రకృతి పొందలేని రూపమది

సర్వత్రా శాంతి భూతం ఆవహిస్తోంది

ఇక భూమండలంపై
దుఃఖక్షేత్రాలు అంతరిస్తున్నాయి

రోదసి సమాధిలో
ఎగిరే తారీఖే
కడు అనాధ శవం

Tuesday, April 06, 2010

పద... దూరమౌదాం

కన్నీటి బొట్టుని చదవటానికి
నీ వద్దకు వొస్తాను

నువ్వు దాన్ని తీస్కొని
విసిరేస్తావు నా మనసు మారుమూలల్లో

వెతుక్కుంటాను కళ్ళ మధ్య
ఇంకేమైనా దొరుకుతాయేమోనని

నీ నుంచి మరలిపోవాలనిపించదు
కావాల్సింది ఏంటో అడగలేను

మనుషుల మీద ఇళ్లున్నాయి
ఇళ్ల మీద సమాధులున్నాయి

కళ్ళ కోసం సమాధులు లేవెక్కడా

దూరమౌదాం ఇపుడే
కన్నీళ్ల అడుగుల్తో

అనామయం

కారణాల కరుణతో కూడదీసుకున్న
కొద్దిపాటి కలల్నీ కూలగొట్టకు

కరుగుతున్న పదాల ముఖాల్లో
చివరి మనసు తేలుతోంది

జనించే నిశ్శబ్ద నక్షత్ర నేత్రాల్లో
నిరూహల నిరాశ్రయ నిస్తేజం

మౌన దుఃఖమెంతకూ తాకదు
ప్రవహించే కంటి లోయల్లో

మనమెంత దూరమైనా
ప్రేమ ఊపిరి గుండెల్లో

బహు సామీప్య అశ్రువులే
దీవెనలై సుధలై మృగాలై

చూస్తున్నవన్నీ చేర్చే
వాక్యవాయువుని చిత్రించాలి

అనిత్యం

అక్కడి నిజం ఇక్కడిది కాదు
కడలి కలవరమంతా చేరేదెక్కడికి
ప్రతి ప్రతిమకీ నీడ ఉండదు
ఉక్కిరి బిక్కిరి కన్నీళ్లు
ఎన్నెన్నో రోష సంకోచాలు
సో సో భోగాలు
నో నో న్యాయాలు
మాటల తోడుతో
స్పర్శల గమ్యమేది
చర్మ శోకాలేవి
నేత్ర స్వర్గమేది
ప్రార్ధించే పెదాల్లో కత్తులు
కన్నులోని కంటికి చోటులేదు
కంటికింద కన్నీళ్ళకి చూపులేదు
అర్బన్ కార్బన్ పేపర్ బంధాలు
కాలం తాకిన చప్పుడు
గెట్ అవుట్

Monday, April 05, 2010

ఉమ్మలికం

శరీరాంతర శోకంతో ఏమి తర్కిస్తాం
నిశ్చల పదముద్రల్లో అర్థమెక్కడిది
ప్రేమించే దేహం అవతల ఎవరున్నారు
పసిమి స్వప్నాల దెందంలో ఎన్ని రంగులున్నాయి
జాలి నిండిన జల్లెడలో మిగిలిన పదాలెన్ని
అంతిమాశ్రువుల్ని పలకరించిన అధరం ఎవరిది
ఉజ్వల ఉషస్సుల గమ్యం చూపలేదని అలిగిందెవరు
కపట రేఖల పుష్పాల్లోని మాధుర్యం ఎవరికి
ఉదర ఉద్యానవనంలోని కంటకాల్ని తొలగించేదెవరు
పసిపిల్లల పాలబొమ్మలు ఎక్కడ ఆడుతున్నాయి
అలిఖితానంద కాలధూళిని అంజలించేదెవరు
పెదాల చీకట్లో గగన దర్పాన్ని దాచిందెవరు
నయన విచ్చిత్తిలో నిరీంద్రియమవ్వటం తెలుస్తుందా
ప్రఫుల్ల దీప తోరాణాల్ని కూర్చిందెవరు?

Sunday, April 04, 2010

కృత్రిమ మిత్రుడు

స్నేహితుణ్ణి కాను
వెర్రిబాగులోన్ని
వర్ణమాలతో పాటు స్నేహమాలని నేర్చుకోలేకపోయా

స్నేహ చిహ్నాలు
స్నేహలిపి అలభ్యం
ఎవరికీ ఏమీ కానివాన్ని

ఏకకాలంలో తెలియజెప్పే జరామరణాల్ని
చూసే అద్దం ఎక్కడుంది
వృద్ధత్వం లేని మితృత్వం ఎవరికుంది

నీతి విచక్షణలు నాకు లేవు
దీపాల కన్నీటి ఈటెలు దిగబడుతున్నా
నీడల కళ్ళల్లో భయం పోదు

పై పై కొస్తున్న చినుకుల గుంపు
మెడ తెగిన వడగల్లై కుక్కగొడుగులై
జారుతున్న ఆకులౌతున్నప్పుడు ---

తేలుతూ ఓపికలేని గాలి
పడిలేస్తూ కంటి కిందకి చేరింది

ఏదో ఆతృతలో
ఎక్కడికి చేరిందో చూసుకోలేదు
కరకు ఎదల వాకిట్లో నిలబడింది

ఎందుకొచ్చావని అడగట్లేదు
బతికున్నందుకు నిలదీశారు
ఆ దారేదో చెప్పండి వెళ్తానంది

కౄర వాక్యాల్ని మోసుకెళ్లలేనంది
నాకు అక్షరమైత్రి లేదంది
దారులన్నీ బూజుపట్టి ఉన్నాయంది

అంతమవ్వని అహం
నా కృత్రిమ మిత్రుడు

Saturday, April 03, 2010

అవ్యక్తం

ఎంత రాసినా పెన్సిల్ ములుకు
ఒక్క వాక్యం కూడ పూర్తి చెయ్యదు

అంతరంగం
దుఃఖంలో పరిచయం కాదు

నూకలు తిన్న సూర్యుడు
ఎక్కడ ఆడుతున్నాడో

ఏ మైదానంలోంచో
దారి తప్పి ఒచ్చిందొక సాయంత్రం

పెన్సిల్ గీతల్తో
ఒక అద్దాన్ని తయారుచేసాను

నా ముఖాన్ని తుడిచేసాను

Friday, April 02, 2010

కొన్నిసార్లు ...

పరిగెత్తే అద్దం
సుదూరాన్ని చివరిగా చూసే పదాన్ని వెతుకుతుంది

శాంతించని పుష్పాలే
ఎక్కడికక్కడ మౌనభూమికై రాలుతున్నాయి

కట్టుడు నాలుకలు
దిగంతాల జ్ఞానాన్ని చప్పరిస్తున్నాయి

గాలి లోపలి నది
తీరం చేరని భయాన్ని మోస్తోంది

కుంటుతున్న దీపం
పాప పుణ్యాల్ని చెదరకోడుతోంది

దేహమయ్యే వాక్యాల్ని
అంటాం అంతిమ అందాలని

రాత్రినే
దాచిపెట్టు నేలవంకకీ తెలియకుండా

ఆమె అతడ్నీ
అతడు ఆమెను నీలో చూశారు

స్పర్స ప్రవాహాల శోకమే
ఆఖరి ఆకాశం

తరలివొచ్చే అలలే
ఎటు చూస్తాయో చెప్పవు

కొన్ని రాళ్ళే
మరికొన్ని కళ్ళు